కోరిక తీర్చకపోతే ఖతం..

ABN , First Publish Date - 2020-06-07T06:34:23+05:30 IST

మహిళలపై కన్నేస్తాడు. వారిని తన దారికి..

కోరిక తీర్చకపోతే ఖతం..

పోలీసులకు చిక్కిన ‘సైకో కిల్లర్‌’ 

మూడు రాష్ట్రాల్లో ముగ్గురు మహిళల హత్య

తమిళనాడు పారిపోయేందుకు యత్నం

పట్టించిన సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌


శ్రీకాకుళం(ఆంధ్రజ్యోతి): మహిళలపై కన్నేస్తాడు. వారిని తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు. ఒకవేళ నిరాకరిస్తే.. వారిని కూృరంగా హతమారుస్తాడు. ఆపై మరో ప్రాంతానికి మకాం మార్చేస్తాడు. ఇలా మూడు రాష్ట్రాల్లో ముగ్గురు మహిళలను అతి కూృరంగా హత్య చేసిన.. ‘సైకో కిల్లర్‌’ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. నాలుగేళ్లుగా తప్పించుకుంటూ తిరుగుతున్న ఈ సైకో.. మునుపటి మాదిరిగానే ఒకరిని హత్య చేసి... మరో రాష్ట్రానికి పారిపోయేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందగా నిఘా పెట్టారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆచూకీ కనిపెట్టి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 


ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గండాహతి పంచాయతీ పలకబద్ర గ్రామానికి చెందిన సవర రమేష్‌(55) ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. గడచిన నాలుగేళ్లలో ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ముగ్గురు మహిళలను తన కోరిక తీర్చలేదన్న కారణంతోనే కిరాతకంగా హతమార్చాడు. రమేష్‌.. ఒడిశా రాష్ట్రం రంప పంచాయతీపరిధి భీంపురం గ్రామానికి చెందిన సంప అనే మహిళను వివాహం చేసుకుని.. అత్తవారింటికి ఇల్లరికం వెళ్లిపోయాడు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య సంప 2010 నుంచి మానసిక రోగానికి గురైంది. 2016 అక్టోబరు 16న సమీప గ్రామం బొడహంసకు చెందిన దేసేటి దమయంతి పశువులను మేపేందుకు భీంపురం పంట పొలాల్లోకి వచ్చింది. ఒంటిరిగా ఉన్న ఆమెను చూసి రమేష్‌ అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి కిరాతకంగా హతమార్చాడు. ఊర్లో ఈ విషయం తెలిస్తే పోలీసులు అరెస్ట్‌ చేస్తారని భావించి అక్కడి నుంచి పరారయ్యాడు. 


తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడేనికి మకాం మార్చేశాడు. అశ్వారావుపేటలో శ్రీలక్ష్మీతులసీ ఆగ్రోపేపర్‌ మిల్లులో కూలీగా చేరాడు. అక్కడే చింతలపాడు గ్రామానికి చెందిన ముచ్చిక కోసమ్మతో పరిచయం పెంచుకుని ఆమెపై కన్నేశాడు. 2017 నవంబరు 18న ఎవరూ లేని సమయంలో కోసమ్మను తన కోరిక తీర్చమని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించింది. దీంతో గొంతునులిమి అక్కడే ఉన్న బురదలో ఆమెను కుక్కి హత్య చేశాడు. ఆపై అక్కడి నుంచి పరారైపోయాడు. అశ్వారావుపేట పోలీసుస్టేషన్‌లో సవర రమేష్‌ను నిందితుడిగా గుర్తించి కేసు నమోదు చేశారు.


పోలీసులకు చిక్కకుండా అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మకాం మార్చాడు. గుంటూరు గోకినకొండ గ్రామంలో ఓ చేపలచెరువు వద్ద పనికి కుదిరాడు. అక్కడే చేపల మార్కెట్‌ వద్ద శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన బొమ్మాళి లక్ష్మి కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. లక్ష్మి అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు సపర్యలు చేసేందుకు ఆమె చెల్లి జయంతి సారవకోట నుంచి అక్కడికి వచ్చింది. జయంతికి భర్తలేడని తెలుసుకున్న రమేష్‌... ఆమెకు  డబ్బును ఆశగా చూపించి దగ్గరయ్యాడు. ఇంటి నిర్మాణం కోసం రూ.30వేల నగదును అప్పుగా  ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత జయంతి అలుదు గ్రామానికి వెళ్లిపోయింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయి.. తనను దూరం పెట్టిందన్న కారణంతో రమేష్‌ మరింత కసి పెంచుకున్నాడు. ఆమెను కూడా హతమార్చేందుకు ప్రణాళిక రూపొందించాడు.


ఈ క్రమంలో 2019 డిసెంబర్‌ 16న మెళియాపుట్టి మండలం పట్టుపురం వద్దకు రమేష్‌ వచ్చాడు. మాయమాటలు చెప్పి జయంతిని తన వద్దకు రప్పించాడు. ఆఫ్‌షోర్‌ కాలువ వద్దకు ఆమెను తీసుకువెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె నిరాకరించడంతో చేతులతో కొట్టి ఆమె గొంతును నులిమేశాడు. కొనప్రాణాలతో ఉన్న ఆమెను ఆఫ్‌షోర్‌ కాలువలోనే పడేశాడు. కాలువ లోతు సుమారు 40 అడుగుల వరకు ఉంటుంది. అక్కడి నుంచి పారిపోయి వజ్రపుకొత్తూరు మండలం చేరుకున్నాడు. అక్కడి నుంచి తమిళనాడు వెళ్లిపోయేందుకు పథకం రచించాడు. ఇదిలా ఉండగా జయంతి అదృశ్యమైందని సారవకోట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.


కొద్దిరోజుల తర్వాత కుళ్లిన ఓ మహిళ మృతదేహం ఆఫ్‌షోర్‌ కాలువలో లభ్యమైంది. ఈ మృతదేహం జయంతి బంధువులకు చూపించారు పోలీసులు. ఆమె సెల్‌ఫోన్‌తోపాటు తన ఫోన్‌ను స్విచ్‌ఆఫ్‌ చేసేసి రెండుమాసాల పాటు తనవద్దనే రమేష్‌ ఉంచుకున్నాడు. జయంతి సెల్‌ఫోన్‌ కాంటాక్ట్స్‌ ఆధారంగా కేసు పురోగతి కోసం పోలీసులు యత్నించారు. ఆ తర్వాత సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా.. నిందితుడు సవర రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మూడు రాష్ట్రాల్లో మూడు హత్యలు చేసింది అతడేనని పోలీసులు నిర్ధారణకు వచ్చి శనివారం అరెస్ట్‌ చేశారు. నిందితుడిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అమ్మిరెడ్డి ప్రవేశపెట్టి విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితుడికి కచ్చితంగా శిక్షపడేలా కఠిన కేసులు నమోదు చేశామని తెలిపారు. సైకో కిల్లర్‌ను పట్టుకోవడంలో ప్రతిభచూపిన సారవకోట, మెళియాపుట్టి పోలీసులను ఎస్పీ అభినందించారు. వారికి నగదు పురస్కారాలను  అందజేశారు. 


Updated Date - 2020-06-07T06:34:23+05:30 IST