పంజాబ్‌లో భారీగా తగ్గిన పెట్రోలు ధర

ABN , First Publish Date - 2021-11-14T23:16:34+05:30 IST

విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించడంతో పంజాబ్‌లో

పంజాబ్‌లో భారీగా తగ్గిన పెట్రోలు ధర

న్యూఢిల్లీ : విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించడంతో పంజాబ్‌లో పెట్రోలు ధర, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో డీజిల్ ధర భారీగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీని పెట్రోలుపై లీటరుకు రూ.5 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున తగ్గించిన తర్వాత కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాయి. 


 ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫ్యూయల్ రిటెయిలర్లు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఎక్సయిజ్ డ్యూటీ, వ్యాట్ తగ్గింపు వల్ల పెట్రోలు ధర లీటరుకు రూ.16.02 వరకు తగ్గిందని, డీజిల్ ధర లీటరుకు రూ.19.61 వరకు తగ్గిందని తెలుస్తోంది. పంజాబ్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ.16.02 తగ్గింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చితే, పెట్రోలు ధరల తగ్గుదల ఈ రాష్ట్రంలోనే అత్యధికం. ఈ ధర లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో రూ.13.43 తగ్గగా; కర్ణాటకలో రూ.13.35 తగ్గింది. 


దేశం మొత్తం మీద డీజిల్ ధర భారీగా తగ్గించినది లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతమే. ఇక్కడ డీజిల్ ధర లీటరుకు రూ.9.52 చొప్పున తగ్గింది. ధరల తగ్గుదల ప్రయోజనాన్ని ప్రజలకు అందజేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏమిటంటే, లడఖ్, కర్ణాటక, పుదుచ్చేరీ, జమ్మూ-కశ్మీరు, సిక్కిం, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, డమన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ, చండీగఢ్, అస్సాం, మధ్య ప్రదేశ్, త్రిపుర, గుజరాత్, నాగాలాండ్, పంజాబ్, గోవా, మేఘాలయ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అండమాన్ అండ్ నికోబార్, బిహార్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా. 


ప్రజలకు ఉపశమనం కల్పించని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏమిటంటే, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్. 


Updated Date - 2021-11-14T23:16:34+05:30 IST