‘ప్రజారోగ్య’మే సంజీవని

ABN , First Publish Date - 2020-07-10T05:55:02+05:30 IST

ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ రంగ ఆరోగ్య భద్రతా సంస్థలు ప్రధాన పాత్ర వహించాలనే సత్యాన్ని ప్రస్తుత కొవిడ్ సంక్షోభం మరోసారి స్పష్టం చేసింది. పటిష్ఠ ప్రజారోగ్య వ్యవస్థ వాంఛనీయమేగాక అత్యవసరమని...

‘ప్రజారోగ్య’మే సంజీవని

ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ రంగ ఆరోగ్య భద్రతా సంస్థలు ప్రధాన పాత్ర వహించాలనే సత్యాన్ని ప్రస్తుత కొవిడ్ సంక్షోభం మరోసారి స్పష్టం చేసింది. పటిష్ఠ ప్రజారోగ్య వ్యవస్థ వాంఛనీయమేగాక అత్యవసరమని కూడా కేరళ నిరూపించింది. కొవిడ్ సంక్షోభ పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యమిస్తూనే ప్రజారోగ్య వ్యవస్థను ఎలా పటిష్ఠపరచాలనే విషయమై సమగ్ర, ప్రయోజనకర చర్చచేసి కార్యాచరణకు పూనుకోవల్సిన సమయమాసన్నమయింది.


వైద్యులు ఎల్లెడలా వున్నారు. కానీ వైద్యం సామాన్యునికి అందుబాటులో లేదు. ఎందుకని? వైద్యరంగంలో ప్రైవేట్ సంస్థల ప్రాబల్యం పెరిగిపోవడమే. ప్రైవేట్ వైద్య రంగం ప్రణాళికారహితంగా పెరిగిపోతోంది. క్రమబద్ధీకరణ లోపించింది. ఇది హితకరంగా లేదు. దీని విషమ పర్యవసానాలు ఏమిటో గుర్తించేందుకు మనం కేవలం ఒకే ఒక్క ‘సంక్షోభం’ దూరంలో మాత్రమే ఉన్నామని ప్రజారోగ్య నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఇదిగో, కరోనా ప్రళయం రానే వచ్చింది. అనూహ్యంగా విరుచుకుపడిన ఈ ఉపద్రవాన్ని మనం సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నామా? లేదు. అవసరమైన మానవ వనరులు, ఆరోగ్య భద్రతా సదుపాయాలు లోపించిన ప్రజారోగ్య వ్యవస్థ కరోనా కాటుకు అల్లల్లాడుతున్న రోగులను ఆదుకోలేకపోతోంది. ప్రభుత్వాసుపత్రులలోని పడకలు దేశ రాజధానీనగరవాసులకు మాత్రమేనని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక వివాదాస్పద ఉత్తర్వును జారీ చేసిందంటే వైద్య వసతుల పరిస్థితి ఎంతదయనీయంగా ఉందో అర్థం కావడం లేదూ? ఢిల్లీలోనే కాదు, మన గల్లీలలోనూ కరోనా రోగులు వైద్యంకోసం ఒక ప్రభుత్వాసుపత్రి నుంచి మరో ప్రభుత్వాసుపత్రికి పరుగులు పెడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యం ఎలాగూ తమకు అందుబాటులో ఉండదని వారికి తెలుసు. అన్నట్టుగానే ప్రైవేట్ ఆస్పత్రులలో కరోనా వైద్యానికి వసూలు చేస్తున్న చార్జీలు రోజురోజుకూ పెరుగుతూనే వున్నాయి. ఈ చార్జీలకు ఒక పరిమితి విధించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం ముదావహం. సకాలంలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన న్యాయ నిర్ణయమిది. 


కరోనా లాంటి ఆరోగ్య విపత్తు వేళ ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించాల్సిన పాత్ర ఏమిటో గుర్తించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు సంగతంగా లేవు. అయినా ఆ ప్రయత్నాలకు ప్రతిస్పందనలు పలు విధాల ఉంటున్నాయి. అవి సమస్య పరిష్కారానికి దోహదం చేసేవిగా ఉండడం లేదని మరి చెప్పనవసరం లేదు. కొవిడ్-19 రోగుల నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రులలోని పడకలను ప్రభుత్వాలు తమ ఆధీనంలోకి తీసుకొంటున్నాయి. విపత్తు నిర్వహణా చట్టాన్ని ప్రయోగించి ప్రైవేట్ ఆస్పత్రులలో కొవిడ్ చికిత్సా చార్జీలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇది, వైద్య సేవలను అందించడంలో ప్రజారోగ్య సంస్థలు నిర్వర్తించాల్సిన పాత్రపై స్పష్టమైన దార్శనికత లేకపోవడాన్ని, మహమ్మారులు విజృంభించిన సమయంలో ప్రైవేట్ వైద్య సంస్థలకు ఎలాంటి బాధ్యతలు నిర్దేశించాలన్న విషయమై స్పష్టత కొరవడడాన్నే సూచిస్తుంది. ప్రస్తుత విషమ పరిస్థితుల్లో దేశంలోని ఆరోగ్య వ్యవస్థలకు సంబంధించిన మౌలిక అంశాలను నిశితంగా పరిశీలించాల్సిన అగత్యమెంతైనా ఉన్నది. 


