రెండో రోజూ కొనసాగిన నిరసనలు

ABN , First Publish Date - 2022-01-20T07:05:57+05:30 IST

రివర్స్‌ పీఆర్సీ మాకొద్దు అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు చేపట్టిన నిరసనలు జిల్లాలో బుధవారం కూడా కొనసాగాయి.

రెండో రోజూ కొనసాగిన నిరసనలు
మద్దిపాడు పీహెచ్‌సీ వద్ద నిరసన తెలుపుతున్న వైద్య సిబ్బంది

నేడు ఉపాధ్యాయుల కలెక్టరేట్‌ ముట్టడి 

భారీ సమీకరణలో ఫ్యాప్టో ప్రతినిధులు

నల్లబ్యాడ్జీలతో విధులకు ఉద్యోగులు

ఒంగోలు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : రివర్స్‌ పీఆర్సీ మాకొద్దు అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు చేపట్టిన నిరసనలు జిల్లాలో బుధవారం కూడా కొనసాగాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతోనే విధులకు హాజరయ్యారు. కొన్ని మండల కేంద్రాల్లో పీఆర్సీ జీవోల ప్రతులను దహనం చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక(ఫ్యాప్టో) పిలుపునిచ్చింది. తదనుగుణంగా ఒంగోలులోని కలెక్టరేట్‌ ముట్టడికి ఫ్యాప్టో జిల్లా నేతలు ఏర్పాట్లు చేశారు.  మరోవైపు రివర్స్‌ పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణపై రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలతో కూడి ఉన్న  జేఏసీ, అమరావతి జేఏసీలు గురువారం విజయవాడలో సమావేశాలు ఏర్పాటు చేశాయి. వీటికిు జిల్లా నుంచి పెద్దసంఖ్యలోనే ఎన్‌జీవో, రెవెన్యూ ఇతర సంఘాల నాయకులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కార్యచరణపై ఈ  సమావేశాల్లో స్పష్టత రానుంది. కాగా జేఏసీల ఉద్యమకార్యాచరణపై స్పష్టత కోసం బుధవారం కీలకమైన ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ విజయవాడలో సమావేశమైంది.  జిల్లా అధ్యక్షుడు శరత్‌బాబు, ఆర్గనైజింగ్‌  కార్యదర్శి ఏడుకొండలు,  మాధవి తదితరులు  హాజరయ్యారు. 


Updated Date - 2022-01-20T07:05:57+05:30 IST