Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఊహించని.. ఉధృతి

వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పులిచింతల డ్యాం గేటు 

తాత్కాలికంగా స్టాప్‌లాక్‌ గేటు  అమర్చేందుకు ప్రయత్నం

ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు 

దిగువకు భారీగా వస్తున్న వరద

కృష్ణా పరివాహక ప్రాంతంలో హైఅలర్ట్‌

ఏ క్షణానైనా తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం


గుంటూరు(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ కేఎల్‌రావు సాగర్‌ పులిచింతల డ్యాం 16వ నెంబరు గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. గురువారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకొంది. రాత్రి 2 గంటలకు ప్రాజెక్టులోని 13, 14 గేట్ల ద్వారా నీరు విడుదల అయింది. 3 గంటల సమయంలో 15, 16 గేట్లు నాలుగడుగుల పైకెత్తి నీటిని విడుదల చేస్తున్న క్రమంలో 16వ గేటు ఇనుప తాళ్లు, గడ్డర్లు నీటి ఉధృతికి తెగి గేటు మొత్తం నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో భారీగా వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. సాయంత్రం ఐదు గంటల సమయానికే ఇంచుమించుగా 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం గేటు కొట్టుకుపోయిన కారణంగా డ్యాంలో 30 టీఎంసీల వరకు నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉందని ఇరిగేషన్‌వర్గాలు చెబుతున్నాయి. పులిచింతల డ్యాంలో క్రెస్టు లెవల్‌ 36.34 మీటర్లుగా ఉంది. ఆ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడు డ్యాంలో 3.61 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటాయి. గ్రాస్‌ స్టోరేజ్‌ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా లైవ్‌ స్టోరేజ్‌ సామర్థ్యం 36.23 టీఎంసీలు. వీటన్నింటి పరిగణనలోకి తీసుకొంటే క్రస్ట్‌ స్థాయికి నీటిమట్టం తగ్గితేనే స్టాప్‌లాగ్‌ గేట్లను అమర్చవచ్చు. ఇందుకోసం డ్యాంని ఖాళీ చేయాల్సిందే.  శని, ఆదివారం నాటికి సాగర్‌ నుంచి అవుట్‌ఫ్లో పూర్తిగా తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా పులిచింతల నుంచి ఇప్పటికే డిశ్చార్జ్‌ని 5 లక్షల క్యూసెక్కులకు పెంచారు. అంతకు మించి డిశ్చార్జ్‌ పెంచొద్దని జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దిగువున పంటలు వేసి ఉన్నందున డిశ్చార్జ్‌ పెరిగితే అవి పూర్తిగా నీటమునిగి రైతులు నష్టపోవాల్సి వస్తోందని నివేదించారు.  


 కృష్ణా తీరంలో వరద భయం

కృష్ణా తీరాన్ని మళ్లీ వరద భయం వెన్నంటే వస్తోంది. పులిచింతల ప్రాజెక్టు గేటు దెబ్బతినటంతో ప్రమాదం పొంచిఉంది. గురువారం రాత్రి సమయానికి ప్రకాశం బ్యారేజి నుంచి 1.13 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదిలేస్తే, ఇది అర్ధరాత్రికి 4 లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని, శుక్రవారం ఉదయానికి 6 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం పెరిగే ప్రమాదం ఉందని కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, తెనాలి సబ్‌కలెక్టర్‌ నిధిమీనా హెచ్చరికలు జారీ చేశారు. తొలి ప్రమాద సూచిక ఈ అర్ధరాత్రికి విడుదల చేస్తామని, నదీ తీరంలోఉన్న లంక గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  కోరారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని మండలాల అధికారులతో కలెక్టర్‌ టెలికాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఎగువ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 2,01,099 క్యూసెక్కుల వరద నీరు వస్తుంటే, పులిచింతల నుంచి మాత్రం 5,05,870 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఇది శుక్రవారానికి మరింత పెరిగే పరిస్థితి ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. 


ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు, అధికారులు 

కొట్టుకుపోయిన గేటును రాష్ర్ట్రమంత్రులు అనిల్‌ కుమార్‌ యాదవద్‌, వెలంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, పేర్నినాని, కృష్ణా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తదితరులు పరిశీలించారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఇంజనీర్లతో సమావేశమై సమీక్షించారు. ప్రాజెక్టు నుంచి దిగువకు ఆరులక్షల క్యూసెక్కుల వరద వచ్చి నా ఎదుర్కొనేలా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. నిపుణుల కమిటీచే డ్యాంతో పాటు అన్ని గేట్లను కూడా పరిశీలిస్తామని తెలిపారు. 24 గేట్లను నిపుణుల కమిటీచే పరిశీలిస్తామని ఈఎన్‌సీ పి.నారాయణరెడ్డి అన్నారు.   


లంక గ్రామాల్లో అలజడి

ప్రకాశం బ్యారేజికి దిగువున తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె తీర ప్రాంత గ్రామాల్లో అలజడి నెలకొంది.  ఇప్పటికే పల్లపు ప్రాంతాల్లో వరద నీరు చేరిపోవటంతో, వస్తున్న నీరు వేగంగా ముంచేసే పరిస్థితి ఉందని, లోతట్టు నివాసాలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలనే ఆలోచనలో అధికార యంత్రాంగం ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది. వరద పెరిగితే కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని కరకట్ట లోపలివైపున్న గ్రామాను వరద నీరు చుట్టేసే పరిస్థితి ఉంది. నాలుగు లక్షల క్యూసెక్కులు దాటితే కొల్లూరు నుంచి నది మధ్యనున్న లంక గ్రామాలకు రవాణా నిలిచిపోతుంది. అటు భట్టిప్రోలు మండలం నుంచి కూడా లోపలి గ్రామాలకు రవాణా ఉండదు.  మరోపక్క లంకగ్రామాల్లో విలువైన అరటి, కంద, పసుపు, తమలపాకు, బొప్పాయి వంటి వాణిజ్య పంటలు సాగులో ఉన్నాయి. పసుపు నెలల వ్యవఽఽధిలో ఉండటంతో వరద నీటికి మునిగితే కుళ్లిపోయి పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  


16 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ 16 క్రస్ట్‌గేట్ల ద్వారా గురువారం నీటి విడుదల కొనసాగింది. శ్రీశైలం నుంచి సాగర్‌కు 2,71,410 క్యూసెక్కుల నీరు వచ్చింది. ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 33,901 క్యూసెక్కులు, కుడి జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 6182 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 4,416, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, మొత్తంగా 2,85,243 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ నీటిమట్టం 589.60 అడుగులుంది. ఇది 310.84 టీఎంసీలకు సమానం. శ్రీశైలం నీటిమట్టం 884.40 అడుగులు ఉంది. ఇది 212.43 టీఎంసీలకు సమానం. 


బ్యారేజి వద్ద పెరిగిన వరద ఉధృతి

ఎగువన వున్న పులిచింతల ప్రాజెక్టు గేట్ల వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో ఫ్లాఫ్‌ ఫ్లడ్‌ రూపంలో ప్రకాశం బ్యారేజి వద్ద మరోసారి వరద ఉధృతి పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి గురువారం సాయంత్రానికి 1,23,439క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు నీటిపారుదల శాఖ జేఈ దినేష్‌ తెలిపారు.  తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 9,689 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటి మట్టం నమోదవవుతుండగా 15 గేట్లను 3 అడుగులు, 55 గేట్లను 2 అడుగుల వంతున ఎత్తి 1,13,750 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  

Advertisement
Advertisement