కొనుగోళ్లు కొత్తగా...!

ABN , First Publish Date - 2021-09-06T07:26:38+05:30 IST

రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోవడం దగ్గర నుంచి డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవ్వడం వరకూ అనేక వ్యయప్రయాసలను ఎదుర్కొంటున్నారు.

కొనుగోళ్లు కొత్తగా...!

ధాన్యం సేకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌

మిల్లర్ల జోక్యానికి చెల్లు

విక్రయించిన వెంటనే జగదు జమయ్యే అవకాశం 

ఒంగోలు (జడ్పీ), సెప్టెంబరు 5 : రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోవడం దగ్గర నుంచి డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవ్వడం వరకూ అనేక వ్యయప్రయాసలను ఎదుర్కొంటున్నారు. మిల్లర్ల మితిమీరిన జోక్యం, తేమ, తరుగు పేరుతో కొర్రీలతోపాటు ప్రస్తుతం ఉన్న సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌పై రుణభారం పెరగడంతో రైతులకు సకాలంలో డబ్బులు జమచేయడం లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు ఏళ్ల తరబడి అన్నదాతలకు ఎదురయ్యాయి. వీటన్నింటికీ చెక్‌ పెట్టే దిశగా ప్రభుత్వం ధాన్యం సేకరణకు ప్రత్యేక సహాయ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనివల్ల మార్కెట్‌లో మిల్లర్ల జోక్యాన్ని నియంత్రించడంతోపాటు రైతులకు సకాలంలో చెల్లింపులు ఇతరత్రా ప్రక్రియలన్నీ సరళతరం కానున్నాయని ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి ఇటీవలే ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. అది భేటీ అయి జిల్లాల వారీగా ధాన్యం సాగు వివరాలతోపాటు సహకార కార్పొరేషన్‌ విధివిధానాలపై చర్చించింది. మిల్లర్ల ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలుకు ఉన్న అడ్డంకులపై జిల్లా యంత్రాంగాన్ని ఇటీవలే ఆరా తీసింది. దీనికి సంబంధించి తుది నిర్ణయం మరోవారంలో ఉపసంఘం తీసుకోనుందని సమాచారం. అదే జరిగితే ఖరీఫ్‌ ధాన్యం కొనుగో ళ్లు అన్నీ ప్రత్యేక కార్పొరేషన్‌ ద్వారానే జరుగుతాయి. తద్వారా రైతుల అమ్మకాల కష్టాలు తీరనున్నాయి.


మార్కెట్‌లో మిల్లర్ల ఇష్టారాజ్యం 

ధాన్యం మార్కెట్‌లో మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. ఒకటి అరా మిల్లులపైనో లేక అందుకు బాధ్యులైన వారిపైనో అధికారులు చర్యలు తీసుకున్నా, మళ్లీ సీజన్‌ వచ్చేసరికి నేతల అండతో వారి లీలలు కొనసాగుతూనే ఉన్నాయి. నూతన విధానంలో మిల్లర్లతో ఏమాత్రం సంబంధం లేకుండా ధాన్యం సేకరణ చేపడితే అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. అంతేకాకుండా రైతులకు వెంటనే డబ్బులను చెల్లించవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కొత్తగా సహాయ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం ద్వారా రుణ వెసులుబాటు కూడా కలిగే అవకాశముంది.


జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 30వేల హెక్టార్లలో వరిసాగు

ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 30వేల హెక్టార్లలో వరిసాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రబీ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 80కి పైగా కొనుగోలు కేంద్రాల నుంచి 75,500మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. 7,906 మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకున్నారు. ప్రత్యేక కార్పొరేషన్‌ విధానం అమల్లోకి వస్తే సేకరణ పరిమాణం కూడా పెరిగే అవకాశం ఉండటంతోపాటు చెల్లింపులు కూడా వెంటనే జరిగే అవకాశం ఉంది.


Updated Date - 2021-09-06T07:26:38+05:30 IST