పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు : ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి సీట్ల పంపకం ఖరారు

ABN , First Publish Date - 2021-03-09T20:58:56+05:30 IST

శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఎన్‌ఆర్ కాంగ్రెస్

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు : ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి సీట్ల పంపకం ఖరారు

పుదుచ్చేరి : శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి పక్షాల మధ్య అవగాహన కుదిరింది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈ కూటమి ప్రకటించలేదు. ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. 


30 స్థానాలున్న పుదుచ్చేరి శాసన సభకు ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. ఎన్నికల తర్వాత ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలను నియమిస్తారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఏఐఏడీఎంకే పొత్తు కుదుర్చుకున్నాయి. ఎన్‌డీఏ నేతలు మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీట్ల పంపకం ఖరారైన విషయాన్ని తెలిపారు. 


కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు, పుదుచ్చేరి రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి నిర్మల్ కుమార్ సురానా మాట్లాడుతూ, తమ కూటమికి ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి నాయకత్వం వహిస్తారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల నుంచి, బీజేపీ, ఏఐఏడీఎంకే కలిసి 14 స్థానాల నుంచి పోటీ చేస్తాయన్నారు. ఈ 14 స్థానాలలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో బీజేపీ, ఏఐఏడీఎంకే నిర్ణయించుకుంటాయని తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిని శాసన సభా పక్షాలు నిర్ణయిస్తాయని తెలిపారు. 


ఏఐఏడీఎంకే నేతల సమక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి, బీజేపీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడు వి. స్వామినాథన్ సీట్ల పంపకం ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎన్నికల అనంతరం నియమించవలసిన మూడు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులపైనా, రాజ్యసభ సభ్యత్వంపైనా చర్చ జరగలేదని సురానా చెప్పారు. 


రంగస్వామి మాట్లాడుతూ, తమ కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. తాము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం పుదుచ్చేరి అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతానని తెలిపారు. 


ఏఐఏడీఎంకే నేత ఏ అంబజగన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, పుదుచ్చేరి ప్రభుత్వం మధ్య సమన్వయం ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగలేదని, ఆ లోటును పూడ్చేందుకు ప్రస్తుతం అవకాశం వస్తుందని చెప్పారు. 


Updated Date - 2021-03-09T20:58:56+05:30 IST