విభజనపై నిరసనలు....

ABN , First Publish Date - 2022-01-28T05:37:05+05:30 IST

జిల్లాల పునర్విభజనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సహేతుకంగా లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను పక్క జిల్లాల్లోకి కలపడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాయి. ఒకవైపు పీఆర్సీ కోసం ఉద్యోగులు ఉద్యమబాట, మరోవైపు గుడివాడ క్యాసినో వివాదంతో ప్రభుత్వంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆగమేఘాల మీద రాష్ట్రప్రభుత్వం జిల్లాల విభజన వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన విషయం విదితమే.

విభజనపై నిరసనలు....
అద్దంకిని ప్రకాశం జిల్లాలో ఉంచాలని కోరుతూ రాస్తారోకో చేస్తున్న ఏల్చూరు వాసులు

మార్కాపురం కేంద్రంగా జిల్లా కోసం ఉద్యమబాట

కందుకూరు డివిజన్‌ కొనసాగింపునకు ఎమ్మెల్యే లేఖ

ఒంగోలు జిల్లాలోనే అద్దంకి ఉంచాలని డిమాండ్‌

పలు ఇతర చోట్ల ఆందోళనలు

కనిగిరిని డివిజన్‌ చేస్తూ ప్రతిపాదనలు

ఒంగోలు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) :

జిల్లాల పునర్విభజన కాక మొదలైంది. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై జిల్లాలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్‌ ప్రాతిపదిక పేరుతో జిల్లాల విభజన తీరును చాలా ప్రాంతాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేకించి పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్షం ఉద్యమానికి పిలుపునిచ్చింది. అయితే కందుకూరు డివిజన్‌ను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి వైసీపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ముఖ్యమంత్రికి లేఖరాశారు. మరోవైపు అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కాకుండా ఒంగోలు కేంద్రంగా ఉండే జిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్‌ మొదలైంది. పశ్చిమ ప్రాంతంతో పాటు మరికొన్నిచోట్ల విభజన తీరుపై నిరసనలు ప్రారంభమయ్యాయి. డివిజన్ల విషయంలో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా కనిగిరిని డివిజన్‌ కేంద్రంగా ప్రకటించడం కొసమెరుపు.

 జిల్లాల పునర్విభజనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సహేతుకంగా లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను పక్క జిల్లాల్లోకి కలపడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాయి. ఒకవైపు పీఆర్సీ కోసం ఉద్యోగులు ఉద్యమబాట, మరోవైపు గుడివాడ క్యాసినో వివాదంతో ప్రభుత్వంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆగమేఘాల మీద రాష్ట్రప్రభుత్వం జిల్లాల విభజన వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన విషయం విదితమే. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 ఏర్పాటు, ్ఞ్ఞఅలాగే రెవెన్యూ డివిజన్లు పునర్విభజన చేస్తూ ముసాయిదా ప్రకటించారు. అభ్యంతరాలు తెలియజేసేందుకు వచ్చేనెల 26 వరకు గడువు ఇచ్చింది. ఉగాది నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. కాగా ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ప్రకారం జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంగోలు పార్లమెంట్‌లోని ఏడు స్థానాలతో పాటు సంతనూతలపాడు కలిపి ఎనిమిదింటితో ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాగా ప్రకటించారు. మిగిలిన నాలుగింటిలో అద్దంకి, పర్చూరు, చీరాలను బాపట్ల జిల్లాలోకి, కందుకూరు సెగ్మెంట్‌ను నెల్లూరు జిల్లాలోకి ప్రతిపాదించారు. అలాగే కందుకూరు రెవెన్యూ డివిజన్‌ రద్దు చేసి పొదిలి, చీరాల కేంద్రాలుగా కొత్త డివిజన్ల ప్రతిపాదించారు. ఈ విభజన తీరుపై పలు ప్రాంతాల్లో నిరసనలు, అసంతృప్తులు వ్యక్తమయ్యాయి.

మార్కాపురం జిల్లా కోసం ఉద్యమం

ప్రస్తుతం జిల్లాకేంద్రానికి 100 నుంచి 150కి.మీ. దూరంలో మార్కాపురం డివిజన్‌లోని మండలాలతో ఎంతోకాలంగా మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు ఆ ప్రాంతప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తాజా విభజనలో కూడా ప్రభుత్వం వారి కోరికను పట్టించుకోకుండా ఒంగోలు కేంద్రంగానే ఉండే ప్రకాశం జిల్లాలోనే ఆ ప్రాంతాన్ని ఉంచింది. దీనిపై తీవ్రసాయిలో ఆ ప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కోరుతూ ఉద్యమానికి రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు సిద్ధం అవుతున్నాయి. ఇందుకోసం మార్కాపురంలో గురువారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, సీపీఐ సీనియర్‌ నేత అందె నాసరయ్య, కాంగ్రెస్‌ ఇన్‌చార్జి షేక్‌ సైదాలతో పాటు పలు ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ నెల 31 నుంచి ఉద్యమం చేపట్టాలని తీర్మానించారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కోరుతూ కంభంలో ప్రజాసంఘాల ప్రతినిఽధులు నిరసన తెలిపి అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. సుదూరంగా ఉన్న ఒంగోలు జిల్లా కంటే తమ ప్రాంతాన్ని నంద్యాల జిల్లాలో కలపడమే మంచిదంటూ గిద్దలూరులో ఎస్‌వీ కాలేజీ పూర్వ విద్యార్థులు నిరసన చేపట్టారు. 

