Abn logo
Oct 25 2021 @ 00:55AM

ఆస్తిపన్ను వివాదం

రామగుండం కార్పొరేషన్‌ కార్యాలయం

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందాలను కాదని అధిక ఆస్తి పన్ను

- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సింగరేణి

- రాష్ట్ర ప్రభుత్వానికి జెన్‌కో ఫిర్యాదు

కోల్‌సిటీ, అక్టోబరు 24: ఆస్తిపన్ను విషయంలో రామగుండం నగర పాలక సంస్థకు, సింగరేణికి మధ్య వివాదం నడుస్తోంది. పన్నుల రాయితీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తమకు జరిగిన త్రైపాక్షిక ఒప్పందాలను నగర పాలక సంస్థ పరిగణనలోకి తీసుకోబోవడం లేదని సింగరేణి ఆరోపిస్తోంది. మున్సిపల్‌ చట్టాన్ని ముందు పెట్టి ఏకపక్షంగా రాయితీలను రద్దు చేయడంతో పాటు పెంచిన పన్ను ఐదేళ్ల బకాయిలు చెల్లించాలంటోందని సింగరేణి పేర్కొంటున్నది. కాలనీల నుంచి చెత్త తీయకున్నా క్వార్టర్‌కు రూ.40 ఇవ్వాలంటూ బలవంతపెడుతోందని, దీనిపై సింగరేణి, జెన్‌కోలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. కేంద్ర ప్రభుత్వం బొగ్గును జాతీయ సంపదగా గుర్తించింది. దేశానికి వెలుగునిచ్చేందుకు బొగ్గు సంస్థలు బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సింగరేణి సంస్థకు పలు రాయితీలు ఇస్తున్నాయి. అలాగే వీటి మధ్య పలు కీలకమైన ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సింగరేణి విస్తరించి ఉన్న గోదావరిఖని, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో నూతన ప్రాజెక్టుల తవ్వకాలకు సంబంధించి 12ఆగస్టు 2020న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణికి మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఇందులో మూడో అంశంగా బొగ్గు గనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో స్థానిక సంస్థల్లో ఆదాయ, సర్వీస్‌ పన్నులపై ప్రస్తుతం ఉన్న రాయితీలను కొనసాగించాలని ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని లీజులను వెంటవెంటనే మంజూరుచేయాలని, సింగరేణికి ఎక్కడా ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అయితే రామగుండం నగర పాలక సంస్థ ఈ కీలక ఒప్పందాన్ని బేఖాతరు చేస్తోందని సింగరేణి ఆరోపిస్తోంది. నూతన మున్సిపల్‌ చట్టం 2019ని అనుసరించి ఆస్తి పన్ను రాయితీలను రద్దు చేయడమే కాకుండా రూ.4కోట్ల అదనపు పన్నులను విధించిందని పేర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌ చేసుకున్న ఒప్పందాన్ని కాదని రామగుండం నగరపాలక సంస్థ యంత్రాంగం అధిక పన్నులు వసూలు వేయడం వివాదానికి దారితీస్తోంది. 

భారీగా పన్ను..

సింగరేణితో పాటు ఎన్‌టీపీసీ, టీఎస్‌జెన్‌కోలకు ఇప్పటివరకు రామగుండం నగర పాలక సంస్థ ఆస్తి పన్నులో రాయితీ ఇస్తోంది. ఆ సంస్థలే టౌన్‌షిప్‌ల నిర్వహణ, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ చేస్తుండడం వల్ల ఈ రాయితీలు ఇస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి సంస్థకు రాయితీ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయి. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, జెన్‌కోలకు కలిపి మొత్తం 12,548క్వార్టర్లు ఉన్నాయి. సింగరేణికి సంబంధించి 8,846 క్వార్టర్లకు ఇప్పటివరకు ఏటా రూ.1.25కోట్ల ఆస్తిపన్ను విధిస్తున్నారు. ఇది ఏకంగా రూ.6.79కోట్లకు పెరిగింది. గతంలో ఆస్తి పన్నులో ఇస్తున్న 50శాతం రాయితీని తొలగించడంతో 2019మున్సిపల్‌ చట్టం సెక్షన్‌ 103 ప్రకారం అసెస్‌మెంట్‌, రీఅసెస్‌మెంట్‌, కరెక్షన్స్‌ ప్రకారం కమిషనర్‌ దృష్టికి వచ్చిన వాటిని ఐదున్నరేళ్లకు ఎక్కువ కాకుండా పెంపునకు కానీ తగ్గింపునకు కానీ అవకాశం ఉండదు. ఈ చట్టాన్ని ప్రయోగించి ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి ఐదున్నరేళ్ల బకాయిలను వసూలు చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ రూ.1.26కోట్లు, ఎన్‌టీపీసీ రూ.2.21కోట్లు చెల్లించింది. సింగరేణి మాత్రం తమకున్న ఒప్పందాలను తెరమీదకు తెచ్చి కార్పొరేషన్‌ వైఖరిని తప్పుబడుతోంది. 

చెత్త సేకరణ చార్జిలే రూ.60.23లక్షలు

రామగుండం నగర పాలక సంస్థపరిశ్రమలకు సంబంధించిన క్వార్టర్ల నుంచి ఇంటింటా చెత్త సేకరణకు రూ.60.23లక్షల యూజర్‌ చార్జీలను వసూలు చేస్తోంది. ఒక్క క్వార్టర్‌కు నెలకు రూ.40చొప్పున సంవత్సరానికి రూ.480 వసూలు చేస్తున్నారు. వాస్తవానికి నగర పాలక సంస్థ ఒక్క క్వార్టర్‌ నుంచి చెత్త సేకరించడం లేదని సింగరేణి పేర్కొంటోంది. 

సింగరేణి అప్పీల్‌.. జెన్‌కో ఫిర్యాదు..

రామగుండం నగరపాలక సంస్థ పన్నుల తీరుపై సింగరేణి సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. 2003లో తమకు రాయితీ ఇస్తూ అప్పటి రీజినల్‌ డైరెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారని, ఈ రాయితీలను కొనసాగించాలని గత ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయని సింగరేణి పేర్కొంటున్నది. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ నగరపాలక సంస్థ కమిషనర్‌కు లేఖ పెట్టినా మాజీ కమిషనర్‌, ఐఏఎస్‌ అధికారి తిరస్కరించారు. దీనిపై సింగరేణి సంస్థ రీజినల్‌ డైరెక్టర్‌(మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌)కు అప్పిల్‌కు వెళ్లింది. మరోవైపు జెన్‌కో కూడా మున్సిపల్‌ కార్పొరేషన్‌ వైఖరిపై అసంతృప్తితో ఉంది. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. 

సీఎస్‌ చేసుకున్న ఒప్పందాన్ని..

రాష్ట్ర ప్రభుత్వానికి పాలనపరంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే బాధ్యులుగా ఉంటారు. జీఓల్లో, గెజిట్‌లలో ప్రభుత్వం అనే పదానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బాధ్యులు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రంతో, సింగరేణి యాజమాన్యంతో త్రైపాక్షిక ఒప్పందాన్ని చేసుకున్నారు. అలాంటి ఒప్పందాన్ని ప్రభుత్వ ఆధీనంలో నడిచే నగరపాలక సంస్థకు కమిషనర్‌ ఎలా ఉల్లంఘిస్తారనే దానిపై చర్చ సాగుతోంది. పన్నుల రాయితీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సింగరేణి చేసుకున్న ఒప్పందాలను నగర పాలక సంస్థ బేఖాతరు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.