పుంగనూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ABN , First Publish Date - 2020-04-05T17:27:02+05:30 IST

పుంగనూరు మాజీ ఎమ్మెల్యే..

పుంగనూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

పుంగనూరు(చిత్తూరు): పుంగనూరు మాజీ ఎమ్మెల్యే రాణిసుందరమ్మణ్ణి బెంగళూరులో శనివారం మృతి చెందారు. పుంగనూరు సంస్థాన జమీందారి రాజా బసవరాజచిక్కరాయులు భార్య అయిన రాణిసుందరమ్మణి(95) రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశారు. ఆమె భర్త స్వర్గీయ వీరబసవ చిక్కరాయులు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. 1970లో పుంగనూరు ఎమ్మెల్యే వారణాసి రామస్వామిరెడ్డి జడ్పీ చైర్మన్‌గా ఎన్నిక కావడంతో జరిగిన ఉప ఎన్నికల్లో రాణిసుందరమ్మణ్ణి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన జమీందారిణి 1978లో రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందగా కేవీ.పతి ఎమ్మెల్యేగా గెలిచారు.


బెంగళూరులో స్థిరపడటంతో ఆమె అక్కడే ఉంటూ గంగజాతర సమయాల్లో కుటుంబీకులతో కలసి స్థానిక ప్యాలెస్‌కు వచ్చి వెళ్లెవారు. రాణిసుందరమ్మణ్ణి పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం 6గంటలకు పుంగనూరు జమీందారి ప్యాలె్‌సకు తీసుకువచ్చి ప్రజల సందర్శన కోసం ఉంచి 10గంటలకు తూర్పుమొగసాల జమీందారి శ్మశానంలో దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాణిసుందరమ్మణి మృతి పట్ల రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌. అనీషారెడ్డి, సమన్వయకర్త ఎన్‌.శ్రీనాథరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-04-05T17:27:02+05:30 IST