గల్వన్ లోయలో గర్వభంగం

ABN , First Publish Date - 2020-06-19T05:50:35+05:30 IST

చైనాలో అత్యధిక సార్లు అధికారికంగా పర్యటించిన భారత ప్రధానమంత్రి ఎవరో మీకు తెలుసా? నరేంద్ర మోదీ. అవును, మోదీజీ మొత్తం తొమ్మిదిసార్లు (ప్రధానమంత్రిగా ఐదు సార్లు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు) బీజింగ్‌ను సందర్శించారు...

గల్వన్ లోయలో గర్వభంగం

అధినేతల వ్యక్తిగత సౌహార్ధ సుహృద్భావాలతో దేశాల మధ్య పటిష్ఠ స్నేహ సంబంధాలను నిర్మించుకోవడమనేది అంత సులువైన విషయం కాదు. తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైనిక దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు మోదీ బ్రాండ్ దౌత్య శైలి పరిమితులను స్పష్టంగా ఎత్తి చూపాయి. స్వీయ ప్రాధాన్యాన్ని పెంపొందించుకునేందుకు వ్యవస్థాగత పద్ధతులను వదిలివేసి పూర్తిగా వైయక్తిక రీతిలో దౌత్యాన్ని నెరపడం హితకరం కాదని స్పష్టమయింది.


చైనాలో అత్యధిక సార్లు అధికారికంగా పర్యటించిన భారత ప్రధానమంత్రి ఎవరో మీకు తెలుసా? నరేంద్ర మోదీ. అవును, మోదీజీ మొత్తం తొమ్మిదిసార్లు (ప్రధానమంత్రిగా ఐదు సార్లు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు) బీజింగ్‌ను సందర్శించారు. చైనా నాయకులతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకోవడానికై వ్యక్తిగత స్థాయిలో ఆయన అనితరసాధ్యమైన కృషి చేశారు. ప్రధాని మోదీ సాధించిన అనేక ‘విజయాల’ గురించి ఢంకా మోగించడమే దినచర్యగా పెట్టుకున్న ఆయన మద్దతుదారులు పైన పేర్కొన్న గణాంక ఘనత గురించి మరీ ప్రత్యేకంగా చాటుతుంటారు. ఇంకెంత మాత్రంకాదు! ఎందుకనో మీకు విడమరిచి చెప్పనవసరం లేదు. తూర్పు లద్దాఖ్‌లో చోటు చేసుకొంటున్న పరిణామాల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. 


భారత ప్రజలు, మరీ ముఖ్యంగా నెహ్రూ వాదులు 1962 యుద్ధాన్ని చైనా చేసిన ‘మహా వంచన’గా భావిస్తున్నారు. బీజింగ్ పాలకులు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారనేది వారి అభియోగం. మరి లద్దాఖ్ -2020 ఘటనలపై సైతం భవిష్యత్తులో మోదీ వాదులు అదే విధమైన నిందమోపుతారనడంలో మీకు ఎటువంటి అనుమానమక్కర్లేదు. మానవాళి సాంస్కృతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక పురోగతిలో దీపశిఖలుగా వెలుగొందిన మహోన్నత పురాతన నాగరికతలు భారత్, చైనాలు. శతాబ్దాల నిద్రాణ స్థితి నుంచి మేల్కొన్న రెండు దేశాలు మళ్ళీ కలిసికట్టుగా మానవాళికి వెలుగు బాటలు పరచాలనే ఉదాత్తాశయంతో చైనాతో చెలిమికి నెహ్రూ ఆరాటపడ్డారు. ఆయన ఆశంస ఒక కాల్పనిక భ్రమగా చరిత్ర తిరస్కరించింది. నెహ్రూ అనంతరం సరిగ్గా ఐదు దశాబ్దాలకు భారత భాగ్య విధాత అయిన మోదీ చైనాతో నెరపిన సంబంధ బాంధవ్యాలకు సమున్నత సంకల్పాలు కాక, వైయక్తిక ప్రాభవాల కాంక్షే ప్రేరణ, ప్రాతిపదిక. 


