ఓటు వేయలేదని పింఛను ఇవ్వలేదు..

ABN , First Publish Date - 2021-03-03T05:40:09+05:30 IST

తమ చేత వేలిముద్రలు వేయించుకుని పింఛను ఇవ్వబోమంటున్నారని మండలంలోని పమిడిపాడు గ్రామానికి చెందిన 150మంది లబ్ధిదారులు ఆవేదన చెందారు.

ఓటు వేయలేదని పింఛను ఇవ్వలేదు..
పింఛన్‌ కార్డులతో ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు

పమిడిపాడుకు చెందిన 150మంది లబ్ధిదారుల ఆవేదన

అధికారులకు ఫిర్యాదు

నరసరావుపేట టౌన్‌, మార్చి 2: తమ చేత వేలిముద్రలు వేయించుకుని పింఛను ఇవ్వబోమంటున్నారని మండలంలోని పమిడిపాడు గ్రామానికి చెందిన 150మంది లబ్ధిదారులు ఆవేదన చెందారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయంలో మంగళవారం ఏవోకు, ఆర్డీవో ఈవూరి బూసిరెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పింఛను డబ్బులు అడిగితే సాయంత్రం ఇస్తామన్నారని, సాయంత్రం అడిగితే మార్కెట్‌ యార్డు చైర్మన్‌, ఎమ్మెల్యేని కలవాలని వలంటీరు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేమని అంటే మీకు దిక్కున్నచోట చెప్పుకోండని సమాధానమిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే గ్రామస్తులకు పింఛను ఆపివేశారని పమిడిపాడు సర్చంచి గౌసియాబేగం ఆరోపించారు. పింఛన్లు, అమ్మఒడి, రైతు భరోసా పథకాలేవి మీకు రావని వలంటీర్లే బెదిరిస్తున్నారని అన్నారు.  వైసీపీ కార్యకర్తలు సాయంత్ర వేళల్లో  మద్యం సేవించి బైక్‌లో తిరుగుతూ అల్లరి చేస్తురని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో జనసేన, టీడీపీకి చెందినవారి పింఛన్లు ఆపేస్తామని వలంటీర్లు ఇంటింటికీ తిరిగి చెబుతున్నారని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్‌ జిలాని ఆరోపించారు. పింఛను లబ్ధిపొందుతున్న ప్రతి ఒక్కరూ వైసీపీ నాయకులను కలవాలంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో పూనాటి శ్రీనివాసరావు, అద్రూఫ్‌, పలువురు పింఛను లబ్ధిదారులు పాల్గొన్నారు. పింఛన్లు అందలా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.   


Updated Date - 2021-03-03T05:40:09+05:30 IST