ప్రజాక్షేమమే ప్రధానం

ABN , First Publish Date - 2020-10-02T07:03:24+05:30 IST

రాజకీయ నాయకులకి, అధికార స్థానాల్లో ఉన్న వారికి ఉపయోగపడే ఒక మంచి మాటను భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి చెప్పారు...

ప్రజాక్షేమమే ప్రధానం

రాజకీయ నాయకులకి, అధికార స్థానాల్లో ఉన్న వారికి ఉపయోగపడే ఒక మంచి మాటను భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణకవి చెప్పారు. 


ధరణి ధేనువు బిదుకంగ దలచితేని

జనుల బోషింపు మధిప వత్సముల మాడ్కి

జనులు పోషింపబడుచుండ జగతి కల్ప

లత తెరంగున సకల ఫలంబులొసగు


భూమి మొత్తాన్ని గోవులా భావించాలి. గోవు పాలు పితకాలంటే ముందుగా దూడను పాలు తాగనివ్వాలి. దూడ తాగగా మిగిలిన పాలు పితుక్కోవాలి. అలాగే ప్రజలను ముందుగా వాళ్ళ పంటలను అనుభవించనివ్వాలి. వాళ్ళను ఆస్వాదించనివ్వాలి. తరువాతే వసూలు చేసుకోవాలి. ప్రజలను మోసం చేసి సంపాదిద్దామని చూడకూడదు. ప్రజలు దూడల్లాంటివారు. ఈ భూమండలం ధేనువులాంటిది. ఆ భూమండలాన్ని పరిపాలించాలంటే దూడను ముందుగా పాలు తాగనిచ్చినట్టు, ప్రజలను వాళ్ళ సంపదలను వాళ్ళే అనుభవించనివ్వాలి. అప్పుడు భూమి కల్పలతలా అన్ని కోరికలు తీరుస్తుంది.

- డా. గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-10-02T07:03:24+05:30 IST