ఆరోగ్య భద్రతా వ్యవస్థల తీరుతెన్నులను రెండు కోణాల నుంచి పరిశీలించ వలసివున్నది. అవి: ఆర్థిక వనరులు, మానవ వనరులు. ఈ రెండు అంశాలను సమగ్రంగా పరిశీలిస్తే కొవిడ్-19 ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో ఎదురవుతున్న ఇక్కట్లను మనం సక్రమంగా, ప్రయోజనకరంగా అర్థం చేసుకోగలుగుతాము. తొలుత ఆర్థిక వనరుల కోణాన్ని అంటే ఆరోగ్య భద్రతా వ్యవస్థల సమగ్ర అభివృద్ధికి వెచ్చిస్తున్న పెట్టుబడుల విషయాన్ని తీసుకుందాం. ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2019’ ను స్థూలంగా చూస్తే గత దశాబ్దంలో ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయం స్థూల దేశియోత్పత్తి (జీడీపీ)లో 1.1 నుంచి 1.2 శాతాన్ని మించలేదు! మన ఇరుగు పొరుగు దేశాలైన శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియాలు చేసిన వ్యయంతో పోలిస్తే మన వ్యయం చాలా తక్కువ. కొవిడ్-19 కేసుల సంఖ్య భారీగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ వరుసగా తమ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి లో 0.6, 0.74, 0.76 శాతం మాత్రమే ప్రజారోగ్యంపై ఖర్చుచేశాయి. ఆరోగ్యభద్రతారంగ అభివృద్ధికి పెట్టుబడులు అతి తక్కువగా పెట్టడం వల్లే ప్రభుత్వాసుపత్రులలో పరిస్థితులు అధోగతిలో అఘోరిస్తున్నాయి. ఈ దైన్య స్థితే అంతిమంగా ప్రైవేట్ వైద్యరంగం ప్రత్యేకించి పట్టణ ప్రాంతాలలో అమోఘంగా విలసిల్లేందుకు దారితీసింది. 


కొవిడ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యభద్రతా వ్యవస్థలను ఇతోధికంగా మెరుగుపరచడం చాలా ముఖ్యం. ప్రభుత్వాసుపత్రులలో పడకలు, ఇంటెన్సివ్‌కేర్ యూ నిట్ (ఐసీయూ)లు, వెంటిలేటర్ల సంఖ్య గణనీయంగా పెరగవలసిన అవసరం ఎంతైనావున్నది. మొత్తం కొవిడ్ రోగులలో 5 నుంచి 10 శాతం మందికి వెంటిలేటర్ల రూపేణా సేవలనందించి వలసివున్నది. మన దేశం లోని ప్రభుత్వాసుపత్రులలో పడకల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉన్నదని ప్రిన్సిటన్ విశ్వవిద్యాలయ ‘సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్, పాలసీ’ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. ప్రభుత్వాసుపత్రులలో 7 లక్షలు, ప్రైవేట్ ఆసుపత్రులలో 12 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయి. ఐసియులు, వెంటిలేటర్ల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఆరోగ్య భద్రతకు వ్యయాల పెంపుదలపై నిర్లక్ష్యం చూపడం వల్ల అందుకు కేటాయించిన నిధులు సైతం ప్రైవేట్ రంగానికి అనుకూలంగా వినియోగింపబడుతున్నాయి! 


