కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , First Publish Date - 2021-04-19T05:35:02+05:30 IST

కరోనా బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా వైద్య అధికారులతో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులకు సంబంధించిన రోగులకు మానవత దృక్పథంతో వైద్యసేవలు అందించాలన్నారు.

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న

జిల్లా వైద్యాధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జోగు రామన్న

ఎమ్మెల్యే ఎదుటే రిమ్స్‌ డైరెక్టర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో వాగ్వాదం

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌18 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా వైద్య అధికారులతో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులకు సంబంధించిన రోగులకు మానవత దృక్పథంతో వైద్యసేవలు అందించాలన్నారు. రిమ్స్‌కు వచ్చే రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచి సమన్వయంతో పనిచేయాలన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో అవసరమైన వైద్యాధికారులను డిప్యూటేషన్‌పై నియమించుకోవాలని సూచించారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే అధిగమించి వైద్య సేవలు సకాలంలో అందించాలన్నారు. రోగులతో పాటు వారి కుటుంబీకులు ఎక్కువ సంఖ్యలో రిమ్స్‌ కు వస్తున్న వారిని కట్టడి చేయాలని అందుకు ప్రత్యేకంగా పాస్‌ల విధానాన్ని అమలు చేయాలన్నారు. వైద్య సిబ్బందిని వార్డుల వారీగా కేటాయించాలని సూచించారు. విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, సెక్యూరిటీలకు తప్పని సరిగా మాస్కులను సరఫరా చేయాలని సూచించారు. వైద్యాధికారులకు ప్రత్యేక ఏర్పాట్లతో విశ్రాంతి గదులను ఏర్పాటు చేయాలని కోవిడ్‌ సోకిన వారికి అవసరం మేరకు ఆక్సీజన్‌ వెంటిలేటర్లను రెమిడిసిరీస్‌ ఇంజక్షన్లను అందించాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ మాట్లాడుతూ సమస్యలను అధిగమించి కొవిడ్‌ సమయంలో సమష్టిగా పని చేయాలని సూచించారు. అయితే ఎమ్మెల్యే జోగురామన్న ముందే రిమ్స్‌ డైరెక్టర్‌ భానోత్‌ బలిరాంనాయక్‌, జిల్లా వైద్య అధికారి రాథోడ్‌ నరేందర్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఎమ్మెల్యే సర్దిచెప్పారు. అవసరం మేరకు రెమిడిసిరీస్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్న కరోనా బాధితులకు ఇవ్వడం లేదని, కరోనా బాధితుల సమచారాన్ని కూడా ఇవ్వడం లేదని డీఎంఅండ్‌హెచ్‌వో ఆరోపించారు. స్పందించిన రిమ్స్‌ డైరెక్టర్‌ వైద్యుల సలహా మేరకే ఇంజక్షన్లు ఇవ్వడం జరుగుతుందని సమాధానం చెప్పడంతో స్వల్ప ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేతో పాటు పలువురు అధికారులు సముదాయించారు.  

Updated Date - 2021-04-19T05:35:02+05:30 IST