పురానాపుల్‌ పిల్లర్లకు బీటలు

ABN , First Publish Date - 2020-10-20T08:09:30+05:30 IST

భారీ వర్షాల తాకిడికి పాతనగరంలోని పురానాపుల్‌ వంతెన ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జి మూడు పిల్లర్లకు బీటలు ఏర్పడి పెచ్చులు ఊడిపోవడంతో ..

పురానాపుల్‌ పిల్లర్లకు బీటలు

  • కార్లు, భారీ వాహనాల రాకపోకల నిలిపివేత
  • ద్విచక్రవాహనాలు, ఆటోలకే అనుమతి
  • బ్రిడ్జి పిల్లర్లను పరిశీలించిన అధికారులు
  • వర్షాలు తగ్గాక మరమ్మతులు: డీఈ రఫీ

అఫ్జల్‌గంజ్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల తాకిడికి పాతనగరంలోని పురానాపుల్‌ వంతెన ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జి మూడు పిల్లర్లకు బీటలు ఏర్పడి పెచ్చులు ఊడిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం మధ్యాహ్నం వరకు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. బ్రిడ్జికిబీటలు వచ్చాయని సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే.. దెబ్బతిన్న బ్రిడ్జి నిజాం కాలంలో కట్టింది కాదు. దానికి అనుసంధానంగా 25 ఏళ్ల క్రితం నిర్మించిన 23 మీటర్ల వంతెన. నిజాం కాలంలో రాతితో కట్టిన పురానాపుల్‌ వంతెనను ప్రస్తుతం కూరగాయల విక్రయానికి వినియోగిస్తున్నారు.


భారీ వరద ప్రవాహంతో..

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్‌ నిండుకుండలా మారడంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. నాలుగు రోజులుగా ఆ నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. రోజూ వరద నీరు మూసి నది గుండా ఉదృతంగా ప్రవహిస్తుండడంతో పాటు వరదలో కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు కొట్టుకువచ్చి బ్రిడ్జి పిల్లర్లకు తాకడంతో పిల్లర్లకు బీటలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ప్రతి బ్రిడ్జినీ25 ఏళ్లకు ఒకసారి పరిశీలించి మరమ్మత్తులు చేయాల్సి ఉంటుందని.. దాన్ని అధికారులు విస్మరించడంతో ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు.


అధికారుల పరిశీలన..

పురానాపుల్‌ బ్రిడ్జి పిల్లర్లు బీటలు వారాయని తెలియడంతో జీహెచ్‌ఎంసీ మెయింటెనెన్స్‌ చీఫ్‌ ఇంజనీరింగ్‌ జియావుద్దీన్‌ ఈఎన్‌సీ అధికారి శ్రీధర్‌, డీఈ మహ్మద్‌ రఫీ, ఈఈ మహ్మదుద్దీన్‌, ఎస్‌ఈ నర్సింగ్‌రావు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బ్రిడ్జి మీదుగా భారీ వాహనాలను అనుమతించవ్దని ట్రాఫిక్‌ పోలీసులను ఆదేశించారు. దీంతో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ బ్రిడ్జిని పూర్తిగా మూసివేశారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లను అనుమతించారు. భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. బ్రిడ్జికి మరమ్మతులు చేసే వరకూ రెండు ప్రవేశద్వారాల వద్ద గాడర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి బారికేడ్లతో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతానికి అంతగా ప్రమాదమేమీ లేదని.. వర్షాలు పూర్తిగా తగ్గాకే బ్రిడ్జికి మరమ్మతులు నిర్వహిస్తామని డీఈ మహ్మద్‌ రఫీ చెప్పారు.

Updated Date - 2020-10-20T08:09:30+05:30 IST