9, 10వ షెడ్యూళ్ల కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల వివరాలివ్వండి

ABN , First Publish Date - 2021-06-11T10:12:03+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్ల కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల వివరాలను సమర్పించాలని వివిధ శాఖల అధికారులను మంత్రి

9, 10వ షెడ్యూళ్ల కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల వివరాలివ్వండి

ఉద్యోగుల సంఖ్య, ఖాళీల లెక్కలను తేల్చండి: మంత్రి హరీశ్‌


హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్ల కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల వివరాలను సమర్పించాలని వివిధ శాఖల అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు 9, 10 షెడ్యూళ్ల సంస్థల ఆస్తులపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో కలిసి గురువారం బీఆర్కేభవన్‌లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. 9వ షెడ్యూల్‌ కింద 91 సంస్థలు, 10వ షెడ్యూల్‌ కింద 142 సంస్థలు, యూనివర్సిటీలు, అకాడమీలు ఉన్నాయి. 9వ షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పేచీ ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వంటి ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల గొడవ ఇప్పటికీ పరిష్కారం కావడం లేదు. 70 సంస్థల ఆస్తులు, ఉద్యోగుల పంపిణీ దాదాపుగా కొలిక్కి వచ్చింది. వీటికి సంబంధించి ఇరు రాష్ట్రాలు ఉత్తర్వులను జారీ చేయాల్సి ఉంది.


అయితే... షీలా బిడే కమిటీ సిఫారసుల మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. 10వ షెడ్యూల్‌లోని 142 సంస్థలకు సంబంధించి నగదు పంపకాలు మినహా ఇతర అంశాలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. కాగా... జూన్‌ నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉండడంతో వివిధ శాఖల్లోని కేడర్‌ స్ట్రెంత్‌పైనా మంత్రి సమీక్షించారు. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులెన్ని, ఖాళీలెన్ని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న వారెంత మంది? వంటి వివరాలు తేల్చాలని ఆదేశించారు.

Updated Date - 2021-06-11T10:12:03+05:30 IST