Abn logo
Nov 24 2021 @ 21:05PM

రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన పుల్లెల గోపీచంద్

హైదరాబాద్ : బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తన ఆటోబయోగ్రఫీ ‘షట్లర్స్ ఫ్లిక్ : మేకింగ్ ఎవ్విరి మ్యాచ్ కౌంట్’లో అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించారు. చంద్రగుప్తునికి చాణక్యుడు ఇచ్చిన సలహాలు తనపై గొప్ప ప్రభావం చూపాయని తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రియ కుమార్‌తో కలిసి ఆయన రాశారు. 


ఇతరులను అభివృద్ధి చేయడమే సంతోషం, సంతృప్తి, ప్రశాంతతకు నిజమైన మార్గమని చంద్రగుప్తునికి చాణక్యుడు చెప్పేవాడని, ఈ మాటలే తన జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపాయని ఇండియన్ బ్యాడ్మింటన్ టీమ్ చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. తన ఆటోబయోగ్రఫీ కేవలం ఓ స్పోర్ట్స్ బుక్ కాదన్నారు. ఇది అన్ని రంగాల్లోని వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. 


అదృష్టం అనేది ఉండదు

బరిలోకి దిగిన తర్వాత ఇక అదృష్టం కోసం ప్రార్థించకూడదని చెప్పారు. మనం గెలవాలని కోరుకునేవారిని మన చుట్టూ ఉంచుకోవాలన్నారు. తమ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నించలేనివారు ఇతరులను ప్రోత్సహించలేరన్నారు. 


తన బిడ్డకు కేవలం ‘వన్ పేరెంట్’

తన కుటుంబం గురించి వివరిస్తూ, తన భార్య చాలా విచారంతో ఓ విషయం చెప్తూ ఉంటారని చెప్పారు. తమ పిల్లలకు కేవలం ‘వన్ పేరెంట్’ మాత్రమే ఉన్నారని అంటూ ఉంటారన్నారు. తనకు బిజీ షెడ్యూల్స్ ఉండటం వల్ల తాను తన పిల్లలతో గడపలేకపోతున్నానని వాపోయారు. బిజీ షెడ్యూల్స్ వల్ల తన ఆరోగ్యం ప్రభావితమవుతోందని ఆమె బాధపడుతున్నారన్నారు. 


నెగెటివ్ న్యూస్ వస్తుందనే భావం కలిగినపుడు తాను తన ఫోన్‌ను స్విచాఫ్ చేస్తానని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. అటువంటి రోజుల్లో ఇంటి వద్ద ఉంటే, నెగెటివ్ న్యూస్ గురించి తనకు చెప్పవద్దని తన భార్యను, పిల్లలను కోరుతానని చెప్పారు. ఇటువంటి నెగెటివ్ వార్తలు కొన్నాళ్ళకు పాతబడిపోతాయని, మరొక కొత్త వార్త వెలుగులోకి వస్తుందని అన్నారు. నెగెటివిటీకి ఏకైక జవాబు మీ కృషికి మెరుగైన పాజిటివ్ వెర్షన్ మాత్రమేనని చెప్పారు. 


సైనా నెహ్వాల్‌ గురించి...

సైనా నెహ్వాల్ 2014లో గోపీచంద్ అకాడమీని వదిలి బెంగళూరులో కోచింగ్ తీసుకోవడం ప్రారంభించింది. పీవీ సింధూకు ప్రాధాన్యమిస్తున్నట్లు అప్పట్లో ప్రచారమైన వదంతుల గురించి తన స్నేహితుడు శ్రీకాంత్ ప్రస్తావించినపుడు, ‘‘ఓ ప్లేయర్ మీ చేతుల్లో ఉన్న ఓ చిన్న పక్షివంటివాడు. మీరు మీ పట్టు బిగిస్తే, అది చనిపోతుంది, మీరు వదిలిపెడితే అది క్రమశిక్షణారహితంగా ఎగురుతుంది, పరిస్థితులకు బలి అవుతుంది. కానీ అది మీ చేతుల్లో ఉన్నపుడు మీ చేతులను పాడు చేస్తుంది’’ అని చెప్పారు. కాబట్టి దానిని కడుక్కోవడం మంచిదన్నారు. కేర్‌టేకర్ జాబ్‌ను కొనసాగించడం మంచిదన్నారు. మానసికంగా గాయపడటానికి సిద్ధపడి, ముందుకెళ్ళాలన్నారు. 


పీవీ సింధూ గురించి...

ఆసియన్ గేమ్స్ నుంచి 2010లో సైనా, సింధులతో కలిసి తిరిగి వస్తున్నపుడు సింధూ తండ్రిని గోపీచంద్ పిలిచారు. తాను సింధూకు వ్యక్తిగతంగా కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. అది కూడా రోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు కోచింగ్ ఇస్తానని చెప్పారు. రోజులో మిగిలిన సమయమంతా బిజీ షెడ్యూలు ఉండటంతో తన యోగా ప్రాక్టీస్ సమయాన్ని సింధూకు కోచింగ్ ఇవ్వడానికి కేటాయించారు. వరల్డ్ చాంపియన్ కాగలిగిన సత్తా సింధూకు ఉందనే గోపీచంద్ నమ్మకాన్ని ఆమె నిజం చేసింది. ‘‘మీరు గెలవాలనేదే నా కోరిక సోదరా’’ అని సింధూ తరచూ చెప్పేదని గుర్తు చేసుకున్నారు. 


రిటైర్మెంట్ 

గోపీచంద్ 2006లో చీఫ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఒలింపిక్స్ వరకు కొనసాగే అవకాశం ఉంది. వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ వరల్డ్ క్లాస్ కోచ్‌లుగా మారినపుడు తాను రిటైర్ అవుతానని చెప్పారు.