తనను అడ్డుకున్న ఆందోళనకారులతో కారు దిగి మాట్లాడిన పంజాబ్ సీఎం

ABN , First Publish Date - 2022-01-07T01:18:04+05:30 IST

బుధవారం నాటి ఘటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎలాటి ప్రాణాపాయం జరిగి ఉండేది కాదని పంజాబ్

తనను అడ్డుకున్న ఆందోళనకారులతో కారు దిగి మాట్లాడిన పంజాబ్ సీఎం

చండీగఢ్: బుధవారం నాటి ఘటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎలాటి ప్రాణాపాయం జరిగి ఉండేది కాదని  పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు. ఓ జాతీయ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఫిరోజ్‌పూర్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యంపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యంలోని కమిటీతో విచారణ జరిపించనున్నట్టు చెప్పారు. మూడు రోజుల్లోనే ఈ నివేదిక తనకు అందుతుందన్నారు.  


ముఖ్యమంత్రి నేడు (గురువారం) తన కాన్వాయ్‌తో వెళ్తుండగా కొందరు ఆందోళనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన కారును ఆపారు. ‘‘పదిమంది ఆందోళనకారులు నా కారును ఆడ్డుకునేందుకు వచ్చారు. పోలీసులు వెంటనే కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. ఆయన (ప్రధాని మోదీ) కారు ఆందోళనకారులకు కిలోమీటరు దూరంలో ఉంది’’ అని పేర్కొన్నారు. నిరసనకారులు తనను అడ్డుకోవడంపై మాట్లాడుతూ.. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కని, వారు కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులై ఉంటారని అన్నారు. త్వరలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈసీ ఆంక్షలు అమల్లోకి రాకముందే తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని వారు భావిస్తున్నారని, అందుకే వారు ఈ మార్గంలో ఈ రోజు నిరసన తెలిపి ఉంటారని పేర్కొన్నారు.


కారు దిగిన ముఖ్యమంత్రి ఆందోళనకారుల వద్దకు వెళ్లారు. వారు సీఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయినప్పటికీ వారి వద్దకెళ్లిన ముఖ్యమంత్రి మీ డిమాండ్లేమిటని ప్రశ్నించారు. నిరసనకారుల్లో ఒకరు మాట్లాడుతూ.. ‘‘చండీగఢ్‌లో రేపు మీతో సమావేశం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. దీనికి సీఎం బదులిస్తూ.. డిమాండ్లు వినేందుకు సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే చెప్పినప్పటికీ మళ్లీ ఎందుకు తన కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఈలోపు ఓ నిరసనకారుడు కల్పించుకుని రెండు నెలలుగా తమ డిమాండ్లు అలాగే ఉండిపోయాయని పేర్కొన్నాడు. సీఎం మాట్లాడుతూ రేపు (శుక్రవారం) చండీగఢ్‌లో తన అధికారిక నివాసంలో కలిసినప్పుడు డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. 


కాగా, నిన్న ప్రధాని ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లి ఉండేది కాదని సీఎం చన్నీ మరోమారు స్పష్టం చేశారు. మోదీ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని మీ (ఆయన మాట్లాడిన మీడియా) ద్వారా చెప్పాలనుకుంటున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రధాని దీర్ఘాయుష్కుడిగా ఉండాలని తాను ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2022-01-07T01:18:04+05:30 IST