పురుషులకు పొంచి ఉన్న ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-12-28T18:02:28+05:30 IST

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌... పురుషుల్లో తలెత్తే అత్యంత సాధారణమైన క్యాన్సర్లలో ఒకటి. భారతదేశంలో ఈ కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది.

పురుషులకు పొంచి ఉన్న ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

ఆంధ్రజ్యోతి(28-12-2021)

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌... పురుషుల్లో తలెత్తే అత్యంత సాధారణమైన క్యాన్సర్లలో ఒకటి. భారతదేశంలో ఈ కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. అనేక ప్రొస్టేట్‌ క్యాన్సర్లలో పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. అవి ప్రొస్టేట్‌ గ్రంధికే పరిమితమై ఉంటాయి. అక్కడ అవి తీవ్రమైన హానికి కారణం కాకపోవచ్చు. దీర్ఖకాలికంగా నిలిచి ఉండొచ్చు. కాగా, కొన్ని రకాల ప్రొస్టేట్‌ క్యాన్సర్ల పెరుగుదల నెమ్మదిగా ఉన్నప్పుడు, కనీసమైన చికిత్స అవసరం కావచ్చు. లేదా చికిత్స పూర్తిగా అవసరం లేకపోవచ్చు. అయితే ఇతర రకాలు తీవ్రంగా ఉంటాయి. త్వరగా వ్యాప్తి చెందుతాయి. వాటికి శక్తిమంతమైన చికిత్సా విధానం అవసరం కావచ్చు. 


ఎలాంటి లక్షణాలు లేకపోవడం నుంచి మూత్ర విసర్జనలో నిర్దిష్టమైన లక్షణాల వరకూ... ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ లక్షణాలు భిన్నంగా ఉంటాయి. 


బాగా ముదిరిన ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ రోగుల్లో ఈ చిహ్నాలు, లక్షణాలు ఉండొచ్చు:


మూత్ర విసర్జనలో ఇబ్బంది


మూత్రం ప్రవాహంలో వేగం తగ్గిపోవడం


మూత్రంలో రక్తం పడడం


ఎముకల్లో నొప్పి (వెన్ను నొప్పి సర్వసాధారణంగా ఉంటుంది) 


వివరించలేని విధంగా బరువు తగ్గిపోవడం


అంగస్తంభన లోపం 


ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పును పెంచే అంశాలు

వృద్ధాప్యం

వయసు పెరుగుతున్న కొద్దీ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువవుతుంది. 50 ఏళ్ళ వయసు తరువాత ఇది సర్వసాధారణంగా తలెత్తే అవకాశం ఉంది. 


కుటుంబ చరిత్ర

మీ తల్లితండ్రుల్లో ఒకరు, తోబుట్టువులు లేదా పిల్లలు తదితర రక్త సంబంధీకుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్టు నిర్ధారణ అయితే, మీకు ముప్పు పెరగవచ్చు. అలాగే, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ (బిఆర్‌సిఎ1 లేదా బిఆర్‌సిఎ2) ముప్పును పెంచే జన్యువులు ఉన్న కుటుంబ చరిత్ర మీకు ఉన్నా లేదా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్న అత్యంత బలమైన కుటుంబ చరిత్ర ఉన్నా, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు మీకు ఎక్కువగా ఉండొచ్చు. 


స్థూలకాయం 

ఆరోగ్యకరమైన బరువు ఉన్న వ్యక్తులతో పోలిస్తే స్థూలకాయం ఉన్న వ్యక్తుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉండొచ్చు, అయితే అధ్యయనాలు భిన్నమైన ఫలితాలు చూపిస్తున్నాయి. స్థూలకాయులైన వ్యక్తుల్లో... క్యాన్సర్‌ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రాథమిక చికిత్స తరువాత సాధారణ స్థితికి రావచ్చు. 


చికిత్స

ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ చికిత్సలో... ప్రత్యేకమైన కేసులను శ్రద్ధగా పరిశీలించడం, శస్త్రచికిత్స లేదా తొలి దశలో రేడియో థెరపీ, హార్మోనల్‌ థెరపీ, కీమోథెరపీ తదితరాలు ఉన్నాయి. 


చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను ముందుగానే... అది ఇంకా ప్రొస్టేట్‌ గ్రంధికే పరిమితమై ఉన్నప్పుడు... గుర్తించినట్టయితే, శస్త్రచికిత్స లేదా లోకల్‌ రేడియోథెరపీతో విజయవంతంగా చికిత్స చేయడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. 


రోగికి ఏది ఉత్తమమనే విషయాన్ని రోగితో క్షుణ్ణంగా చర్చించిన తరువాత వైద్యులు నిర్ణయిస్తారు. చాలామంది రోగులకు కాంబినేషన్‌ థెరపీ అవసరం కావచ్చు. 


నివారణ: 

ఈ క్రింది విధంగా చేస్తే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు తగ్గించుకోవచ్చు:


పండ్లు, కాయగూరలు పుష్కలంగా ఉన్న ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఎంచుకోండి. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ పెరిగే ముప్పును రెడ్‌ మీట్‌ ఎక్కువ చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 


వారంలో ఎక్కువ రోజులు వ్యాయామం చెయ్యండి. వ్యాయామం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మీ బరువును నిర్వహించుకోవడానికి సాయపడుతుంది. మీ భావోద్వేగాలను మెరుగుపరుస్తుంది. అందుకే వారంలో ఎక్కువ రోజులు వ్యాయామం చెయ్యడానికి ప్రయత్నించండి. మీరు కొత్తగా వ్యాయామం చేస్తున్నట్టయితే, నెమ్మదిగా ప్రారంభించండి. ప్రతిరోజూ వ్యాయామం చేసే సమయాన్ని పెంచుతూ వెళ్ళండి. 


ధూమపానానికి దూరంగా ఉండండి.  


ఆరోగ్యకరమైన బరువును కొనసాగించండి. మీ ప్రస్తుత బరువు ఆరోగ్యవంతంగా ఉన్నట్టయితే, ఆరోగ్యకరమైన ఆహారం, వారంలో ఎక్కువ రోజులు వ్యాయామం ద్వారా దాన్ని కొనసాగించండి. మీరు బరువు తగ్గాల్సిన అవసరం ఉంటే, మరింత వ్యాయామం చెయ్యండి. రోజూ మీరు తినే ఆహారంలో క్యాలరీల సంఖ్యను తగ్గించుకోండి. 


మీకు 50 సంవత్సరాల వయసు వచ్చాక క్రమం తప్పకుండా పిఎస్‌ఎ పరీక్ష (ఒక సాధారణమైన వార్షిక రక్త పరీక్ష) చేయించుకుంటే, క్యాన్సర్‌ను మొదట్లోనే, బహుశా నయం అయ్యే దశలోనే గుర్తించడానికి వీలు కలుగుతుంది. 


సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. 


- డాక్టర్‌ నిఖిల్‌ గడ్యాల్‌ పాటిల్‌

సీనియర్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌, క్యాన్సర్‌ నిపుణులు

యశోద హాస్పిటల్స్‌

సోమాజిగూడ, హైదరాబాద్‌

Updated Date - 2021-12-28T18:02:28+05:30 IST