అద్దంకిని ప్రకాశంలోనే ఉంచాలి

ఇక అద్దంకి నియోజకవర్గాన్ని ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లాలోనే ఉంచాలన్న డిమాండ్‌ కూడా బలంగా వినిపిస్తోంది. ఏకంగా వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జీ బాచిన కృష్ణచైతన్య మీడియా సమావేశంలో ఈ డిమాండ్‌ చేశారు. ఆ నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలాన్ని ఇప్పడు ఉన్నట్లు ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని లేకపోతే నర్సరావుపేట కేంద్రంగా ఉన్న పల్నాడు జిల్లాలో చేర్పాలంటూ ఏల్చూరులో సీపీఐ, ప్రజాసంఘాలు రాస్తాకోరో చేపట్టాయి. తమకు 20కి.మీ దూరంలో నర్సరావుపేట ఉండగా సుదూరంగా ఉన్న బాపట్ల ఏలా వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా డివిజన్ల విభజనలపైనా అసంతృప్తులు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 

కందుకూరు డివిజన్‌ను ఉంచాల్సిందే

రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో రెవెన్యూ డివిజన్‌గా ఉన్న కందుకూరు డివిజన్‌ తాజా విభజనతో రద్దవుతోంది. దీనిని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష సమావేశాన్ని బుఽధవారం అక్కడ నిర్వహించారు. అదేసమయంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీఽధర్‌రెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కందుకూరు డివిజన్‌ను కొనసాగించాలని కోరుతూ సీఎంకు  లేఖరాసినట్లు తెలిపారు. పరిపాలన పరంగా జిల్లాల విభజన అయితే కందుకూరు అసెంబ్లీ స్థానాన్ని ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాలో ఉంచి మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు కందుకూరు డివిజన్‌లో ఉన్న కొండపి సెగ్మెంట్‌లోని మర్రిపూడి మండలాన్ని తాజా ప్రతిపాదనల్లో ఒంగోలు డివిజన్‌లోకి మార్పుచేశారు. దీనిపై ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. తమకు 10కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదిలి కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటవుతున్న తరుణంలో తమ మండలాన్ని అందులో కాకుండా సుదూరంగా ఉండే ఒంగోలులో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మండల పరిషత్‌ సమావేశాన్ని గురువారం ప్రత్యేకంగా నిర్వహించి పొదిలి డివిజన్‌లో మర్రిపూడి మండలాన్ని చేర్చాలని తీర్మానించారు. గ్రామ పంచాయతీల్లో కూడా సమావేశాలు నిర్వహించి తీర్మానాలకు సిద్ధం అవుతున్నారు. అయితే సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంట్‌ను పార్లమెంట్‌ పేరుతో బాపట్ల జిల్లాలో చేర్చకుండా ఒంగోలుతో  కలిపి ఉంచడంపై ప్రజల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది. 

కనిగిరి డివిజన్‌ కేంద్రంగా తాజా ఉత్తర్వులు

 జిల్లాలో కొత్తగా ఏర్పాటుకు ప్రతిపాదించిన రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో ఒక మార్పు చోటుచేసుకుంది. తొలుత ప్రకటించినట్లు పొదిలి డివిజన్‌ కేంద్రాన్ని రద్దుచేసి కనిగిరిని డివిజన్‌ కేంద్రంగా మార్పుచేశారు. ఆ మేరకు గురువారం సాయంత్రం అధికారిక ఉత్తర్వుల తతంగం చకచకా జరిగిపోయింది. రాష్ట్రప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లాను మూడు జిల్లాల్లోకి విభజించటమే కాక చీరాల, పొదిలి కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటును కందుకూరు డివిజన్‌ రద్దును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలు, కూర్పుపై జిల్లాలో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఒంగోలు కేంద్రంగా ఉండే ప్రకాశం జిల్లాలో ఒంగోలుతోపాటు మార్కాపురం, పొదిలి రెవెన్యూ డివిజన్లు ఉంటాయని ప్రకటించారు. ప్రస్తుతం పొదిలి, మార్కాపురం నియోజకవర్గంలోనే ఉంది. దీంతో ఒకే నియోజకవర్గంలోని రెండు ప్రధాన పట్టణాలు రెండు డివిజన్‌ కేంద్రాలు కావటంపై అభ్యంతరాలు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు ఉగ్రనరసింహారెడ్డి ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కనిగిరిని డివిజన్‌ కేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేసి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దీనికి తోడు కలెక్టర్‌ సమస్యను సాంకేతికపరమైన అభ్యంతరాలను మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం బాలినేని సీఎం దృష్టి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అనంతరం ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిశీలన చేశారు. గతంలో కలెక్టర్‌ కూడా కనిగిరినే డివిజన్‌ కేంద్రం చేయాలని ప్రతిపాదించినట్లు వెల్లడైంది. అయితే పూర్వకాలంలో పొదిలిని డివిజన్‌ కేంద్రం చేయాలనే ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. తాజా పరిస్ధితులకు అనుగుణంగా ఒకే నియోజకంగంలో రెండు డివిజన్‌ కేంద్రాలు ఉండటం కూడా సరికాద ని భావించి పొదిలి స్థానంలో కనిగిరిని డివిజన్‌ కేంద్రంగా మార్పుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు గెజిట్‌ ప్రతిపాదనను  కూడా మార్పు  చేయమంటున్నారు. గతంలో కందుకూరు డివిజన్‌లో ఉన్న దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాలు కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి, కొనకనమిట్ల మండలాలు కనిగిరి రెవెన్యూ డివిజన్‌లో ఉంటాయి. 



Updated Date - 2022-01-28T05:37:05+05:30 IST