పరీక్షిస్తుండగానే పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ నమూనా

ABN , First Publish Date - 2020-05-30T20:31:24+05:30 IST

స్పేస్ ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ రాకెట్ ప్రయోగం ‘స్టార్‌షిప్’ నమూనా పరీక్షిస్తుండగానే...

పరీక్షిస్తుండగానే పేలిపోయిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ నమూనా

టెక్సాస్: స్పేస్ ఎక్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ రాకెట్ ప్రయోగం ‘స్టార్‌షిప్’ నమూనా పరీక్షిస్తుండగానే పేలిపోయింది. దక్షిణ టెక్సాస్‌లోని ఎలన్ మస్క్ స్పేస్ కంపెనీలో షెడ్యూల్ ప్రకారం శుక్రవారం గ్రౌండ్ టెస్ట్ నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చంద్రుడు, అంగారక గ్రహాల పైకి మానవులతో పాటు 100 టన్నుల బరువులను మోసుకెళ్లడమే లక్ష్యంగా 394 అడుగుల ఎత్తులో స్టార్‌షిప్‌ను రూపొందించారు. తాజా ఘటన కారణంగా నాసా అంతరిక్ష పరిశోధకుల కోసం స్పేస్ ఎక్స్ తలపెట్టిన తదుపరి ప్రయోగంపై ఎలాంటి ప్రభావం పడబోదని సదరు సంస్థ ప్రకటించింది. ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రంలో మరో రాకెట్  వ్యవస్థ ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. కాగా స్టార్‌షిప్ నమూనా పేలిపోతున్న దృశ్యాలను నాసా స్పేస్‌లైట్ వెబ్‌సైట్ లైవ్‌స్ట్రీమ్ రికార్డు చేసింది. క్షణాల్లో అగ్ని గోళంలా మారిన రాకెట్ నమూనా.. కొద్ది సేపటికే నామరూపాల్లేకుండా కాలిబూడిదైనట్టు కనిపిస్తోంది. ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అన్నది ఇంకా తెలియరాలేదు. స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా దీనిపై ఇంకా స్పందించలేదు. 



Updated Date - 2020-05-30T20:31:24+05:30 IST