మా బిల్లులు రాష్ట్రపతికి పంపండి..కేంద్రానికి పంజాబ్ లేఖ

ABN , First Publish Date - 2021-12-21T18:57:05+05:30 IST

పవిత్ర గ్రంథాలు, ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేసే వారికి కఠినంగా శిక్షించాలని కోరుతూ ..

మా బిల్లులు రాష్ట్రపతికి పంపండి..కేంద్రానికి పంజాబ్ లేఖ

న్యూఢిల్లీ: పవిత్ర గ్రంథాలు, ప్రార్థనా స్థలాలను అపవిత్రం చేసే వారికి కఠినంగా శిక్షించాలని కోరుతూ పంజాబ్ అసెంబ్లీలో 2018లో ఆమోదించిన రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలని కేంద్రాన్ని పంజాబ్ సర్కార్ కోరింది. ఇటీవల పంజాబ్‌లో అపవిత్ర చర్యలకు పాల్పడిన ఇద్దరిని మూకదాడుల్లో కొట్టి చంపిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కార్ కేంద్రానికి తాజా విజ్ఞప్తి చేసింది. పవిత్ర గ్రంథాలను (గురుగ్రంథ్ సాహిబ్, భగవద్గీత, ఖురాన్, బైబిల్) అపవిత్రం చేసే వారికి జీవిత ఖైదు విధించేందుకు ఉద్దేశించిన క్రిమినల్ ప్రొజీజర్ కోడ్ (పంజాబ్ అమెండమెంట్) బిల్లు-2018, ఐపీసీ (పంజాబ్ అమెండ్‌మెంట్) బ్లిలు-2018 గవర్నర్ ఆమోదం పొందాయని, రాష్ట్రపతి ఆమోదానికి వేచి ఉన్నాయని ఆ లేఖలో కేంద్రానికి పంజాబ్ సర్కార్ తెలియజేసింది. కేంద్రం హోం మంత్రి అమిత్‌షాకు పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంఢ్వా ఈ మేరకు లేఖ రాశారు.


పంజాబ్ సరిహద్దు రాష్ట్రమైనందున మత సామరస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, 'అపవిత్ర' చర్యలకు పాల్పడటం ద్వారా మత సామరస్యానికి విఘాతం కలిగించే వారికి కఠిన శిక్షలు తప్పనిసరి అని సుఖ్జీందర్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ దృష్ట్యా అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించిన రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలని, సాధ్యమైనంత త్వరగా ఆ విషయాన్ని పంజాబ్ సర్కార్‌కు తెలియజేయాలని పేర్కొన్నారు. పంజాబ్‌లో పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేయడం ప్రధాన అంశంగా మారిందని, ప్రస్తుతం అమలులో ఉన్న ఐపీసీ-1960లోని సెక్షన్ 295, 295-ఏ కేవలం మూడేళ్లకే శిక్ష పరిమితం చేస్తోందని, ఆ శిక్ష సరిపోదని రాంఢ్వా ఆ లేఖలో హోం శాఖ దృష్టికి తెచ్చారు. ఇవి జీవిత ఖైదుకు అర్హమైన శిక్షలుగా పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తక్షణం రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని ఆయన కోరారు.

Updated Date - 2021-12-21T18:57:05+05:30 IST