ఘనంగా బాలికాదినోత్సవం

ABN , First Publish Date - 2022-01-25T05:36:41+05:30 IST

స్థానిక కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం జాతీయ బాలికాదినోత్సవాన్ని ప్రిన్సిపాల్‌ సుజాత అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఘనంగా బాలికాదినోత్సవం
ర్యాలీ నిర్వహిస్తున్న బాలికలు, ఉపాధ్యాయినులు

పాఠశాలల్లో అవగాహన ర్యాలీ నిర్వహించిన బాలికలు

‘ఆడపిల్లను పుట్టనిద్దాం.. చదవనిద్దాం’ అని నినాదాలు

పీసీపల్లి, జనవరి 24 : స్థానిక కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం జాతీయ బాలికాదినోత్సవాన్ని ప్రిన్సిపాల్‌ సుజాత అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్‌ సుజన, ఎస్సై ప్రేమ్‌కుమార్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికలు క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటారన్నారు. కొవిడ్‌పై తమ తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులకు బాలికలు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం బాలికా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు.  కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక నాయకులు మాలకొండారెడ్డి, జెడ్పీహెచ్‌ఎ్‌స ప్రధానోపాధ్యాయులు, మహిళాపోలీసు, ఉపాధ్యాయినీలు, సూపర్‌వైజర్‌ పాల్గొన్నారు.

దొనకొండ : ‘బాలికలను పుట్టనిద్దాం, బతకనిద్దా, చదవనిద్దాం, ఎదగనిద్దాం’ అనే భావనతో బాలికల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కస్తూరీభా గాంధీ బాలికల గురుకుల పాఠశాల ప్రత్యేకాధికారిణి అరుణకుమారి పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలికాదినోత్సవాన్ని పురస్కరించుకొని దొనకొండ కస్తూరీభా గాంధీ బాలికల గురుకుల పాఠశాల బాలికలకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనదేశంలో ముఖ్యమైన పదవులు మహిళలు నిర్వర్తించారని, బాలికల విద్యాభివృద్ధి పట్ల ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి బాలిక ఉన్నతస్థాయిలో నిలవాలన్నారు. అనంతరం ‘ఆడపిల్లలను రక్షిద్దాం, చదివిద్దాం’ అని ప్లాకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆదిమూలపు జయమణి, లీలాకుమారి, ఝాన్సీరాణి, నసీమా, ఆదిలక్ష్మీ, నిర్మల, లలిత, కస్తూరీభా గాంధీ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

పామూరు : ఆడపిల్లలను రక్షించుకొని, చదివించుకొని ముక్కుపచ్చలారని ఆడబిడ్డలను బ్రతకనిద్దామంటూ అండన్‌వాడీ సూపర్‌ వైజర్‌ దైవా కృపావరం అన్నారు. స్థానిక కేజీబీవీలో బాలికల దినోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించారు. బాలికలు లేనిదే మానవుడి మనుగడ లేదని, తల్లిగర్భంలోనే ఆడపిల్లల బంగారు భవిష్యత్తును చిదిమి వేయడం సామాజిక దురాచారమన్నారు. అనంతరం బాలికల పుట్టుక తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్‌ మండ్లా శైలజ, అంగన్‌వాడీ, కేజీబీవీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

వెలిగండ్ల  : మానవ సమాజానికి మూలస్తంభాలైన ఆడప్లిలలను చదివించడం, వారిని ఎదగనివ్వడం, తల్లిదండ్రులు కనీసబాధ్యత తీసుకోవాలని జడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సోమవారం వెలిగండ్లలో అంగన్‌వాడీ కార్యకర్తలు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆడపిల్ల స్వయం పోషిత స్థితికి ఎదిగేవరకు వివాహాన్ని వాయిదా వేయాలన్నారు. తనకాళ్ల మీద తాను నిలబడే వరకు అమ్మాయిలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు.  కార్యక్రమంలో ఎంపీడీవో తాతపూడి సుకుమార్‌, తహసీల్దార్‌ జ్వాల నరసిహం, పొల్లా సుబ్రమణ్యం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ముండ్లమూరు : మండల కేంద్రమైన ముండ్లమూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బహుజన రిసోర్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం జరిగింది.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో బీ చంద్రశేఖరరావు హాజరై మాట్లాడారు. బాలికలు క్రమశిక్షణతో ఉండి చదువే ధ్యేయంగా చదివి మంచి ప్రయోజకులు కావాలన్నారు. స్త్రీకి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం బాలికలకు మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో ఎం.సాంబశివరావు, హెచ్‌ఎం సుజాత, రిసోర్స్‌ పర్సన్‌ గార్ల కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:36:41+05:30 IST