ఇక మానవ వనరుల విషయాన్ని చూద్దాం. ప్రజారోగ్య వ్యవస్థల్లో అంటే ప్రభుత్వాసుపత్రులకు మంజూరైన డాక్టర్లు, ఇతర సిబ్బంది పోస్టులలో అత్యధిక భాగం ఖాళీగా ఉన్నాయనేది సర్వత్రా అంగీకరిస్తున్న ఒక కఠోర వాస్తవం. ప్రస్తుత విలయవేళ మానవ వనరుల కొరతను అత్యవసరంగా తొలగించేందుకు ప్రభుత్వాలు కాంట్రాక్టు పద్ధతిన ఆరోగ్యభద్రతా సిబ్బందిని నియమించడానికి పూనుకుంటున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవలి సాధికారిక అంచనాల ప్రకారం మన దేశంలో ప్రస్తుతం ప్రతి పదివేల మంది ప్రజలకు 29 మంది వైద్యులే వున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి పదివేలమంది జనాభాకు 44 మంది ఆరోగ్యభద్రతా సిబ్బంది వుండి తీరాలి. ఈ లోటును భర్తీ చేసేందుకు మన దేశం వైద్య విద్యా సంస్థలను ఇతోధిక సంఖ్యలో నెలకొల్పుతోంది. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల అనంతరం ఎల్లెడలా వైద్య కళాశాలల వ్యవస్థాపన ముమ్మరమయింది. అయితే ఈ ఉన్నత వైద్యవిద్యారంగంలో పరిమాణం, వ్యయం, నాణ్యతను సమన్వయపరచవలసిన అవసరం ఎంతైనా వున్నది. 1950లో దేశ వ్యాప్తంగా వైద్యకళాశాల్లో చేరిన మొత్తం విద్యార్థుల సంఖ్య 4250. వీరిలో 4175 (98.6 శాతం) మంది ప్రభుత్వ వైద్యకళాశాల్లోను, 60 మంది (1.4 శాతం) ప్రైవేట్ వైద్యకళాశాలల్లో చేరారు. 1970లో దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల సంఖ్య 12,275 మందికాగా వారిలో 10, 925 (89 శాతం) మంది ప్రభుత్వ వైద్యకళాశాలల్లో చేరినవారే. మిగతా 11 శాతంమంది ప్రైవేట్ వైద్యకళాలలకు చెందినవారు. 1990ల అనంతరం ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2000 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాల్లో చేరిన వారు 65.7 శాతం కాగా ప్రైవేట్ వైద్యకళాశాలల్లో చేరిన వారు 34.3 శాతం మంది చేరారు. 2013 సంవత్సరాంతానికి మన దేశంలో మొత్తం ఆ 381 వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో చేరిన మొత్తం విద్యార్థుల సంఖ్య 49,418 మంది కాగా వారిలో 24, 063 (48.7 శాతం) మంది ప్రభుత్వ వైద్యకళాశాలల్లోను, 25, 355 (51.3 శాతం) మంది ప్రైవేట్ వైద్యకళాశాలల్లోను చేరారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే గత ఆరు దశాడ్దాలుగా భారతీయ వైద్య విద్యారంగంలో ప్రైవేట్ వైద్య కళాశాలల ప్రాబల్యం కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యకళాశాలల నుంచి ఏటా వేలాది విద్యార్థులు పట్టభద్రులు అవుతున్నప్పటికీ ప్రజారోగ్య రంగంలో మానవ వనరుల సంఖ్య పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా లేదు. కారణమేమిటి? ప్రభుత్వాసుపత్రులలో సదుపాయాలు నాసిరకంగా ఉండడం, ఆ వ్యవస్థలో పనిచేసేందుకు అనుకూల, ప్రోత్సాహకర వాతావరణం పూర్తిగా కొరవడడమేనని చెప్పక తప్పదు. ప్రజారోగ్య వ్యవస్థలోని లోపాలు, లొసుగులను సరిదిద్దేందుకు విధాన నిర్ణేతలు సైతం శ్రద్ధ చూపడం లేదు. ప్రభుత్వాసుపత్రులలో పరిస్థితులు మెరుగుపడతాయనే ఆశ లేకపోవడంతో ప్రజలు పూర్తిగా ప్రైవేట్ ఆస్పత్రుల సేవలపై ఆధారపడడం అంతకంతకూ పెరిగిపోతోంది. 


ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ రంగ ఆరోగ్య భద్రతా సంస్థలు ప్రధాన పాత్ర వహించాలనే సత్యాన్ని ప్రస్తుత కొవిడ్ సంక్షోభం మరోసారి స్పష్టం చేసింది. వైద్యసేవలు ప్రభుత్వ రంగం ద్వారా అందించాలా లేక ప్రైవేట్ రంగం ద్వారా సమకూర్చాలా అనే విషయమై సైద్ధాంతిక చర్చలు చేయడం ఇంకెంత మాత్రం తగదు. ప్రజల వైద్యావసరాలను తీర్చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను సమన్వయపరిచి సత్ఫలితాలను సాధించగలమా? ప్రైవేట్ రంగం నుంచి లభ్యమయ్యే వైద్య సేవలను ప్రభుత్వ రంగం కొనుగోలు చేయడం లేదా వాటికి పూచీదారుగా ఉండడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది సమన్వయ వాదుల ప్రతిపాదన (ఆరోగ్యబీమా విషయమై చర్చల్లో ఇదే ప్రధానాంశంగా ఉన్నది). పటిష్ఠ ప్రజారోగ్య వ్యవస్థ వాంఛనీయమేగాక అత్యవసరమని కూడా కేరళ రాష్ట్ర అనుభవాలు నిరూపించాయి. కొవిడ్ సంక్షోభ పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యమిస్తూనే ప్రజారోగ్య వ్యవస్థను ఎలా పటిష్ఠపరచాలనే విషయమై సమగ్ర, ప్రయోజనకర చర్చచేసి కార్యాచరణకు దిగవలసిన సమయమాసన్నమయింది. కరోనా కంటే భయానక మహమ్మారులు సంభవించే ముప్పు పెరుగుతున్న దృష్ట్యా ఎటువంటి ఆరోగ్య సంక్షోభాన్ని అయినా సమర్థంగా ఎదుర్కోనేలా ప్రజారోగ్య వ్యవస్థను పరిపూర్ణస్థాయిలో శక్తిమంతంచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 


-సందేష్ కొట్టె టాటా ట్రస్ట్స్, ముంబై

Updated Date - 2020-07-10T05:55:02+05:30 IST