పంపు సెట్ల లెక్కింపు

ABN , First Publish Date - 2020-12-05T05:37:12+05:30 IST

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

పంపు సెట్ల లెక్కింపు

  1. మీటర్ల బిగింపునకు కసరత్తు
  2. రైతులు వ్యతిరేకిస్తున్నా.. అడుగులు
  3. ఆందోళనకు సిద్ధమంటున్న రైతు సంఘాలు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. రైతులు నుంచి క్షేత్రస్థాయిలో అధికారులు  సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కావాలంటే తాము చెప్పిన విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మీటర్ల ఏర్పాటు కసరత్తును ప్రారంభించిది. ఇప్పటికే కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్‌ డివిజన్లలోని రైతుల వద్ద నుంచి బోర్ల సమాచారాన్ని సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షా ఎనభై వేలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే అరవై వేలకు పైగా బోర్ల సమాచారాన్ని సేకరించారు. మిగిలిన వివరాలు డిసెంబరు చివరి లోపు సేకరించి, రైతులకు అకౌంట్లు తెరుస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే మీటర్లు ఏర్పాటు విధానాన్ని రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మీటర్ల ఏర్పాటు అంశం గత ప్రభుత్వాల హయాంలో తెరమీదకు వచ్చినా, రైతుల అభ్యంతరాల దృష్ట్యా ఉపసంహ రించుకున్నాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం అవేవీ పట్టించుకోవడం లేదు. భవిష్యత్తులో ఉచిత విద్యుత్‌ ఇవ్వకుండా రైతులను మోసం చేయడానికే మీటర్ల ఏర్పాటు అని, రైతు ప్రభుత్వమంటూ ప్రతి మీటింగుల్లో చేప్పే సీఎం జగన్మోహన్‌రెడ్డి అన్నదాత నడ్డి విరిచే చర్యలు చేపడుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. మీటర్ల ఏర్పాటు ప్రక్రియ ఆపకపోతే ఉద్యమిస్తామని జిల్లా రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.


పేరుకే రైతు ప్రభుత్వం

 వైసీపీ ప్రభుత్వం తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రతిసారి చెబుతుంటుంది. కానీ వ్యవసాయ మోటర్లకు మీటరు బిగించే విషయంలో మాత్రం రైతు అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. జిల్లాలో బోర్ల ఆధారంగా పంటలు పండిస్తున్న రైతులు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షా ఎనభై వేలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. ఉచిత విద్యుత్‌ పథకంతో వీరికి కొంత మేలు జరుగుతోంది. రైతులు ఎంత వ్యతిరేకిస్తున్నా బోర్లకు మీటర్లను బిగించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఉచిత విద్యుత్‌ హామీని ఎత్తివేయడానికే ప్రభుత్వం ఇలా చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మీటర్ల ఏర్పాటు చేసి,  సమయానికి తమ ఖాతాల్లో డబ్బులు జమచేయకపోతే ఇబ్బందుల్లో పడేది తామేనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు తాము కట్టాల్సిన బిల్లులను ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లిస్తోందని, ఇకముందు కూడా ఇదే విధానాన్నే కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. 


కసరత్తు ముమ్మరం

గ్రామస్థాయిలో వీఆర్డీ, వ్యవసాయ శాఖ, డిజిటల్‌ అసిస్టెంట్లు, లైన్‌మన్ల సహాయంతో రైతుల సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం, కేవైసీ తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. తప్పులుంటే సరిచేస్తున్నారు. ఈ నెల నుంచి శ్రీకాకుళం జిల్లాలో రైతులకు నగదు బదిలీని ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. ఈ నెల చివరి నాటికి జిల్లాలోని రైతుల వివరాల సేకరణ పూర్తి చేసి అకౌంట్లు తెరవడానికి  అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని 60 వేల బోర్ల సమాచారాన్ని సేకరించారు. వీటిలో ఎలాంటి తప్పులు లేని దరఖాస్తులు 18 వేలు ఉన్నాయి. 42 వేల దరఖాస్తుల్లో కొన్ని తప్పులున్నాయని, వాటిని సరిచేస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.


నగదు బదిలీ కోసమే..

