Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌ను ఆదుకోవాలంటూ.. ఎన్నారైల ర్యాలీ!

లండన్, ఒట్టావా: కరోనాతో అతలాకుతలం అవుతున్న భారత్‌ను ఆదుకోవాలంటూ కెనడా, యూకేలోని పంజాబీ ఎన్నారైలు ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇండియాకు బ్రిటన్, కెనడా దేశాల సాయం ఎంతో అవసరమని, ఆపన్న హస్తం అందివ్వాలంటూ ఆయా దేశాల్లోని పంజాబీ ఎన్నారై ఎంపీలు, ఎంఎల్ఏలు డిమాండ్ చేశారు. "ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి దయనీయంగా ఉంది. కరోనా వల్ల ప్రతిరోజు వేలాది మంది మరణిస్తుండగా, 3లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ అత్యవసర పరిస్థితిలో బ్రిటన్‌లోని ఎన్నారైలు సాధ్యమైనంత వరకు చేయూతను ఇవ్వడం ఎంతో ముఖ్యం." అని యూకే ఎంపీ తన్మజీత్ సింగ్ ధేసి ట్వీట్ చేశారు. అలాగే మరో ఎంపీ ప్రీత్ కౌర్ గిల్.."ప్రస్తుత విపత్కర పరిస్థితుల దృష్ట్యా భారత్‌కు మనం మనకు తోచినంత తప్పకుండా సహాయం చేయాలి. ప్రస్తుతం రోజువారీ అత్యధిక కేసులతో సతమతమవుతున్న మాతృ దేశానికి మన తోడ్పాటు ఎంతో అవసరం. టీకాలతో పాటు ఇతర విషయాలలో కూడా చొరవ చూపాలి. దేశంలో వీలైనంత త్వరగా మహమ్మారి అదుపులోకి వచ్చేలా సూచనలు చేయడంతో పాటు కొత్త వేరియంట్ల విస్తరణకు అడ్డుకట్టవేయడం సైతం ఎంతో ముఖ్యం." అని ట్వీట్ చేశారు.


బ్రిటిష్ కొలంబియా పార్లమెంట్ సెక్రెటరీ, ఎన్‌డీపీ ఎంఎల్‌ఏ రచన సింగ్ మాట్లాడుతూ .. "భారత్‌లోని కొవిడ్-19 సంక్షోభ పరిస్థితి హృదయాన్ని కలిచివేస్తోంది. ఇండియాలోని ప్రస్తుత పరిస్థితులను తలచుకుంటే భయమేస్తోంది. ఈ భయానక పరిస్థితుల నుంచి సాధ్యమైనంత త్వరగా దేశం బయటపడాలి." అని అన్నారు. అటు అగ్రరాజ్యం అమెరికా భారత్‌కు ఆపన్న హస్తం అందివ్వడం పట్ల ఈ సందర్భంగా ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, భారత్‌కు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తయారీ కోసం ముడిసరుకును, ఆక్సిజన్‌, పీపీఈ, ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను అందజేస్తామని వైట్‌హౌస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌కు అవసరమైన సాయాన్ని త్వరితగతిన అందిస్తామని అమెరికా  ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు.  

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement