అడవే వారికి రక్షణ

ABN , First Publish Date - 2021-06-17T07:25:01+05:30 IST

కరోనా పేరెత్తితేనే బెంబేలెత్తిపోతున్న కాలంలో అసలా వైరస్‌ అంటే ఏమిటో తమకు తెలియదంటున్నారు పెనుమూరు మండలం పాళ్యం యానాది కాలనీవాసులు.

అడవే వారికి రక్షణ
పాళ్యం యానాది కాలనీ గ్రామం




కరోనా సోకని పల్లె: పాళ్యం యానాది కాలనీ

 కరోనా పేరెత్తితేనే బెంబేలెత్తిపోతున్న కాలంలో అసలా వైరస్‌ అంటే ఏమిటో తమకు తెలియదంటున్నారు పెనుమూరు మండలం పాళ్యం యానాది కాలనీవాసులు! మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల చేరువలోనే వుంటున్నా ఇంతవరకూ ఈ కాలనీలో ఎవరికీ కరోనా సోకలేదు.

పెనుమూరు: పాళ్యం యానాది కాలనీలో 48 కుటుంబాలకు చెందిన 147 మంది యానాదులు నివసిసున్నారు. ఈ కాలనీలో  పదోతరగతి దాటి ఎవరూ చదువుకోలేదు. అది కూడా ఇద్దరే ఉన్నారు. సమీపంలోని అడవులమీదే ఎక్కువ వీరంతా ఆధారపడుతారు. పరిసర గ్రామాల పంటపొలాల్లో కూలిపనులకు కొందరు వెళుతుండగా, మామిడితోటలకు కాపలాదార్లుగా మరికొందరు వుంటున్నారు. బతుకుదెరువుకు ఏ పనులు చేసినా అటవీ ఉత్పత్తుల సేకరణకే ప్రాధాన్యత ఇస్తారు. అడవిలో దొరికే కాయగసరు బాగా తింటారు. రాగి, సద్ద సంగటి వండుకుంటారు. ఎండా వాన చలి వంటి వాటిని లెక్క చేయరు. అడవుల్లో విపరీతంగా తిరుగుతారు.  బహుశా ఈ అలవాట్లే వారు శారీరకంగా దృఢంగా వుండేలా, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ కలిగివుండేలా చేస్తున్నాయి. వీళ్లెవరూ అసలు కరోనానే పట్టించుకోవడం లేదు. దాని గురించి పెద్దగా మాట్లాడుకోరు. బయట వెళ్ళినపుడు కూడా మాస్కులు ధరించడమనే అలవాటే లేదు. ఎవరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకోలేదు. అయినా ఇంతవరకూ కాలనీలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు.


ఆరోగ్య సమస్యలు తక్కువే!

పాళ్యం యానాది కాలనీవాసులకు సాధారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడం చాలా తక్కువ. చిన్న పిల్లలు, వృద్ధులతో సహా  జ్వరం, దగ్గు, తలనొప్పి వంటివి దాదాపుగా రావని వీరు చెబుతున్నారు. కాలనీలోని 147 మంది యానాదుల్లో కేవలం ఒక్కరు మాత్రమే మధుమేహంతో బాధపడుతున్నారు. 


కరోనా లేదు

కరోనా అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చిందని చెబుతుంటారు కాని మాగ్రామంలో  దాన్ని గురించి తెలియదు. మాస్కులు పెట్టుకునే అలవాటు మాకు లేదు. మేము ఎవ్వరూ కరోనా సూది వేసుకోలేదు. పెద్దల కాలం నుంచి మేము రాగులు, సద్ద సంగటి తింటున్నాం. అడవి మూలికలను తింటుంటాము.

- టి.హరి 


ఊరు దాటేది తక్కువే

 అడవిలో దొరికే తేనె, కొన్ని జంతువులను తింటాము. వేప పుల్లతోనే పళ్లు తోముకుంటాము. చిన్నచిన్న జబ్బులకు  వేర్లు, ఆకులు వంటి నాటు మందులు వాడుతాము. బయటివారు పెద్దగా మా ఊరికి రారు. మేము సంతకు పొయినపుడు కావలసినవి తెచ్చుకుంటాం. ఊరమ్మిడ పొలాల్లో కూలిపనులకు పోతాం తప్ప బయట ఊళ్లకు పొయ్యే పనేలేదు. 

-శివమ్మ

Updated Date - 2021-06-17T07:25:01+05:30 IST