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ప్రభుత్వం, ఆ మొత్తాన్ని డిస్కమ్‌లకు చెల్లించడం లేదు. చాలా రాష్ట్రాలు ఇలా చేస్తున్నాయి. దీంతో విద్యుత్‌ కంపె నీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ విధానాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం బోర్లకు మీటర్లు బిగించి, ప్రతినెలా వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన బకాయి మొత్తాన్ని రైతు బ్యాంకు ఖాతాలో జమచేయాలని సూచించింది. ఆ డబ్బును రైతు విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. దీని కోసం రైతు పేరిట బ్యాంకు ఖాతాను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది.


ఆందోళన చెందాల్సిన పనిలేదు

మీటర్ల ఏర్పాటులో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. అక్రమ కనెక్షన్లు, విద్యుత్‌ వినియోగం, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వంటి విషయాలు తెలుసుకోవ డానికి మీటరు ఏర్పాటు వ్యవస్థ పనిచేస్తుంది. మీటరుతో పాటు ఫ్యూజు కారియర్‌, కెపాసిటర్లను కూడా ప్రభుత్వం అందిస్తోంది. దీని వల్ల వోల్టేజీలో హెచ్చుతగ్గుల వల్ల మోటరు కాలిపోయే ప్రమాదం కూడా ఉండదు. విద్యుత్‌ వినియోగ బిల్లులకు అవసరమైన డబ్బులను రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది. - శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఈ, ఏపీఎస్పీడీసీఎల్‌, కర్నూలు.


రైతులకు ఇబ్బందులే

నాకు ఏడెకరాల భూమి ఉంది. బోరు కింద పత్తి, వేరుశనగ సాగు చేస్తాను. నా పొలంలోని బోరుకు మీటరు బిగిస్తామంటూ వివరాలను అధికారులు తీసుకుని వెళ్లారు. బోరు వాడినా, వాడకపోయినా ప్రతినెలా కొంత బిల్లు చెల్లిస్తూనే ఉన్నాం. ఇక మీటరు బిగిస్తే నెలకు ఎంత బిల్లు వస్తుందోనని భయం ఉంది. రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించిన ప్రభుత్వం.. ఇపుడేమో మీటర్లు బిగిస్తామంటోంది. అవి పూర్తయ్యాక రైతుల ఖాతాలో సరైన సమయంలో డబ్బులు పడక.. బిల్లు చెల్లించలేని పరిస్థితి వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎన్నికలు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట చెప్పడం సమంజసంగా లేదు.  - చిన్న అయ్యన్న, పాండవగల్‌ గ్రామం, ఆదోని మండలం 


ఉచిత విద్యుత్‌ను తీసివేసేందుకే..

భవిష్యత్తులో రైతులకు ఉచిత విద్యుత్‌ను తీసివేయ డానికే ఈ మీటరు విధానం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడానికి జగన్‌ ప్రభుత్వం సిద్ధపడింది. ఈ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇంతకు ముందే జడ్పీ కార్యాలయం ముందు నిరసనను తెలియజేశాం. మా అభిప్రాయాలను సీఎంకి తెలియజేయాలని ఏపీఎస్సీడీసీఎల్‌ ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డికి వినతి పత్రం కూడా సమర్పించాం. మా ఆందోళనలు పట్టించుకోకుండా మీటరు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే, ఉద్యమం చేయడానికి వెనుకాడం. - శేషఫణి, రైతు సంఘం నాయకుడు, కర్నూలు.


ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది

వ్యవసాయ బోర్లకు మీటర్లపై ప్రభుత్వం రైతులను మభ్యపెడు తోంది. మీటర్లు బిగించినా విద్యుత్‌ వినియోగ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి నగదు బదిలీ పథకాలను ఎన్నో చూస్తున్నాం. నగదు బదిలీ చేయడానికి మీ ఖాతాకు సంబంధించి అవి లేవు, ఇవీ లేవు అంటూ అధికారుల చుట్టూ తిప్పించుకుంటుంటారు. ఇదే పరిస్థితి విద్యుత్‌ నగదు బదిలీ విషయంలో జరగదని నమ్మకం ఏంటి? ఈ లోపు బిల్లు కట్టలేదని అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ తీసేస్తే పంట నష్టపోయే ప్రమాదముంది. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. - ఏసన్న, కల్లపరి, కర్నూలు


Updated Date - 2020-12-05T05:37:12+05:30 IST