ఇందిర సంస్మరణ ప్రకటన ఏదీ? : సునీల్ జక్కర్

ABN , First Publish Date - 2021-10-31T22:51:55+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా

ఇందిర సంస్మరణ ప్రకటన ఏదీ? : సునీల్ జక్కర్

చండీగఢ్ : మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకునేందుకు పత్రికా ప్రకటన ఇవ్వడంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీనియర్ కాంగ్రెస్ నేత సునీల్ జక్కర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. గత ఏడాది ఇచ్చిన ప్రకటనను ఆయన ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో జత చేశారు. 


భారత దేశ ఉక్కు మహిళ ఇందిరా గాంధీని చరిత్ర నుంచి తుడిచేయాలని బీజేపీ ప్రయత్నించడాన్ని తాను అర్థం చేసుకోగలనని, అయితే పంజాబ్‌లో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా? అని సునీల్ ప్రశ్నించారు. ఢిల్లీ కాంగ్రెస్ నూతన కార్యనిర్వాహక కమిటీకి శాశ్వత ఆహ్వానితునిగా జగదీష్ టైట్లర్‌ నియమితులయ్యారని, ఇందిరా గాంధీ సంస్మరణ ప్రకటన జారీ చేయకపోవడం వెనుక  టైట్లర్ ప్రభావం ఏమైనా ఉందేమోననే అనుమానం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన (టైట్లర్) నియామకం నేపథ్యంలో  అతి జాగ్రత్త తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు.


1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. అనంతరం ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో జగదీష్ టైట్లర్ ప్రధాన నిందితుడు.  టైట్లర్‌ను ఢిల్లీ కాంగ్రెస్ నూతన కార్యనిర్వాహక కమిటీకి శాశ్వత ఆహ్వానితునిగా నియమించడంపై బీజేపీ, ఎస్ఏడీ మండిపడుతున్నాయి. 


Updated Date - 2021-10-31T22:51:55+05:30 IST