పిల్లల్లో 10 శాతం కోవిడ్.. పుదుచ్చేరిలో హై అలర్ట్

ABN , First Publish Date - 2021-07-17T21:20:07+05:30 IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా..

పిల్లల్లో 10 శాతం కోవిడ్.. పుదుచ్చేరిలో హై అలర్ట్

పుదుచ్చేరి: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా ఉండటంతో అక్కడి అధికార యంత్రాగం అప్రమత్తమైంది. రెండో ఫేజ్ నుంచి మూడో ఫేజ్‌కు వైరస్ ట్రాన్సిషన్ ఫేజ్ కావడం, పుదిచ్చేరిలో నమోదైన ఇన్‌ఫెక్షన్ కేసుల్లో 10 శాతం కేసులు పిల్లలు, శిశువుల్లో కనిపించడం ఈ ఆందోళనకు ప్రధాన కారణం. పిల్లల్లో 10 శాతం కేసులు కనిపించడంతో ఆసుపత్రుల్లో సౌకర్యాలను పెంచడంతో పాటు ఐసీయూ, ఆక్సిజన్ పడకలు మరిన్ని అందుబాటులోకి తెచ్చామని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ అరుణ్ తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడం, వ్యాక్సినేషన్ వేయించుకోవడం చేయాలని ఆయన సూచించారు.


పాజిటివ్ వచ్చిన పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఆసుపత్రుల్లో వసతులు పెంచామని, ప్రజలు సైతం కేసులు పెరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీసుకువెళ్లవద్దని, బంధువులు, బయట వ్యక్తులను ఇళ్లకు ఆహ్వానించ వద్దని సూచనలు చేశారు. ఇంతవరకూ 16 మంది పిల్లల్ని ఆసుపత్రుల్లో చేర్చారని, అయితే భయాందోళనలు చెందాల్సిన పనిలేదని ఆమె పేర్కొన్నారు. పాండిచ్చేరిలో శుక్రవారంనాడు కొత్తగా 104 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,509కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ కేసులు సెంట్రల్ సిటీ, మహె, కారైకాల్‌లో నమోదయ్యాయని హెల్త్ డెరెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు.

Updated Date - 2021-07-17T21:20:07+05:30 IST