జాగ్రత్తగా ఉండకపోతే పడకలు కూడా దొరకవ్‌!

ABN , First Publish Date - 2021-04-08T07:19:06+05:30 IST

కరోనా రెండో వేవ్‌ ఉధృతి తీవ్రస్థాయిలో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కొవిడ్‌ నిబంధనల్ని పాటించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు సూచించారు.

జాగ్రత్తగా ఉండకపోతే పడకలు కూడా దొరకవ్‌!

  • ప్రజారోగ్య శాఖ హెచ్చరిక 10వేలు దాటిన క్రియాశీల కేసులు
  • పాలమూరులో 374 మందికి 
  • కొత్తపల్లిలో 90.. నిజామాబాద్‌లో ఒకే పరిశ్రమలో 46కేసులు
  • గాంధీలో 19 మంది మృత్యువాత
  • సిరిసిల్లలో ఐదుగురు మరణం
  • ఉధృతంగా సెకండ్‌ వేవ్‌
  • నాలుగు నెలల తర్వాత తొలిసారిగా..!

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: కరోనా రెండో వేవ్‌ ఉధృతి తీవ్రస్థాయిలో ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కొవిడ్‌ నిబంధనల్ని పాటించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు సూచించారు. అప్రమత్తంగా ఉండకపోతే.. కనీసం ఆస్పత్రుల్లో పడకలు కూడా దొరకని పరిస్థితి తలెత్తే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. బుధవారం టీకా బులెటిన్‌ విడుదల సందర్భంగా ఆయన ఈమేరకు వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో కొవిడ్‌ క్రియాశీల(యాక్టివ్‌) కేసులు మళ్లీ పదివేలు దాటాయి. నాలుగు నెలల తర్వాత ఈ మార్కు దాటడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో యాక్టివ్‌ కొవిడ్‌ కేసుల సంఖ్య మంగళవారం 11,617కు పెరిగింది. కోలుకున్న వారి సంఖ్య 3,03,298కి చేరింది. అలాగే కరోనా కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరాయి. మంగళవారం కొత్తగా 1914 మంది మహమ్మారి బారినపడ్డారు. దీంతో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 3,16,649కు, మరణాల సంఖ్య 1734కు పెరిగింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 393మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా, మేడ్చల్‌లో 205, నిర్మల్‌లో 104, నిజామాబాద్‌లో 179, రంగారెడ్డిలో 169, సంగారెడ్డిలో 76, జగిత్యాలలో 68, కరీంనగర్‌లో 80మందికి వైరస్‌ సోకింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 374 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నమోదవుతున్న కేసుల సంఖ్య ఏడు రోజుల్లో రెట్టింపయ్యింది. ఈ నెల ఒకటిన 103 కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య రెండు రెట్లకుపైగా పెరిగి 374కు చేరింది. 


నిజామాబాద్‌ రూరల్‌ మండలంలో ఒకే పరిశ్రమలో ఏకంగా 46మంది కార్మికులకు కరోనా సోకడం స్థానికంగా కలకలం రేపింది. ఓ పేపర్‌ పరిశ్రమలో 120మంది కార్మికులకు గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెలుగుచూసింది. నిజామాబాద్‌ నగరంలోని సబ్‌రిజిస్టార్‌ కార్యాలయంలో నలుగురు ఉద్యోగులతో పాటు పది మంది డాక్యుమెంట్‌ రైటర్‌లకు కరోనా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీంతో శుక్రవారం వరకూ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక.. నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో పూజారితో పాటు సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు.


 ఇక జిల్లాలో బుధవారం మొత్తం 129 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీలో బుధవారం 134 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. లింగాపూర్‌ మండలం కొత్తపల్లి గ్రామంలో బుధవారం 90మందికి వైరస్‌ సోకింది. యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం ఆరుగురు ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. యాదాద్రి ఆలయ విస్తరణ పనుల్లో ఉన్న ఇద్దరు కూలీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక, టీకా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 932 ప్రభుత్వ, 246 ప్రైవేటు వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 57,803 మంది తొలిసారి టీకా తీసుకున్నారు. దీంతో తొలిడోసు తీసుకున్నవారి మొత్తం సంఖ్య 12,37,948కు చేరింది. 4782 మంది రెండో డోసు తీసుకోవడంతో ఆ సంఖ్య 2,70,822కు పెరిగినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు టీకా బులెటిన్‌లో వెల్లడించారు. 


గాంధీలో కరోనాతో 19 మంది మృతి 

గాంధీ ఆస్పత్రిలో ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న 19 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి మధ్యలో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. కాగా ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో 176  మంది చికిత్స పొందుతున్నారని గాంధీ వైద్యులు చెప్పారు.


ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా భయం

పెరుగుతున్న కరోనా కేసులతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఆర్టీసీ సిబ్బంది వణికిపోతున్నారు. గడచిన మూడు నెలల్లో 180మంది సిబ్బంది కరోనా బారిన పడటం, వారం రోజులుగా ఉధృతి ఎక్కువగా ఉండటంతో విధులకు వచ్చేందుకు భయపడుతున్నారు. తమకు గ్లౌజులతో పాటు ఫేస్‌ షీట్‌లు, మాస్కులు ఇవ్వాలని కండక్టర్లు కోరుతున్నారు. ఉద్యోగులకు ప్రతి వారం కొవిడ్‌ టెస్ట్‌లు ఉచితంగా నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొవిడ్‌తో చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు 50లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని, సిబ్బందికి ఉచితంగా టీకాలు ఇవ్వాలని టీఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు.



Updated Date - 2021-04-08T07:19:06+05:30 IST