ఐఎస్ఐతో కెప్టెన్ అమరీందర్ బంధంపై దర్యాప్తు : పంజాబ్ మంత్రి

ABN , First Publish Date - 2021-10-22T22:50:41+05:30 IST

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు

ఐఎస్ఐతో కెప్టెన్ అమరీందర్ బంధంపై దర్యాప్తు : పంజాబ్ మంత్రి

చండీగఢ్ : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరుపుతామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ రణ్‌ధవా శుక్రవారం చెప్పారు. పాకిస్థాన్ డిఫెన్స్ జర్నలిస్ట్ అరూసా ఆలం ద్వారా ఐఎస్ఐతో కెప్టెన్ సింగ్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై దర్యాప్తు జరుగుతుందన్నారు. 


సుఖ్‌జిందర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఐఎస్ఐ నుంచి ముప్పు ఉందని కెప్టెన్ అమరీందర్ సింగ్ ఇప్పుడు చెప్తున్నారన్నారు. దీంతో ఆ మహిళ (అరూసా ఆలం)కు ఉన్న సంబంధంపై దర్యాప్తు జరుపుతామన్నారు. కెప్టెన్ సింగ్ నాలుగైదేళ్ళ నుంచి పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్ల గురించి మాట్లాడుతున్నారన్నారు. ఈ విషయాన్ని మొదట లేవనెత్తినది కెప్టెన్ సింగ్ అని, ఆ తర్వాత పంజాబ్‌లో బీఎస్ఎఫ్ దళాల మోహరింపు జరిగిందని అన్నారు. అరూసా ఆలంకు ఐఎస్ఐతో సంబంధాల గురించి ప్రస్తావిస్తూ, ఈ అంశంపై దర్యాప్తు జరపాలని డీజీపీని కోరుతామన్నారు. 


ఈ ఏడాది సెప్టెంబరులో పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ వల్ల  దేశ భద్రతకు ముప్పు ఉందని చెప్పారు. పాకిస్థాన్, ఐఎస్ఐలతో సిద్ధూకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. పంజాబ్ శాసన సభ ఎన్నికలకు ముందు తాను స్వయంగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని కెప్టెన్ సింగ్ ప్రకటించారు. 


కెప్టెన్ అమరీందర్ సింగ్ 2004లో పాకిస్థాన్ వెళ్ళినపుడు డిఫెన్స్ జర్నలిస్ట్ అరూసా ఆలం కలిశారు. పంజాబ్ రాజకీయాల్లో ఆమె పేరు రావడం ఇదే తొలిసారి కాదు. 2007లో ఆమె చండీగఢ్ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ తాను కెప్టెన్ అమరీందర్ సింగ్ స్నేహితురాలినని, తాము ప్రేమలో పడలేదని చెప్పారు. 


Updated Date - 2021-10-22T22:50:41+05:30 IST