వ్యతిరేకతలను వెనక్కి నెట్టి...చిత్రకళలో ప్రసిద్ధికెక్కి...

ABN , First Publish Date - 2022-06-29T09:49:55+05:30 IST

చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీసే నా ఆసక్తికి నాన్న ప్రోత్సాహం తోడయింది. స్కూలు చదువు పూర్తయిన తర్వాత, నన్ను ఫైన్‌ఆర్ట్స్‌ చదివించాలనేది నాన్న ఆలోచన.

వ్యతిరేకతలను వెనక్కి నెట్టి...చిత్రకళలో ప్రసిద్ధికెక్కి...

నేర్చుకున్న కళకు సృజనాత్మకతనూ, సొంత శైలినీ జోడించినప్పుడే కళాకారులుగా గుర్తింపు సాధ్యపడుతుంది. హైదరాబాద్‌కు చెందిన చిలువేరు ఉదయలక్ష్మి సరిగ్గా అదే పంథాను ఎంచుకుంది. కొత్త పెయింటింగ్‌ టెక్నిక్స్‌తో అందమైన కళాకృతులను సృష్టిస్తున్న ఉదయలక్ష్మి ‘నవ్య’తో తన చిత్రకళా పయనాన్ని ఇలా పంచుకున్నారు.


చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీసే నా ఆసక్తికి నాన్న ప్రోత్సాహం తోడయింది. స్కూలు చదువు పూర్తయిన తర్వాత, నన్ను ఫైన్‌ఆర్ట్స్‌ చదివించాలనేది నాన్న ఆలోచన. కానీ దానికి బంధువులు, సన్నిహితుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఆడపిల్ల బొమ్మలు వేయడం నేర్చుకుంటే ఏంఉపయోగం ఉంటుంది? పెళ్లికి కూడా ఇది అడ్డుగా మారవచ్చు అంటూ మమ్మల్ని వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. కానీ మా నాన్న పట్టుబట్టి, నా చేత ఎస్‌వి కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో బిఎ్‌ఫఎ, సెంట్రల్‌ యూనివర్శిటీలో ఎమ్‌ఎ్‌ఫఎ చదివించారు. ఆయన అంచనాలకు తగ్గట్టుగా టాప్‌ ర్యాంకర్‌గా పేరు తెచ్చుకుని, గురువుల ప్రశంశలు కూడా అందుకున్నాను. అలా చదువు పూర్తయ్యాక 2001లో ఇంట్లోనే ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు చేసుకుని, విద్యార్థులకు పెయింటింగ్‌ క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. అలాగే ఓ పక్క ఇన్‌స్టిట్యూట్‌ను నడిపిస్తూనే, ఆర్ట్‌ గ్యాలరీలలో పెయింటింగ్‌లతో ప్రదర్శనలు కూడా చేశాను. అదే సమయంలో నాదైన శైలిలో భిన్నమైన కళాకృతులను సృష్టించే ప్రయత్నం చేశాను. 


ప్రత్యేక శైలి కోసం...

పెయింటింగ్‌లో ప్రత్యేక గుర్తింపు కోసం నాదైన ప్రత్యేక శైలిని అలవరుచుకోడానికి నేనెంతో శ్రమించాను. ఇందుకోసం ఎన్నో రకాల ఆర్ట్‌ స్టైల్స్‌, కళాకృతులను గమనించాను. శిల్పారామంలో తంజావూరు పెయింటింగ్‌ క్యాంపు ఏర్పాటైనప్పుడు, నెల పాటు ఆ పెయింటింగ్‌ నేర్చుకున్నాను. అలాగే స్కల్ప్‌చర్‌ (శిల్పి) అయిన మా వారి పనితనాన్ని గమనించి, ఆ మెలకువలు ఒంటపట్టించుకున్నాను. ఇలా నాకు స్వతహాగా ఉన్న పెయుంటింగ్‌ టాలెంట్‌కు తంజావూరు శైలీ, శిల్పకళా మెలకువలను జోడించి, నాదైన సొంత స్టైల్‌ను సృష్టించుకున్నాను. నేను చేసిన ఎంబోజింగ్‌, ఫేస్‌ పెయుంటింగ్‌లు భిన్నంగా ఉంటాయి. అలాగే ఎంబోజింగ్‌ మ్యూరల్స్‌, ల్యాండ్‌స్కేప్స్‌, ఫిగర్స్‌, ఫ్లవర్స్‌ వర్క్స్‌ కూడా చేస్తూ ఉంటాను. ఇలా నాదైన శైలిలో పెయింటింగ్స్‌ మొదలుపెట్టిన తర్వాత, ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. పెయింటింగ్‌ క్లాసెస్‌ తీసుకునే తీరిక లేకుండా పోయింది.  


