కాంగ్రెస్ నిరసనల్లో అపశ్రుతి.. కుప్పకూలిన ఎద్దులబండి

ABN , First Publish Date - 2021-07-10T22:09:10+05:30 IST

ఇంధనం ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ముంబైలో శనివారం చేపట్టిన నిరసన..

కాంగ్రెస్ నిరసనల్లో అపశ్రుతి.. కుప్పకూలిన ఎద్దులబండి

ముంబై: ఇంధనం ధరలపై కాంగ్రెస్ కార్యకర్తలు ముంబైలో శనివారం చేపట్టిన నిరసన ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. దీంతో అర్ధాంతరంగా నిరసన కార్యక్రమం ముగిసిపోయింది. ముంబై కాంగ్రెస్ చీఫ్ భాయ్ జగ్‌తప్ ఆధ్యర్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది. ఇంధన ధరలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ జగ్‌తప్‌తో పాటు పలువురు కార్యకర్తలు వెళ్తున్న ఎద్దుల బండి తిరగబడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పెట్రోల్, డీజిల్ ధరలు అప్రతిహతంగా పెరుగుతూ పోతుండటం, ద్రవ్యోల్బణం చుక్కలనండుతుండటంతో దేశవ్యాప్తంగా 10 రోజుల ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కోవిడ్ మహమ్మారి, నిరుద్యోగం, వేతన కోతల కారణంగా ఇప్పటికే అనేకరకాలుగా కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజానీకం ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోతుండటంతో కుదేలయ్యారని, ఇందుకు నిరసగా బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు జరపాలని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో కోరింది. ఈనెల 7 నుంచి 17వ తేదీ వరకూ పార్టీ రాష్ట్ర యూనిట్లు ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా స్థాయిల్లో సైకిల్ యాత్రలు, ఊరేగింపులు జరపాలని కోరింది. ఇంధనం ధరలు తగ్గించాలనే డిమాండ్‌పై దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపుల వద్ద సంతకాల సేకరణను కూడా పార్టీ చేపట్టింది.

Updated Date - 2021-07-10T22:09:10+05:30 IST