Jul 30 2021 @ 06:05AM

గుమ్మడికాయ కొట్టేశారు!

ప్రభాస్‌ అభిమానులకు ‘రాధేశ్యామ్‌’ దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ తీపి కబురు అందించారు. కరోనా వల్ల పలుమార్లు నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణ గురువారంతో పూర్తయింది. ఈ విషయాన్ని రాధాకృష్ణకుమార్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. ‘‘రాధేశ్యామ్‌ చిత్రీకరణ పూర్తయింది. నా ప్రేమను డార్లింగ్‌ అభిమానులందరకీ పంచుతున్నాను. ముందు వేసుకున్న ప్రణాళికను కరోనా భారీగా దెబ్బతీసింది. మూడు రోజుల్లో స్పెషల్‌ అప్‌డేట్‌ వస్తుంది’’ అని ట్వీట్‌ చేశారు. 2018లో ప్రారంభమైన ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ కరోనాతో పలుమార్లు నిలిచిపోయింది. ఈ చిత్రంలో విక్రమాదిత్యగా ప్రభాస్‌, ప్రేరణగా పూజాహెగ్డే జంటగా కనిపించనున్నారు. భాగ్యశ్రీ, మురళీశర్మ, సచిన్‌ ఖేద్కర్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. హిందీ వెర్షన్‌కు మిథున్‌-మనన్‌ భరద్వాజ్‌, దక్షిణాది భాషలకు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. భూషణ్‌కుమార్‌, వి. వంశీ, ప్రమోద్‌, ప్రసీదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.