Abn logo
Jun 16 2021 @ 04:17AM

కరోనా కాలంలోనూ విదేశీ విద్యకు సై

  • 90 శాతం మంది బ్రిటన్‌, అమెరికా, కెనడాలకే క్యూ  
  • యోకెట్‌ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి విజృంభణ వేళ ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడంపై తెలంగాణ విద్యార్థులలో ఆసక్తి ఏమాత్రం సన్నగిల్లలేదు. మరీ ముఖ్యంగా బ్రిటన్‌, అమెరికా, కెనడాలాంటి దేశాలు విద్యా సంస్థలను తెరవడం, ఇమ్మిగ్రేషన్‌ విధానాలను సరళతరం చేయడంతో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఆ దేశాలలోని యూనివర్సిటీలలో చదువుకొనేందుకు సిద్ధమవుతున్నారు. విదేశీ విద్య కన్సల్టంట్‌ యోకెట్‌ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 30వేలమంది విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అందులో 90 శాతం మంది బ్రిటన్‌, అమెరికా, కెనడా వెళ్లేందుకు తొలి ప్రాధాన్యమిస్తున్నారని తేలింది. ఈ మూడు దేశాల తరువాత ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్‌, ఐర్లాండ్‌ ఉంటున్నాయని ఆ సంస్థ తెలిపింది. కొవిడ్‌-19 మహమ్మారి వేళలో కూడా రాష్ట్ర విద్యార్థుల అభిప్రాయాలలో పెద్దగా మార్పురాలేదని అధ్యయనంలో స్పష్టమయ్యింది. 2020లో విదేశాలకు వెళ్లాలనుకు న్నా ప్రయాణ ఆంక్షలు, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేసుకున్న వారే ఎక్కువని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 2019లో తెలంగాణ నుంచి 8వేల మంది విద్యార్థులు ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లారు. నిరుడు ఈ సంఖ్య 20 శాతం పెరిగితే, ఆశ్చర్యకరంగా ఈ ఏడాదిలో అది 62 శాతం పెరిగిందని ఆ సంస్థ వెల్లడించింది.