Abn logo
Sep 20 2021 @ 00:00AM

సుందరీకరణ పేరుతో ప్రజల సొమ్ము వృథా

దేవీచౌక్‌ వద్ద సుందరీకరణ పనులను పరిశీలిస్తున్న గోరంట్ల

  • ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
  • దేవీచౌక్‌ సెంటర్‌లో సుందరీకరణ పనుల పరిశీలన

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 20: రాజమహేంద్రవరం నగర సుందరీకరణ పేరుతో ప్రజల సొమ్మును అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వృథా చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. సోమవారం ఆయన దేవీచౌక్‌ సెంటర్‌లో సుందరీకరణ పనులు పరిశీలించారు. చాలా ప్రాంతాల్లో రాళ్లు పైకి లేచిపోవడాన్ని గమనించారు. అసలే ప్రభుత్వం అరకొర నిధులతో కాలం గడుపుతుంటే రాజమహేంద్రవరం నాయకులు మాత్రం వారి స్వప్రయోజనాల కోసం నగరపాలక సంస్థ నిధులు రూ.5 కోట్లతో సుందరీకరణ పనులు చేయడమేమిటని ప్రశ్నించారు. కడప నుంచి రాళ్లు తెప్పించి సుందరీకరణ చేశారని, కానీ రాళ్లు కొన్ని రోజులకే ఎక్కడిక్కడ లేచిపోయి వాహనదారులకు ఇబ్బందిగా మారిందన్నారు. నగరంలో ఛిద్రమైన రోడ్లు, డ్రైయిన్లు బాగు చేయకుండా ఇలా నిధులు దుర్విని యోగం చేయడం సరికాదన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో కానీ, రూరల్‌ ఎమ్మెల్యేగా తమతో కానీ సంప్రదించకుండా నిధులెలా కేటాయించారని అధికారులను ఆయన ప్రశ్నించారు. కనీస మర్యాద పాటించకుండా కార్పొరేషన్‌ అధికారులు వ్యవహరిస్తున్నారని, సుందరీకరణ పనులపై తక్షణమే విజిలెన్స్‌శాఖతో సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.