వర్షాకాలం పాములతో జర భద్రం

ABN , First Publish Date - 2021-06-21T04:18:42+05:30 IST

వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పనుల్లో బీజీ అయ్యారు.

వర్షాకాలం పాములతో జర భద్రం

- నాటు వైద్యాన్ని నమ్ముకోవద్దు

- అందుబాటులో మందులు

- అన్ని సర్పాలు విషపూరితం కాదు

- జాగ్రత్తలు పాటిస్తే పాము కాటుకు దూరం

ఆసిఫాబాద్‌, జూన్‌ 20: వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాలు కురుస్తుండడంతో రైతులు పొలం పనుల్లో బీజీ అయ్యారు. ఇది పాములకు అనువైన కాలం. జూన్‌, జూలై నెలల్లో పాములు తమ ఆవాసాలను విడిచి బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. బొరియల్లో ఉండే పాములు ఆహారాన్వేషణలో పొలం గట్లు, పొదల వెంట సంచరిస్తుంటాయి. ఇది గమనించక పలువురు పాము కాటుకు గురవుతుంటారు. జిల్లాలో విషసర్పాల సంఖ్య చాలా తక్కువ. కాటువేసిన పాము విషపూరిత మైందో కాదో ముందు తెలుసుకోవాలి. పాము కాటు వేసిన చోట కట్టుకట్టి ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఎలాంటి పాము కాటు వేసినా వెంటనే ఆస్పత్రికి తీసుకేళ్తే 99 శాతం బతికించే అవకాశముంటుంది.కట్ల పాము కాటేసిన క్షణాల్లో విషం రక్తంలోకి ప్రవేశించి మృతిచెందే అవకాశం ఉంటుంది. నాగు పాము కాటేసిన 15నిమిషాల్లో విషం ఎక్కుతుంది. రక్తపింజర కాటేసిన రెండు గంటల తరువాత విషం ఎక్కుతుంది. జెర్రిపోతు, సిరుకట్ల పాము కాటేసినా విషం ఉండదు. అయితే కాటేసిన చోట చికిత్స చేయడానికి ఆస్పత్రులకు తీసుకువెళ్లాలి. పాములు ఎన్నో రకాలు ఉంటాయి. పాము కాటేసిన దగ్గర కట్టుకట్టి ఆస్పత్రికి తీసుకు వెళ్లాలి. 

అందుబాటులో మందులు..

జిల్లాలోని 20పీహెచ్‌పీలు, 2సీహెచ్‌సిలు, 2అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో పాము కాటు మందులు అందుబాటులో ఉన్నాయి. ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో సంప్రదించే అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స చేసి అవసరమైతే ఏరియా ఆస్పత్రులకు తరలించి కృత్రిమ శ్వాసను అందించి బతికించే అవకాశం ఉంటుంది. ఆందోళనకు గురై ఆలస్యం చేస్తే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. 

విష సర్పాలు రెండు రకాలు..

న్యూరోటాక్సిల్‌ రకం నాగుపాము, కట్ల పాము, రెండో రకం హిమోటాక్సిన్‌ అంటే రక్తపింజర వంటి పాములు ఉంటాయి. న్యూరోటాక్సిల్‌తో నోటి ద్వారా నురుగు వచ్చి శ్వాసఆడక మృతిచెందే ప్రమాదం ఉంది. ఇది గుండెపై ప్రభావం చూపి నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. హిమోటాక్సిన్‌తో రక్తనాళాల కణాల్లో కణజాలం నశించి కాటుపడిన భాగంలో వాపు వస్తుంది. కాటేసింది ఎలాంటి పాము తెలుసుకుంటే చికిత్స చాలా సులభం. పక్క పక్కన రెండు దంతాలు కాటు వేస్తే అది ఖచ్చితంగా విషసర్పమే. పాము కాటుతో ఉన్న భాగం నుంచి శరీరంలోకి రక్త ప్రసరణలో విషం వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎటువంటి పాము కాటే వేసినా ఆస్పత్రికి వెళ్లే రెండు రకాల చికిత్సలు నిర్వహిస్తారు. తీవ్రతను బట్టి ఇంజక్షన్‌ వేస్తారు. యాంటీ స్నేక్‌ వీనం, యాంటీ పాలివీనం అనే రెండు రకాల మందులు ఉంటాయి. ప్రస్తుతం మన జిల్లాలో అన్ని ఆస్పత్రుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

ఆందోళన వద్దు..