చైనా నాయకులతో నరేంద్ర మోదీ ఏర్పరచుకున్న సంబంధాలను మూడు స్థాయిలలో వివరించవచ్చు. తొలుత వాటికి మూలాలు ఒక విధంగా వ్యక్తిగత కృతజ్ఞతా భావంలో ఉన్నాయి. 2002 గుజరాత్ మతతత్వ మారణ కాండ అనంతరం నరేంద్ర మోదీ పట్ల పాశ్చాత్య దేశాలు పూర్తిగా అనాదరణ భావాన్ని చూపాయి. ఆ క్లిష్ట పరిస్థితిలో ఆయన్ని గౌరవించి, అక్కున చేర్చుకున్న దేశాలు చైనా, జపాన్ మాత్రమే. కనుకనే 2014లో ప్రధానమంత్రి అయిన తరువాత మోదీ పర్యటించిన తొలి దేశం జపాన్. ఆయన స్వాగతించిన తొలి అగ్రరాజ్య అధినేత చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్. రెండవది వ్యాపారపరమైనది. చైనా నాయకులతో మోదీ నెరపిన సన్నిహిత సంబంధాలలో ఒక వ్యాపార కోణం ఉన్నది. చైనా ప్రభుత్వ నియంత్రణలోని ప్రైవేట్ కంపెనీల నిర్వహణా పద్ధతులు మోదీని విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలిసారి బీజింగ్‌ను సందర్శించిన తరువాత చైనా వ్యాపార నిర్వహణ పద్ధతుల నుంచి నేర్చుకోవాలని గుజరాత్ అధికారులను ఆయన ఎంతగానో ప్రోత్సహించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సులలో కనీసం 25 చైనీస్ కంపెనీలు తప్పకుండా పాల్గొనేవి. పలు కంపెనీలు గుజరాత్‌లో భారీ మదుపులు కూడా చేశాయి. మూడోది ఒక విధమైన భావ సారూప్యత. మోదీ బ్రాండ్ హిందుత్వ జాతీయ వాదానికి, జిన్ పింగ్ కలహశీల జాతీయవాద దార్శనికతకు మధ్య పలు సాదృశ్యాలు ఉన్నాయి. పార్టీ యంత్రాంగంపై పూర్తి పట్టు సాధించడంలోనూ, ప్రజలను విశేషంగా ఆకట్టుకోవడంలోనూ ఈ ఇరువురి అధినేతల మధ్య సామాన్యాంశాలు స్పష్టంగా కనపడతాయి.


అయితే దేశాల మధ్య స్నేహ సంబంధాలను, అందునా భారత్, చైనాల మధ్య అధినేతల వ్యక్తిగత రసాయన శక్తితో నిర్మించుకోవడమనేది అంత సులువైన విషయం కాదు. తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల సైనిక దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు మోదీ బ్రాండ్ దౌత్య శైలి పరిమితులను స్పష్టంగా ఎత్తి చూపాయి. స్వీయ ప్రాధాన్యాన్ని పెంపొందించుకునేందుకు వ్యవస్థాగత పద్ధతులను వదిలివేసి పూర్తిగా వైయక్తిక రీతిలో దౌత్యాన్ని నెరపడం హితకరం కాదని స్పష్టమయింది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత భారత ప్రధానమంత్రి అక్షరాలా ఒక ప్రపంచ యాత్రికుడుగా పరిణమించాడు! పాలనావ్యవహారాలను సమూలంగా మార్చి వేస్తున్న శక్తిమంతమైన నాయకుడుగా మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠను పెంపొందించడానికే గత ఆరు సంవత్సరాలుగా ఎనలేని ప్రాధాన్యం లభిస్తోంది. 


ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుంటే 2015లో ప్రధాని మోదీ తీసుకున్న ఒక నాటకీయ నిర్ణయం మనకేమీ విస్మయం గొల్పదు. మధ్యాసియా దేశాలలో పర్యటించి స్వదేశానికి తిరిగివస్తూ, పర్యటన కార్యక్రమంలో లేనప్పటికీ లాహోర్ విమానాశ్రయంలో ఆకస్మికంగా ఆగి, ప్రధాని మనవరాలి వివాహ వేడుకల్లో ఉన్న ప్రధాని నవాజ్ షరీఫ్ స్వగృహానికి వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి ఉపఖండ ప్రజలను మోదీ ముగ్ధులను చేశారు మరి. అలాగే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ‘నా స్నేహితుడు బరాక్’ అంటూ ప్రేమాస్పదంగా ఆలింగనం చేసుకోవడమూ ఒక నాటకీయ చర్య కాదూ? ఇటీవల అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, ఆయన కుటుంబానికి అట్టహాసంగా స్వాగత సత్కారాలు నిర్వహించడంలోనూ ఎంతైనా నాటకీయత ఉన్నది. అద్భుత ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిత్యం పతాక శీర్షికల్లో ఉండేందుకు తోడ్పడుతుందే గానీ దౌత్య సంబంధాలను పటిష్ఠం చేసేందుకు దోహదం చేయదు. వ్యక్తిగత స్థాయికి ఆవల దౌత్య సంప్రదాయాలను కచ్చితంగా పాటించినప్పుడే దేశాల మధ్య సార్థక సంబంధాలు పెంపొందడానికి అవకాశముంటుంది. 


