బకాయిలు కొండంత..వసూళ్లు గోరంత !

ABN , First Publish Date - 2020-06-01T10:20:24+05:30 IST

జిల్లా పరిధిలోని నగరపాలక, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి.

బకాయిలు కొండంత..వసూళ్లు గోరంత !

మున్సిపాలిటీల్లో పేరుకున్న ఆస్తి పన్ను బకాయిలు

పాతవి, కొత్తవి కలిపి ఎన్‌ఎంసీలో రూ.100 కోట్లు

వసూళ్లు కేవలం 6.4 కోట్లే..

మిగిలినచోట్ల బకాయిలు రూ. 22 కోట్లు

వసూలైందిమాత్రం రూ. 6కోట్లు

ఓ వైపు ఎన్నికలు, మరో వైపు కరోనా

వసూళ్లు ఆగిన వైనం

నేడు కాంట్రాక్టు కార్మికులకు జీతాలు ఇవ్వలేని స్థితి


నెల్లూరు, మే 31(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా పరిధిలోని నగరపాలక, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. నెల్లూరులో మాత్రం పాతవి, కొత్తవి కలిపి వసూళ్లు కావాల్సిన ఆస్తి పన్నుల మొత్తం సుమారు రూ. 100 కోట్లు. మున్సిపాలిటీల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో ఈ ఏడాది వసూళ్లు కావాల్సిన బకాయిల మొత్తం రూ. 22 కోట్లు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది కాలంగా మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నుల వసూళ్లు పూర్తిగా మందగించాయి. ఈ పరిస్థితికి ఎన్నికలు ఒక కారణం కాగా, ఇప్పుడు కరోనా మరో కారణంగా మారింది. ఆస్తిపన్నుల వసూళ్లు స్తంభించిపోవడంతో మున్సిపాలిటీలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించలేక, కరెంట్‌ బిల్లులు కట్టలేక సతమతం అవుతున్నాయి. ఆస్తిపన్ను వసూళ్లలో ప్రగతి సాధించడం కోసం ప్రభుత్వం రాయితీ కూడా ప్రకటించింది. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. 


నగరంలో రూ. 100 కోట్లు

ఆస్తి పన్ను బకాయిల్లో నెల్లూరు కార్పొరేషన్‌ టాప్‌లో ఉంది. ఈ ఏడాది డిమాండ్‌ 41 కోట్లు కాగా, పాత బకాయిలు 59 కోట్ల వరకు ఉన్నాయి. మొత్తం రూ. 100కోట్లు బకాయిలుంటే ఇప్పటికి వసూళ్లు మాత్రం రూ. 6.40 కోట్లు దాటలేదు. కావలి మున్సిపాలిటీ డిమాండ్‌ 5.58 కోట్లు కాగా, వసూళ్లు 1.58 కోట్లు, గూడూరు డిమాండ్‌ 6.63 కోట్లు అయితే, వసూళ్లు కేవలం 65లక్షలు, నాయుడుపేట బకాయిలు రూ.4.50 కోట్లు అయితే, వసూళ్లు 72లక్షలు, వెంకటగిరి డిమాండ్‌ రూ.1.95 కోట్లు అయితే వసూళ్లు 50లక్షలు, ఆత్మకూరు డిమాండ్‌ 5.50 కోట్లు కాగా వసూళ్లు 1.58 కోట్లు మాత్రమే. మెజారిటీ మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్ల శాతం సింగిల్‌ డిజిట్‌ను మించలేదు. పన్ను వసూళ్ల వేగం పెంచడానికి సెప్టెంబర్‌ సెమిస్ట్‌ మొత్తంపై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. జూన్‌ 30వ తేదీ లోపు ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఆరు నెలల కాలం పన్ను మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే పన్ను మొత్తంలో 5 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. అయినా వసూళ్లలో వేగం పెరగలేదు. 


ఎన్నికల పోటు- కరోనా కాటు

గత ఏడాది ఆరంభం నుంచే మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్లు మందగించింది. దీనికి ఎన్నికల వాతావరణం ఒక ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు రావడంతో పన్ను వసూళ్లపై ఒత్తిడి పెంచవద్దని నాయకులు కోరారు.దీంతో అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. సాధారణంగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబటి ఫిబ్రవరి, మార్చి నెలల్లో పన్ను చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి. అధికారులు కూడా ఈ రెండు నెలల్లో ప్రజలపై ఒత్తిడి పెంచుతారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది. దీంతో మళ్లీ రాజకీయ జోక్యం పెరిగింది. దీనికి తోడు సిబ్బంది కూడా ఎన్నికల పనుల్లో మునిగిపోయారు. ఇంతలోనే కరోనా వచ్చింది. మార్చి నెలాఖరు నుంచే లాక్‌ డౌన్‌ అమలు కావడంతో పన్ను వసూళ్లు పూర్తిగా స్తంభించిపోయాయి.


ఆర్థిక సంక్షోభంలో మున్సిపాలిటీలు

 ఆస్తిపన్ను వసూళ్లు కాకపోవడంతో  అన్ని మున్సిపాలిటీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలంటే పన్నుల రాబడి నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే వీధి దీపాలు, తాగునీటి మోటార్ల విద్యుత్‌ చార్జిలు, మన్సిపల్‌ పారిశుధ్య, నీటి రవాణా వాహనాల డీజల్‌ బిల్లులు తదితరాలు ఈ నిధుల నుంచే ఖర్చు చేసుకోవాలి. పన్నుల వసూళ్లు పూర్తిగా మందగించడంతో కాంట్రాక్టు కార్మికులకు జీతాలు ఇవ్వలేక, వాహనాలకు డీజిల్‌ బిల్లులు చెల్లించలేక మున్సిపాలిటీలు అల్లాడిపోతున్నాయి. 

Updated Date - 2020-06-01T10:20:24+05:30 IST