Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jun 1 2021 @ 04:07AM

లక్షద్వీప్‌లో ఆంక్షల రగడ

  • గో మాంసంపై నిషేధం.. ఇద్దరుకంటే పిల్లలుంటే పోటీకి అనర్హత
  • రిసార్టుల్లో మద్యానికి ఓకే.. కఠినంగా యాంటీగూండా చట్టం
  • అడ్మినిస్ర్టేటర్‌ ప్రఫుల్‌ నిర్ణయాలపై ప్రజల్లో ఆగ్రహం

కరావటి, మే 31: లక్షద్వీప్‌.. కేరళకు అత్యంత సమీపాన ఉండే 36 చిన్న దీవుల కలయిక! వీటిలో కేవలం 10 దీవుల్లోనే ప్రజలు నివసిస్తున్నారు. ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలోని మలబార్‌ జిల్లాలో భాగం! 1956లో కేరళ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేంద్ర పాలిత ప్రాంత హోదా లభించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఇక్కడి జనాభా 65 వేలు. వీరిలో 96 శాతం ముస్లిములు. అత్యధికులు మలయాళం మాట్లాడతారు. ప్రశాంతతకు, పర్యాటకానికి నిలయమైన లక్షద్వీప్‌ ప్రజల్లో ఇప్పుడు అసహనం పెరుగుతోంది. పాలన యంత్రాంగం నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ద్వీప వ్యవహారాలను చూస్తున్న ప్రఫుల్‌ కే పటేల్‌ ప్రతిపాదనలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. వాటి వివరాల్లోకి వెళితే..

ప్రతిపాదన: సంబంధిత శాఖ అనుమతి లేకుండా గోవులను, బర్రెలను వధించడం, మాంసం విక్రయించడం నిషేధం. 

నిరసన: ఈ నిర్ణయం తమ స్వేచ్ఛకు, ఆహారపు అలవాట్లకు భంగం కలిగించేదిగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. కనీసం స్థానిక సంస్థలతోనైనా సంప్రదించలేదని ఆరోపిస్తున్నారు.

ప్రతిపాదన: ఇద్దరు కంటే పిల్లలున్న వారు గ్రామ పంచాయతీ సభ్యులుగా పోటీ చేసేందుకు అనర్హులు. ఇప్పటికే ఇద్దరు పిల్లలకుపైగా ఉన్నవారు, నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత పిల్లల్ని కనకపోతే.. వారికి ఇది వర్తించదు.

నిరసన: స్థానికులు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.

ప్రతిపాదన: దీవుల్లోని రిసార్టుల్లో మద్యం సరఫరాకు అనుమతి. ఇప్పటి వరకూ ఒకటి తప్పితే అన్ని దీవుల్లోనూ మద్యంపై నిషేధం ఉంది.

నిరసన: ఈ ప్రతిపాదనతో లక్షద్వీ్‌పలో మద్యం ఏరులై పారుతుందని స్థానికుల ఆందోళన.

ప్రతిపాదన: లక్షద్వీ్‌పలోని దీవులను అభివృద్ధి చేసేందుకు లక్షద్వీప్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ రెగ్యులేషన్‌ పేరిట ప్రఫుల్‌ యంత్రాంగం ఒక ముసాయిదాను తీసుకొచ్చింది. భూ సమీకరణ, వినియోగం విషయాల్లో సమూల మార్పులను తీసుకొచ్చింది.

నిరసన: భారీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టులు దీవుల పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతిపాదన: సమాజంలో శాంతికి ఆటంకం కలిగించే వారిని ఎటువంటి చట్టపరమైన విచారణ లేకుండా ఏడాదిపాటు ఖైదు చేసేందుకు వీలు కల్పించే యాంటీ గూండా నిబంధనను ప్రఫుల్‌ యంత్రాంగం సిద్ధం చేసింది.

నిరసన: అతి తక్కువ నేరాలు నమోదయ్యే లక్షద్వీ్‌పలో ఇంత కఠినమైన చట్టాన్ని తీసుకురావడం స్థానికుల్లో ఆందోళనను రేపింది. యంత్రాంగాన్ని విమర్శించే వారిని అణచివేసేందుకే ఈ నిబంధన తీసుకొచ్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిపాదన: కొవిడ్‌ మొదలైన ఏడాదిపాటు లక్షద్వీ్‌పలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కఠినమైన క్వారంటైన్‌ నిబంధనలు, దీవులకు వచ్చేవారికి పరీక్షలు నిర్వహించడంతో ఇది సాధ్యమైంది. అయితే.. గత ఏడాది డిసెంబరులో వాటిని సడలించారు. తప్పనిసరి క్వారంటైన్‌ను తొలగించిన యంత్రాంగం, నెగెటివ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ ధ్రువపత్రం ఉంటే దీవుల్లోకి అనుమతినిచ్చింది.

నిరసన: నిబంధనలు సడలించగానే.. కొవిడ్‌ గ్రీన్‌ జోన్‌ హోదాను లక్షద్వీప్‌ కోల్పోయింది. ఈనెల 28 నాటికి దీవుల్లో 7300 కేసులు, 28 మరణాలూ నమోదయ్యాయి. దీనికి యంత్రాంగమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.


ప్రఫుల్‌ను వెనక్కి పిలవండి: కేరళ అసెంబ్లీ 

లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌ గడచిన ఐదు నెలల్లో కేవలం 20 రోజులు మాత్రమే దీవులకు వచ్చారని, ద్వీపవాసుల సంస్కృతిని ఆయన అర్థం చేసుకోలేదని లక్షద్వీప్‌ పార్లమెంటు సభ్యుడు, ఎన్‌సీపీ నేత మహ్మద్‌ ఫైజల్‌ తాజాగా ఆరోపించారు. కేంద్రం తాము అనుకున్న నిబంధనల్నే అమలు చేయాలని భావిస్తే న్యాయమార్గంలో పోరాడుతామని హెచ్చరించారు. ‘‘ప్రఫుల్‌ నిర్ణయాలపై వ్యతిరేకతను మేము కొనసాగిస్తాం. సాధారణంగా దీవుల్లో ఏదైనా తప్పు జరిగితే అడ్మినిస్ట్రేటర్‌ను ఆశ్రయిస్తాం. కానీ ఆ కుర్చీ నుంచే తప్పులు జరుగుతున్నాయి. కేంద్రం ఈ విషయంలో వెంటనే ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. డామన్‌ డయ్యూ ఎంపీ మోహన్‌ డేల్కర్‌ ఆత్మహత్య కేసు నిందితుల్లో ప్రఫుల్‌ ఉన్నారు. అలాంటి వ్యక్తి కారణంగా తమ పేరు పోతున్నా.. కేంద్రం ఇంకా ఎందుకు ఆయన్ను కొనసాగిస్తుందో అర్థం కావడం లేదు. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు మా పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ప్రయత్నిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. లక్షద్వీప్‌ పాలకుడిగా ఉన్న ప్రఫుల్‌ పటేల్‌ను కేంద్రం వెనక్కి పిలవాలని, దీవుల్లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కోరుతూ కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. దేశంలోనే లక్షద్వీ్‌పకు మద్దతుగా తీర్మానం చేసిన తొలి రాష్ట్రంగా నిలిచింది. 


Advertisement
Advertisement