ప్రజారక్షణే ప్రభువుల బాధ్యత

ABN , First Publish Date - 2020-10-12T09:52:04+05:30 IST

‘‘ప్రాణ రక్షణ కోరి నన్ను ప్రార్థించిన వారికి నేను అభయమిచ్చితిని. దీనులను కాపాడుయే కదా. సమర్థులైన ప్రభువులకు చేయదగిన

ప్రజారక్షణే ప్రభువుల బాధ్యత

ఆసాంప్రాణ పరీప్సూనా విధేయమభయం హిమే!

ఏతావాన్‌ హి ప్రభోరర్థో యద్దీన పరిపాలనమ్‌!!


‘‘ప్రాణ రక్షణ కోరి నన్ను ప్రార్థించిన వారికి నేను అభయమిచ్చితిని. దీనులను కాపాడుయే కదా. సమర్థులైన ప్రభువులకు చేయదగిన కార్యము’’.. వేదవ్యాసహర్షి ప్రపంచానికి ప్రసాదించిన శ్రీమద్భాగవత గ్రంథంలో అందించిన ఇతివృత్తాల్లో క్షీరసాగర వృత్తాంతం ఒకటి. ఈ ఘట్టంలో కథను చెప్పడంతోపాటు ప్రపంచ మానవాళికి అనేక ధర్మాలను కూడా వ్యాస భగవానుడు బోధించాడు. క్షీరసాగర మథనంలో హాలాహలం వచ్చినప్పుడు.. ఆ గరళాన్ని మింగే ముందు పరమశివుడు.. అమ్మవారితో పలికిన మాటలివి. సర్వలోకాలకు ప్రభువైన తనకు ఆపదలు సంభవించినప్పుడు లోకాలను కాపాడే బాధ్యత ఉంటుందన్నది దాని పరమార్థం.


ఇది మహాభాగవతం అందించిన గొప్పసందేశం. తమను కాపాడే బాధ్యత పాలించే ప్రభువులదేనని ప్రజలు భావిస్తుంటారు. అది సహజ ధర్మం. ఆ ధర్మ నిర్వహణ చేయలేని పాలకుడు అసమర్థుడే. ప్రజలకు ఏ విధమైన కష్టమొచ్చినా, ప్రాణభయమేర్పడినా.. వారిని కాపాడాల్సిన బాధ్యత నిస్సంశయంగా వాళ్లను పాలించే ప్రభువుల కర్తవ్యమేనన్నది సత్యమార్గం. అందుకే.. పరమశివుడు హాలాహలాన్ని తాగి.. లోకాన్ని కాపాడటానికి సిద్ధమైనప్పుడు.. అమ్మవారు కూడా ‘‘ప్రాణేచ్ఛ హర్చి జొచ్చిన ప్రాణుల రక్షింప బలయు ప్రభువుల కెల్లన్‌..’’ అంటూ సమర్థించింది. ‘‘మంగళ సూత్రమునెంత మది నమ్మినదో!’’ అంటూ బమ్మెర పోతనామాత్యుడు ఆ పార్వతీ మాతను కీర్తించాడు. 


ప్రభువుకు పరహిత బుద్ధి ఉన్నప్పుడే అతని పాలనలో ప్రజలు సురక్షితంగా మనగలుగుతారు. ఈ విషయాన్నే శంకర భగవత్పాదులు కూడా తమ శివానందలహరిలో ‘‘నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాంపతే’’ అంటూ పరమేశ్వరుని శ్లాఘించాడు. ఈ లోకములనుభవించే దుఃఖమును చూచి బాధపడుటయన్నది మహాత్ములకు సహజ స్వభావము. లోకమునందలి సర్వప్రాణులను తానుగా భావించి సర్వలోకముల శ్రేయస్సును కోరునట్టి వారికి లోకములను ఆనంద పెట్టుటయే సహజ స్వభావము. ఆ స్వభావమే ప్రభువులను ప్రజా రక్షణకు పురికొల్పుతుంది. లోకోపకార బుద్ధి కలిగిన పాలకుడే నిజమైన ప్రభువు.


 గన్నమ రాజు గిరిజామనోహర బాబు

Updated Date - 2020-10-12T09:52:04+05:30 IST