టైలర్‌ను ‘ఉల్లూ కా పట్టా’ అంటూ తిట్టిన ఎమ్మెల్యే...ఆడియో వైరల్

ABN , First Publish Date - 2021-02-19T14:45:38+05:30 IST

సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే టైలరును ఫోన్‌లో దూషించిన ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.....

టైలర్‌ను ‘ఉల్లూ కా పట్టా’ అంటూ తిట్టిన ఎమ్మెల్యే...ఆడియో వైరల్

చండీఘడ్ (పంజాబ్): సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే టైలరును ఫోన్‌లో దూషించిన ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ రాష్ట్రంలోని గిద్దర్ బాహా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అమృందర్ సింగ్ రాజా తన దర్జీని ‘ఉల్లూ కా పట్టా’ అంటూ దూషించిన ఆడియో క్లిప్ తాజాగా వెలుగుచూసింది. బట్టలు కుట్టడానికి ముందుగానే ముక్త్సర్ పట్టణ టైలర్ మన్ ప్రీత్ డబ్బుఅడిగాడు. దీంతో టైలరును ‘నువ్వు నన్ను అవమానపరుస్తున్నావు’ అంటూ ఎమ్మెల్యే అమృందర్ సింగ్ ఫోన్ లో ఉల్లూ కా పట్టా అంటూ దూషించారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఆడియో క్లిప్ ఎలా వైరల్ అయిందో తనకు తెలియదని టైలర్ మన్ ప్రీత్ చెప్పారు. బట్టలు కుట్టేందుకు గాను డబ్బు ఇవ్వాలని మర్యాదగా తాను అడిగినందుకు ఎమ్మెల్యే అమృందర్ సింగ్ రాజా తిట్టారని,ఎమ్మెల్యే ఇలా తిడతారని తాను ఊహించలేదని, ఈ ఘటన విచారకరమని మన్ ప్రీత్ మీడియాకు చెప్పారు. 


ఎమ్మెల్యే డబ్బులు చెల్లించారని, సమస్య పరిష్కారమైందని, కాని తమ మధ్య సంభాషణ ఎలా లీక్ అయిందో తెలియదని టైలర్ మన్ ప్రీత్ చెప్పారు. తాను కొలతలను గుర్తు చేసుకునేందుకు వీలుగా కస్టమర్ల ఫోన్ కాల్స్‌ను రికార్డు చేస్తుంటానని దర్జీ చెప్పారు. తాను ఎమ్మెల్యేకు ఆరుజతల బట్టలు కుట్టానని, నా మునుపటి బకాయిలు చెల్లించేవరకు ఈ సారి బట్టలు కుట్టనని ఎమ్మెల్యే సహాయకుడి ద్వారా చెప్పానని టైలరు వివరించారు. ఎమ్మెల్యే 4 ఏళ్లుగా తనకు డబ్బు చెల్లించలేదని చెప్పారు.తాను శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా వంటి ప్రముఖ రాజకీయ నాయకులకు బట్టలు కుట్టానని దర్జీ చెప్పారు. కాగా తాను టైలరుకు డబ్బు చెల్లించానని, తనను కించపర్చడానికి రాజకీయ ప్రత్యర్థి సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆడియో క్లిప్ ను వైరల్ చేశారని ఎమ్మెల్యే అమృందర్ సింగ్ వివరణ ఇచ్చారు.తాను ఎవరికీ డబ్బు బకాయి లేదని, తన ఇమేజ్ దెబ్బ తీసేందకు ప్రత్యర్థులు యత్నిస్తున్నారని అమృందర్ సింగ్ ఆరోపించారు.

Updated Date - 2021-02-19T14:45:38+05:30 IST