పుణేలో మళ్ళీ థియేటర్ల మూసివేత, రాత్రి వేళలో కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-04-02T20:22:46+05:30 IST

కోవిడ్-19 కేసులు మరింత పెరగకుండా నిరోధించేందుకు మాల్స్,

పుణేలో మళ్ళీ థియేటర్ల మూసివేత, రాత్రి వేళలో కర్ఫ్యూ

పుణే : కోవిడ్-19 కేసులు మరింత పెరగకుండా నిరోధించేందుకు మాల్స్, సినిమా థియేటర్లు, బార్, రెస్టారెంట్లను వారం రోజులపాటు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అయితే పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనాన్ని విధించరాదని నిర్ణయించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


పుణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావ్ శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, కోవిడ్-19 మహమ్మారి నిరోధం కోసం నూతన మార్గదర్శకాలను జారీ చేశారు. నగరంలోని అన్ని మాల్స్, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, హోటళ్లను రానున్న ఏడు రోజులపాటు మూసివేయాలని నిర్ణయించారు. అయితే హోం డెలివరీపై ఆంక్షలు విధించలేదు. పీఎంపీఎంఎల్ బస్సు సర్వీసులు, దేవాలయాలు, మతపరమైన ప్రార్థనా మందిరాలను కూడా రానున్న ఏడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. వారం వారం జరిగే సంతలను కూడా నిర్వహించడానికి అనుమతించరాదని నిర్ణయించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని ప్రజలను కోరారు. 


వివాహాలు (గరిష్ఠంగా 50 మందితో మాత్రమే), అంత్యక్రియలు (గరిష్ఠంగా 20 మందితో మాత్రమే) నిర్వహించడానికి అనుమతిస్తారు. ఇతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వబోరు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఆ మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. వైద్యపరమైన అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటికి రావడానికి అనుమతిస్తారు. పగటిపూట ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఒక చోట ఉండటానికి అనుమతించబోరు. ఈ ఆదేశాలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. వచ్చే శుక్రవారం పరిస్థితిని అధికారులు సమీక్షిస్తారు.


ఇదిలావుండగా, ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, పుణే నగరంలో గురువారం కొత్తగా 8,011 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం నమోదైన కేసుల సంఖ్య 8,605. దీంతో నగర మేయర్ మురళీధర్ మొహోల్ గురువారం స్పందిస్తూ, 80 శాతం పడకలను కోవిడ్ రోగుల కోసం అందుబాటులో ఉంచాలని ప్రైవేటు ఆసుపత్రులను కోరారు. 


Updated Date - 2021-04-02T20:22:46+05:30 IST