Advertisement
Advertisement
Abn logo
Advertisement

షోయబ్ అక్తర్‌కు షాకిచ్చిన పీటీవీ.. రూ.100 మిలియన్లకు పరువునష్టం దావా

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు పాకిస్థాన్ టెలివిజన్ (పీటీవీ) భారీ షాకిచ్చింది. గత నెలలో జరిగిన ఓ చర్చా కార్యక్రమం సందర్భంగా హోస్ట్ నౌమన్ నియాజ్‌తో వాడివేడి వాగ్వివాదం జరిగింది. దీంతో షోయబ్ అర్ధంతరంగా వెళ్లిపోయాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన పీటీవీ అక్తర్‌పై రూ. 100 మిలియన్లకు పరువునష్టం దావా వేసింది.


 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై పాక్ విజయం తర్వాత పీటీవీలో మ్యాచ్‌పై విశ్లేషణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అక్తర్ చేసిన వ్యాఖ్యలపై హోస్ట్ నియాజ్ మాట్లాడుతూ.. ‘‘మీరు కొంచెం మొరటుగా మాట్లాడుతున్నారు. మరీ అంత ఓవర్ స్మార్ట్ పనికిరాదు. మీరిక ఇక్కడి నుంచి వెళ్లొచ్చు’’ అని అన్నారు.  ఆయన మాటలతో నొచ్చుకున్న అక్తర్ పీటీవీలో క్రికెట్ అనలిస్ట్ ఉద్యోగానికి అక్కడే రాజీనామా చేసి వెళ్లిపోయాడు.


అయితే, చర్చ జరుగుతుండగా లైవ్‌లో రాజీనామా చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, రాజీనామా కారణంగా చానల్‌కు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని పేర్కొంటూ తాజాగా అక్తర్‌కు పరువు నష్టం నోటీసులు పంపింది. అలాగే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా టీ20 ప్రపంచకప్ కోసం దుబాయ్ వెళ్లిపోయాడని ఆరోపించింది. ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ‘ఇండియన్ టీవీ’లో కనిపించాడని, ఇది పీటీవీకి కోలుకోలేని దెబ్బ అని పేర్కొంది. 


పీటీవీకి జరిగిన నష్టానికి గాను రూ. 100 మిలియన్లు చెల్లించాలని ఆదేశించింది. అలాగే, మూడు నెలల వేతనంతో సమానమైన 33,33,000 కూడా చెల్లించాలని కోరింది. లేదంటే పీటీసీ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.


నోటీసులు అందుకున్న అక్తర్ పీటీవీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన గౌరవ మర్యాదలను కాపాడలేకపోయిన పీటీవీ ఇప్పుడు నోటీసులు పంపిందని ట్వీట్ చేశాడు. తాను స్వతహాగా ఓ ఫైటర్‌నని, తాను కూడా చట్టబద్ధంగా పోరాడతానని తేల్చిచెప్పాడు. తదుపరి ఏం చేయాలనేది తన లాయర్ చూసుకుంటారని పేర్కొన్నాడు.  

Advertisement
Advertisement