లాహోర్‌లో నవాజ్ షరీఫ్-–నరేంద్ర మోదీ మధ్య సుహృద్భావం వెల్లివిరిసిన కొద్ది వారాలకే పఠాన్ కోట్‌లోని సైనిక స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగిందన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. సరే, బంగాళాఖాతం తీరాన పురాతన పల్లవ చక్రవర్తుల రాజధాని మామల్లాపురంలో చైనా అధినేత జిన్ పింగ్‌కు మోదీ చక్కని ఆతిథ్యమిచ్చి ఎనిమిది నెలలు గడవక ముందే తూర్పు లద్దాఖ్ మంచుకొండలలో మారణ హోమం సంభవించింది. పాకిస్థాన్‌లో సైనిక పాలకులు ఉన్నా, పౌర పాలకులు ఉన్నా శాంతి చర్చల్లో చిత్తశుద్ధితో పాల్గొంటారనే భరోసా లేదు. మన ప్రధాన మంత్రులు పలువురికి ఈ వాస్తవం బాగా తెలుసు. ఇక చైనీయుల విషయానికి వస్తే నాలుగు దశాబ్దాలుగా వాస్తవాధీనరేఖ వెంబడి వున్న ప్రశాంత పరిస్థితులు కేవలం కొద్ది వారాల వ్యవధిలో పూర్తిగా ఆవిరైపోవడం నిజంగా చాలా బాధాకర విషయం. ఎందుకిలా జరిగింది? చైనీస్ సైనిక దళాలు మన సైనికులపై ఆకస్మిక దాడి చేశాయని చెప్పడమంటే మన సైన్యం ఘోర వైఫల్యాన్ని అంగీకరించడమే అవుతుంది. వివాదాస్పద సరిహద్దులో యథాస్థితి కొనసాగేందుకు ప్రయత్నించడంలో చైనా వ్యూహాత్మక సంకల్పాన్ని తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పడమంటే రాజకీయ భంగపాటు, దౌత్య పరాజయాన్ని అంగీకరించడమే అవుతుంది.


దురదృష్టవశాత్తు అధినేతల వ్యక్తి పూజలపై వర్ధిల్లే రాజకీయ నాయకత్వాలు ఇటువంటి వైఫల్యాలను అంగీకరించడం చాలా అరుదు. ఎవరికీ తమను జయింప శక్యంకాదని ఇటువంటి నాయకత్వాలు పరిపూర్ణంగా విశ్వసించడం కద్దు. ఈ జూన్ 15వ తేదీ రాత్రి గల్వాన్ లోయ మంచుకొండలపై సంభవించిన గాయాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. అవి, నిర్ణయాలలో చోటుచేసుకున్న పొరపాట్ల ఫలితమేనన్న విషయాన్ని సంబంధిత అధికార వర్గాలు బహుశా బహిరంగంగా ఒప్పుకోకపోవచ్చు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే మోదీ మహాశక్తిని ప్రధానమంత్రి పదవికి చేర్చిన తీవ్ర జాతీయవాదం అటువంటి వైఫల్యాలను ససేమిరా అంగీకరించదు. అలా ఒప్పుకోవడం తమ బలహీనతకు చిహ్నంగా ఆ శక్తులు భావిస్తాయి. అయితే వాస్తవాలు వాస్తవాలే. పైగా అవి చాలా కఠినమైనవి. ఎంత శక్తిమంతమైన ప్రభుత్వమైనా సరే అటువంటి వాస్తవాలను శీఘ్రగతిన ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే పరిస్థితిని చక్కదిద్దడానికి అది అనివార్యం. ఒక విధంగా మోదీ ప్రభుత్వం ముందున్న సవాల్ గల్వన్ లోయలో జరిగిన పొరపాట్లను సరిద్దుకోవడమే నని చెప్పక తప్పదు. మరి ఈ దిద్దుబాటు ఎలా?


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుసరించిన వ్యక్తి-కేంద్రిత చైనా విధానం లోపభూయిష్ట మైనదని ఒప్పుకోవాలి. చైనా ప్రపంచాధిపత్య ఆకాంక్షలు మనకు చిక్కులు కొని తెస్తున్నాయనే వాస్తవాన్ని గుర్తించాలి. జాతీయ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై రాజీ పడకుండా వాస్తవాధీన రేఖ వెంబడి పూర్వ స్థితిని పునరుద్ధరించేందుకు లక్ష్య తత్పరతతో కృషి చేయాలి. చైనీస్ సరుకులను బాయ్ కాట్ చేయాలనే జనరంజక పిలుపులు అదేపనిగా ఇచ్చేముందు, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను మళ్ళీ స్వాధీనం చేసుకొని తీరుతామని పదే పదే బూకరింపులు చేసే ముందు మనం ఒక పని విధిగా చేసితీరాలి. అది, తూర్పు లద్దాఖ్‌లో చైనా ఆక్రమించుకున్న మన భూభాగాలను మనం మళ్ళీ స్వాయత్తం చేసుకోవాలి. ఆ పరహస్తమైన భారత భూభాగాలలో మళ్ళీ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం ఏమి చేయనున్నది? ఏమైనా గల్వన్ లోయలో జరిగిన అనర్థానికి, ఆ మహనీయుడు జవహర్ లాల్ నెహ్రూపై మనం ఎలాంటి అభాండం వేయకూడదు.


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2020-06-19T05:50:35+05:30 IST