Abn logo
May 28 2020 @ 12:10PM

పుల్వామా తరహా దాడిని చిత్తు చేసిన ఇండియన్ ఆర్మీ

శ్రీనగర్: పుల్వామా తరహా దాడిని ఇండియన్ ఆర్మీ చిత్తు చేసింది. పుల్వామాలో పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలతో వెళ్తున్న కారును సైన్యం అడ్డగించింది. కారు ఆపకుండా పోనిచ్చిన డ్రైవర్ ఆ తర్వాత రాజ్‌పొరాలోని అయాన్‌గుండ్ ప్రాంతానికి కారును తీసుకుపోయాడు. కారును వెంబడించిన జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్ జవాన్లు కాల్పులు జరపడంతో డ్రైవర్‌తో సహా ఉగ్రవాదులు పారిపోయారు. ఉగ్రవాదులు జైష్ ఎ మహ్మద్‌, లేదా హిజ్బుల్‌కు చెందినవారు అయ్యుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు పదార్ధాలున్న కారును గుర్తించాక దాన్ని పేల్చి వేశారు. పేలుడు ధాటికి చుట్టు పక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిసింది. కారులో 45 కేజీల పేలుడు పదార్ధాలున్నాయి. 

జమ్మూకశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఉగ్రవాదులు కారుకు స్కూటర్ నెంబర్ ప్లేట్ తగిలించారు. నెంబర్ ప్లేట్‌పై నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్ జేకే08బీ1426 ఉంది. విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. 

జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల కుట్రను సమర్థంగా తిప్పికొట్టగలిగామని చెప్పారు.


ఉగ్రవాదులు అనుకున్న ప్రకారం భద్రతా బలగాలను సమీపించి పేలుడు జరిపి ఉంటే 2019లో పుల్వామాలో జరిగిన నష్టం కంటే ఎక్కువ నష్టం జరిగి ఉండేది. 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ను పేలుడు పదార్ధాలతో ఉన్న కారుతో ఢీ కొట్టించారు. ఈ ఘటనలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు చనిపోయారు. 

Advertisement
Advertisement
Advertisement