కొనుగోళ్లు షురూ

ABN , First Publish Date - 2020-09-13T09:32:35+05:30 IST

నియంత్రిత సాగు విధానంతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది.

కొనుగోళ్లు షురూ

నియంత్రిత సాగుతో పంట విస్తీర్ణం పెరగడమే కాదు.. వరి సేద్యం దాదాపు యాభై శాతం ఎక్కువయింది.. అంటే.. లక్షా 60వేల ఎకరాల్లో వరిని పండించగా, లక్షా 20వేల ఎకరాల్లో సన్నరకాలను పండించారు రైతులు.. ఈ ధాన్యాన్ని 205 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు.. అవసరమైతే మరిన్ని అదనంగా ఏర్పాటు చేస్తామంటున్నారు. 


మెదక్‌, సెప్టెంబరు 12 : నియంత్రిత సాగు విధానంతో జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. గత సీజన్‌తో పోలిస్తే యాభై శాతం అధికంగా.. అంటే లక్షా 60 వేల ఎకరాల్లో వరి సాగవుతున్నది. దీంతో దిగుబడి కూడా భారీగా పెరిగే అవకాశముంది. మరో నెల రోజుల్లో ధాన్యం చేతికి రావడమే కాకుండా విక్రయాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతుల నుంచి 3.34 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ శాఖతో పాటు మార్కెటింగ్‌, పౌర సరఫరా, రవాణా, డీఆర్డీఏ, ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీ విభాగాల అధికారులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా 205 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. 


సన్న ధాన్యానికి నిర్ణయం కాని ధర

రైతులు దళారుల బారినపడి మోసపోకూడదని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తోంది. ఈసారి ఏ-గ్రేడ్‌ రకానికి మద్దతు ధర రూ.1,868గా నిర్ణయించింది. గతేడాది ఏ-గ్రేడ్‌ రకానికి రూ.1,835 ఉండేది. ఈసారి మరరో రూ.33 పెంచింది. అయితే నియంత్రిత సాగు విధానంలో జిల్లాలో వ్యవసాయాధికారులు సన్నరకం వరి ధాన్యం సాగు చేసేలా రైతులను ప్రోత్సహించారు. ఫలితంగా ఎన్నడూ లేని విధంగా లక్షా 20 వేల ఎకరాల విస్తీర్ణంలో సన్నరకం వరి సాగు చేశారు. ప్రభుత్వం ఏ-గ్రేడ్‌ రకానికి మద్దతు ధర నిర్ణయించినా ఇప్పటివరకు సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించలేదు. దీంతో అన్నదాతల్లో ఒకింత సందిగ్ధం నెలకొన్నది. 


కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

కరోనా నేపథ్యంలో రైతుల నుంచి అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. జిల్లాలో అన్ని పట్టణాలు, గ్రామాల్లోనూ కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ధాన్యం కొనుగోలులో రద్దీని నివారించేందుకు 205 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం యోచిస్తున్నది. ఐకేపీ ఆధ్వర్యంలో 85, సహకార సంఘాల ఆధ్వర్యంలో 120 కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్ణయించింది. పరిస్థితులను బట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరింత పెంచేందుకు కూడా వెనుకాడబోమని అధికారులు తెలిపారు. వరి కోతలు ప్రారంభమైన వెంటనే రైతుల నుంచి వెంటవెంటనే కొనుగోలు చేసేందుకు ముందస్తు ప్రణాళికలు చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. జిల్లాలో ఉన్న రైస్‌ మిల్లులకు అనుసంధానంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 


83 లక్షల గోనెసంచులు అవసరం

ధాన్యం సేకరణ లక్ష్యం మేరకు 3.34 లక్షల మెట్రిక్‌ టన్నులకు గాను 83 లక్షల గోనెసంచులు అవసరమవుతాయి. గత సీజన్‌లో రైస్‌మిల్లులకు ఇచ్చిన 25 లక్షల గోనె సంచులను సేకరిస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఇవేగాక గోదాముల్లో మరో 15 లక్షల వరకు గోనె సంచులు ఉంటాయి. మిగతా 43 లక్షల గోనె సంచులను కొనుగోలు చేయనున్నారు. రైస్‌మిల్లర్లు ఎవరైనా గోనెసంచులను తిరిగి ఇవ్వలేకపోతే ఒక్కో సంచికి రూ.37 చొప్పున వసూలు చేస్తామని తెలిపారు. ఇక రైతులు తెచ్చిన ధాన్యం వర్షానికి తడవకుండా కేంద్రానికి 20 చొప్పున టార్పాలిన్లు అందుబాటులో ఉంచనున్నారు. ధాన్యం తూకం వేయడానికి యంత్రాలు, ధాన్యం శుద్ధి యంత్రాలు, తేమను కొలవడానికి మాయిశ్చర్‌ మిషన్లను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. 


30తో ముగియనున్న రవాణా కాంట్రాక్టు గడువు

కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని తరలించడానికి రవాణా కాంట్రాక్టర్లు వాహనాలను ఏర్పాటు చేస్తారు. అయితే వారి కాంట్రాక్టు గడువు 30తో ముగియనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. వానాకాలం సీజన్‌లో సేకరించనున్న ధాన్యాన్ని రవాణా చేయడానికి కొత్త కాంట్రాక్టర్లను నియమించుకునేందుకు ఆన్‌లైన్‌ పద్ధతుల ద్వారా టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. టెండర్లలో పాల్గొనే వారు 24 లోడింగ్‌ వాహనాలను అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుందని సూచించారు. దీని కోసం మెదక్‌ను ఒక క్లస్టర్‌గా, తూప్రాన్‌, నర్సాపూర్‌ రెవెన్యూ డివిజన్లను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశామని శ్రీనివాస్‌ వివరించారు. రవాణా పర్యవేక్షణ వ్యవహారాలను జిల్లాస్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2020-09-13T09:32:35+05:30 IST