పాము కాటుకు గురైనప్పుడు ఆందోళనకు గురి కావద్దు. ఇది గుండె పోటుకు దారి తీస్తుంది. ప్రాథమిక చర్యగా కాటు వేసిన ప్రదేశంపై భాగంలో కట్టు కట్టాలి. ఆ వెంటనే చికిత్స కోసం వెళ్లాలి. పాము కాటుకు గురైన వారు ఆస్పత్రికి వెళ్లి స్పష్టంగా చెప్తే దానికి సంబంధించిన చికిత్స చేస్తారు. అక్కడ యాంటీస్నేక్‌ వీనం ఇంజక్షన్‌ అందుబాటులో ఉంటాయి. రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటే దానికి ఈ ఇంజన్‌ పనిచేస్తుంది. గుండెపోటు రాకుండా ఈ మందు ఉపకరిస్తుంది.

అప్రమత్తంగా ఉండాలి..

సాధ్యమైనంత వరకు పాములు విష కీటకాల బారిన పడకుండా ఉండాలి. రాత్రిపూట పొలాల వద్ద వెళ్లే వారు కర్ర, టార్చ్‌లైటు తీసుకెళ్లాలి. కప్పలు, ఎలుకలు ఉన్న చోట పాములు సంచరిస్తుంటాయి. ఇంటి ఆవరణలో కంప చెట్లు, పిచ్చి మొక్కలు, రంధ్రాలు, నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. ఇళ్లలో ఎలుకలు ఉంటే పాములు వస్తాయి. చిన్నారులు రాళ్లు, చెట్ల పొదల వైపు వెల్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రాత్రిపూట పొలాలకు వెళ్లే వారు సాధ్యమైనంత వరకు పొడవాటి బూట్లు ధరించడం ఎంతో మంచిది. ఏదో ఒక సర్పం కాటు వేసిందనగానే ఎక్కువ శాతం భయాందోళనకు గురై మరణించే వారు అధికంగా ఉంటారు. పాము కాటు వేసిన వారికి ధైర్యం చెప్పి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. 

పాము కాటు లక్షణాలు..

వ్యక్తిని విషపూరితమైన పాము కాటేస్తే శరీరమంతా నీలం రంగుగా మారడం, రక్తపోటు తక్కువగా ఉండి స్పృహ కోల్పోతారు. కరిచిన చోట నొప్పి, వాపు ఉంటుంది. కొందరిలో దద్దుర్లు కనిపిస్తాయి. నోటి నుంచి నురగా వస్తుంటుంది. ఆయాసపడి చెమటలు పట్టి ఉంటే సాధారణ స్థాయి కంటే రెట్టింపు స్థాయిలో గుండె కొట్టుకుంటుంది. ఈ క్షణాల్లో ఉన్నప్పుడు తక్షణమే ఆస్పత్రులకు తీసుకెళ్తే ఎటువంటి ప్రాణహాని ఉండదని వైద్యులు చెబుతున్నారు. పాము కాటుకు గురైన వారిని 99శాతం బతికించే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. 

మూఢనమ్మకాలు పాటించవద్దు..

-కుంరంబాలు, జిల్లా వైద్యాధికారి, కుమరం భీం ఆసిఫాబాద్‌

పాము కాటుకు గురైన వ్యక్తులను నేరుగా ఆస్పత్రులకు తరలించాలి. మూఢనమ్మకాలతో సమయం వృధా చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు. జిల్లాలోని 20 పీహెచ్‌సీలు, 2సీహెచ్‌పీలు, 2అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో పాము కాటుకు సంబంధించి(యాంటీ స్నేక్‌వీనం) ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. వర్షాకాలం కావడంతో పాములు సంచరించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు, కూలీలు వ్యవసాయ పనులు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.

Updated Date - 2021-06-21T04:18:42+05:30 IST