విద్యుత్తు సంస్కరణలకు సై!

ABN , First Publish Date - 2021-04-05T09:07:14+05:30 IST

కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సంస్కరణలతో.. వినియోగదారుడే రారాజు కానున్నాడు.

విద్యుత్తు సంస్కరణలకు సై!

  • కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రాలు సుముఖం
  • సంస్కరణలకు సై అన్న తెలుగు రాష్ట్రాలు
  • పార్లమెంటులో చట్టంగా మారడం ఇక లాంఛనమే?
  • ఆ మినిట్స్‌ అవాస్తవం: ట్రాన్స్‌కో సీఎండీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సంస్కరణలతో.. వినియోగదారుడే రారాజు కానున్నాడు. తనకు నచ్చిన సంస్థ నుంచి విద్యుత్తును కొనే వెసులుబాటు కలుగుతుంది. నాలుగైదు డిస్కమ్‌ల ధరలను పరిశీలించి.. ఎక్కడ తక్కువ ధరకు కరెంటు దొరికితే.. ఆ సంస్థకు మారవచ్చు. అంతేకాదు.. నెలంతా కరెంటు వాడుకున్నా.. మీటర్‌ రీడింగ్‌ను బట్టి వచ్చే బిల్లు ఎంత వస్తుందో? అనే కంగారు లేకుండా.. ముందుగానే డబ్బులు చెల్లించి, దానికి అనుగుణంగా విద్యుత్తును వినియోగించుకోవచ్చు. ప్రీపెయిడ్‌ మీటర్ల రాకతో.. మొబైల్‌ ఫోన్‌ రీచార్జ్‌ మాదిరిగానే.. కరెంటును రీచార్జ్‌ చేసుకోవచ్చు. ఈ మార్పులు త్వరలో జరగనున్నాయి. కేంద్ర ప్రతిపాదించిన సంస్కరణలకు కేరళ లాంటి ఒకట్రెండు రాష్ట్రాలు మినహా.. మిగతావన్నీ సుముఖత వ్యక్తం చేశాయి. అభిప్రాయ సేకరణ పూర్తయిన నేపథ్యంలో.. ఇక ఈ ప్రతిపాదనలు పార్లమెంట్‌లో చట్టరూపు దాల్చడం లాంఛనమే. కేంద్రం కొత్త సవరణలతో విద్యుత్తు రంగంలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఎలక్ట్రిసిటీ బోర్డు పరిధిలో ఉన్న సేవలు.. ఆ తర్వాత ఉత్పత్తి (జెన్‌కో), సరఫరా (ట్రాన్స్‌కో), పంపిణీ (డిస్కమ్‌)గా విడిపోయాయి. ఇప్పుడు పంపిణీ రంగంలో ప్రైవేటు కంపెనీలు ప్రవేశిస్తాయి.


నాలుగు ప్రధానాంశాలపైనే ఫోకస్‌!

కేంద్ర విద్యుత్తు శాఖ ఫిబ్రవరి 17న అన్ని రాష్ట్రాల సీఎ్‌సలు, ఇతర ఉన్నతాధికారులతో జరిపిన వర్చువల్‌ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించింది. అందులో ప్రధానమైనది.. కేంద్ర బడ్జెట్‌కు అనుగుణంగా వినియోగదారుడు తనకు నచ్చిన డిస్కమ్‌ నుంచి కరెంటు కొనే అవకాశం ఇవ్వడం. ఇప్పుడున్న డిస్కమ్‌లను ప్రైవేటీకరించి, విభజించే అంశం కూడా దీనితోనే ముడిపడి ఉంది. ఇక రెండోది.. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి, విద్యుత్తు నియంత్రణ మండళ్లలో న్యాయ నిపుణుడిని సభ్యుడిగా నియమించడం. మూడోది పునరుత్పాదక ప్రోత్సాహకానికి నిబంధనలను చేర్చడం. నాలుగోది, పెండింగ్‌లో ఉన్న కేసును పరిష్కరించేలా అప్పిలేట్‌ ట్రైబ్యునళ్లను బలోపేతం చేయడం. కేంద్రం మినిట్స్‌ మేరకు.. కేరళ వంటి ఒకట్రెండు రాష్ట్రాలు మినహా.. మిగతావన్నీ ఏదో ఒక రూపంలో తమ అంగీకారాన్ని తెలియజేశాయి. ప్రైవేటీకరణతో క్రాస్‌ సబ్సిడీ వంటి సమస్యలు తలెత్తుతాయని కేరళ అభిప్రాయపడింది. తమిళనాడు, కర్ణాటకలు ఈ ప్రతిపాదనలను స్వాగతించాయి. 


ఏపీ కూడా సవరణ చట్ట ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. నిధుల వినియోగం, స్టేట్‌ లోడ్‌ డిశ్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) పాత్ర, తదితరాలపై సమగ్ర పర్యవేక్షణ అవసరమని, ఈ అంశాలు సవరణ చట్టంలో నిర్దిష్టంగా ఉండాలని అభిప్రాయపడింది. తెలంగాణ కూడా కేంద్ర సవరణ చట్ట ప్రతిపాదనలను స్వాగతించినట్లు మినిట్స్‌ తెలియజేస్తున్నాయి. ఉద్యోగుల సంక్షేమం, అదనపు సిబ్బంది, రిటైర్‌మెంట్‌ వంటి అంశాలను తెలంగాణ ప్రస్తావించినట్లు ఆ సమావేశ మినిట్స్‌ చెబుతున్నాయి. అయితే.. ఈ సవరణలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, తక్షణ మే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ గత ఏడాది సెప్టెంబరు 15న శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసిన విషయం విదితమే..! ఫిబ్రవరిలో వీడియో కాన్ఫరెన్స్‌లో ఇదే విషయాన్ని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. కానీ, మినిట్స్‌లో మాత్రం రాష్ట్రప్రభుత్వం సంస్కరణలకు స్వాగతించినట్లు పేర్కొన్నారు.


సవరణ చట్టాన్ని స్వాగతించలేదు: డి.ప్రభాకర్‌రావు

విద్యుత్తు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అన్నారు. సవరణ బిల్లులో వ్యవసాయానికి మీటర్లు బిగించకూడదని తెలంగాణ కోరిందని, దీనికి కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. మినిట్స్‌లో మాత్రం బిల్లును తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తున్నట్లు రికార్డు కావడాన్ని తప్పుబట్టారు. ఇది పూర్తిగా అవాస్తవమని, బిల్లుకు మద్దతు ఇవ్వలేదని గుర్తుచేశారు.

Updated Date - 2021-04-05T09:07:14+05:30 IST