వసతులు కల్పించి.. ఇళ్లను కూల్చండి

ABN , First Publish Date - 2020-07-08T11:08:02+05:30 IST

గండికోట పునరావాస కాలనీల్లో సౌకర్యాలు కల్పించి ఆ తర్వాత ఇళ్లను కూల్చివేసినా ఇబ్బందులు ఉండవని గండికోట నిర్వాసితులు ..

వసతులు కల్పించి.. ఇళ్లను కూల్చండి

కొండాపురం, జూలై 7: గండికోట పునరావాస కాలనీల్లో సౌకర్యాలు కల్పించి  ఆ తర్వాత ఇళ్లను కూల్చివేసినా ఇబ్బందులు ఉండవని గండికోట నిర్వాసితులు వేడుకుంటున్నారు. ఆ మేరకు  నిర్వాసితులు వారి సమస్యలపై మంగళ వారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితుల తరుపున  మండల సీపీఐ కార్యదర్శి మనోహర్‌బాబు మాట్లాడుతూ కొండాపురం గ్రామంలో పునరావాస కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలైన నీళ్లు, కరెంటు లేదని కొంతమందికి అసలు స్థలాలే కేటాయించలేదని  ఇప్పటికిప్పుడు అధికారులు వచ్చి ఇళ్లను కూలదోయించుకుంటే చెక్కులు ఇస్తామని చెప్పడం ఎంత వర కు సమంజసమన్నారు. ఎవరైనా పరిహారం ఇచ్చిన తర్వాత ఆ డబ్బులతో ఇళ్లు నిర్మించుకుంటారని అందుకు కొంత గడువు ఇవ్వకుండా, సౌకర్యాలు కల్పించకుండా ఇళ్లను కూలదోసి ఖాళీ చేయించడం బాధాకరమన్నారు.


ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా వాసి కావడంతో తమకు న్యాయం చేస్తాడన్న ధైర్యంతో ఉన్నామన్నారు. అయితే అధికారులు అత్యుత్సాహంతో తమ ఇళ్లను పడగొట్టి రోడ్డున పడేలా చేస్తున్నారని ఇందుకు ముఖ్యమంత్రి స్పందించి తగు న్యాయం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు వర్తింపజేసిన రూ. 12.50లక్షలను గండికోట నిర్వాసితులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.  పరిహారం చెల్లించి సౌకర్యాలు కల్పించి ఇళ్లు కట్టుకట్టుకున్న తర్వాతనే నిర్వాసితులను ఖాళీ చేయించేలా ఆదేశించాలని వారు విజ్ఞప్తిచేశారు. 

Updated Date - 2020-07-08T11:08:02+05:30 IST