మాట్లాడుతున్న జేసీ వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాభిప్రాయ సేకరణలో తేల్చిచెప్పిన బవులవాడ గ్రామస్థులు
సమస్యలపై జాయింట్ కలెక్టర్ ఎదుట ఏకరువు
తుమ్మపాల, నవంబరు 27: ‘మా గ్రామంలో క్వారీలు, క్రషర్లు వద్దు బాబోయ్’ అని బవులవాడ గ్రామస్థులు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. గ్రామంలో క్వారీ, క్రషర్ల నిర్వహణపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ సదస్సును నిర్వహించారు. ఇప్పుడున్న క్వారీ, క్రషర్లతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎప్పుడూ రోగాల బారినపడుతున్నామని, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో కొంత మంది మృతి చెందారని, గ్రామంలో ఇప్పటికే 50 మందికిపైగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నామని సభలో గ్రామస్థులు తెలిపారు. భారీ లోడ్లతో లారీలు రాకపోకలు సాగించడంతో రహదారులు పాడయ్యాయని, కాలుష్యంతో పంటలు నాశనమవుతున్నాయని వాపోయారు. గ్రామంలో క్వారీ, క్రషర్ల అనుమతులను రద్దు చేసి ప్రజలను రక్షించాలని వేడుకున్నారు.
జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, గ్రామస్థుల అభిప్రాయాలను అన్ని కోణాల్లో రికార్డు చేశామని, ఆయా శాఖల అధికారులకు నివేదికను పంపి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పర్యావరణ పరిరక్షణ అధికారి మీరాసుభాన్, అనకాపల్లి మైన్స్ ఏడీ ప్రకాశ్, తహసీల్దార్ శ్రీనివాసరావు, సీఐ ఎల్.భాస్కరరావు, రూరల్ ఎస్‌ఐ ఈశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, మాజీ సర్పంచ్ కోట్ని ఈశ్వరరావు, వైసీపీ గ్రామ అధ్యక్షుడు మజ్జి వెంకటఅప్పారావు అధిక సంఖ్యలో నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.