ఆదరణ వాటికే ఎక్కువ 

మ్యూరల్‌, ఆయిల్‌ పెయింటింగ్‌.. ఇలా ఎన్ని రకాల వర్స్స్‌ ఉన్నా, తంజావూర్‌ పెయింటింగ్‌లకే ఆదరణ ఎక్కువ. అయితే తంజావూరు పెయింటింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. భిన్నమైన పనితనాల మేళవింపుతో సాగే ఈ తరహా పెయింటింగ్‌లను తక్కువ సమయంలో ఒంటి చేత్తో పూర్తి చేయడం కష్టం కాబట్టి, కుందన్‌, గోల్డ్‌ వర్క్‌, డ్రేపర్స్‌, మాలల అలంకరణ.. ఇలా వేర్వేరు పనుల కోసం కొంతమంది అమ్మాయిలను కేటాయించాను. చివర్లో ఫేస్‌ పెయింటింగ్‌ మాత్రం నేనే చేస్తాను. శ్రావణమాసం, దసరా, దీపావళి.. అలాగే గృహప్రవేశాలు, పెళ్లిళ్లూ.. వేర్వేరు సీజన్లలో వేర్వేరు ఆర్డర్లు అందుతూ ఉంటాయి. బహుమతుల కోసం పెయింటింగ్‌లను వేయించుకునేవాళ్లూ ఉంటారు. ఇలా విదేశాల నుంచి కూడా ఆర్డర్లు అందుతూ ఉంటాయి. కొంతమంది సెలబ్రిటీలు కూడా పెయింటింగ్స్‌ వేయించుకున్నారు. సినీ నటి రవళి పదేళ్ల క్రితం నా దగ్గర తంజావూరు పెయింటింగ్‌ నేర్చుకున్నారు. డైరెక్టర్‌ విజయభాస్కర్‌ వేంకటేశ్వరస్వామి పెయింటింగ్‌ వేయించుకున్నారు. కొంతమంది మంత్రులకూ పని చేశాను. 


ధరలు ఇలా...

సైజు, పనితనం, పెయింటింగ్‌లోని బొమ్మల సంఖ్యను బట్టి ధర నిర్ణయిస్తాను. అలా నా తంజావూరు పెయింటింగ్స్‌ ధరలు ఐదారువేల నుంచి ఒకటి నుంచి ఆరు లక్షల వరకూ ఉం టాయి. సత్యన్నారాయణ స్వామి లేదా సీతారాముల కల్యాణం మొదలైన పెయింటింగ్స్‌లో లక్ష్మణుడు, హనుమంతుడు..ఇలా అదనంగా కనిపించే ప్రతి బొమ్మకూ అదనపు రుసుము తోడవుతూ ఉంటుంది. అదనపు ఫిగర్స్‌ను బట్టి ఉపయోగించే గోల్డ్‌ ఫాయిల్‌, కుందన్ల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ధర కూడా పెరుగుతుంది.


పదేళ్లుగా పెయింటింగ్‌లు అందిస్తూ...

మాంగల్య షాపింగ్‌ మాల్‌కు దాదాపు పదేళ్లుగా పెయింటింగ్‌లు అందిస్తున్నాను. అలా హైదరాబాద్‌లో ప్రారంభమయిన మాంగల్య బ్రాంచ్‌లు అన్నింటికీ వాళ్లు నన్నే సంప్రతిస్తూ, పెయింటింగ్‌లు వేయించుకున్నారు. ఇక్కడే కాకుండా, సిద్ధి పేట, కరీంనగర్‌, హన్మకొండ, వరంగల్‌ ఇలా ప్రతి మాంగల్య షాపింగ్‌ మాల్‌కూ నేనే పెయింటింగ్స్‌ వేస్తున్నాను. షాపింగ్‌ మాల్‌లో సీలింగ్‌ వర్క్‌ చేయడంతో పాటు, క్యాష్‌ కౌంటర్‌ దగ్గర అలంకరణ కోసం 5 నుంచి 6 అడుగుల తంజావూరు పెయింటింగ్‌ వేసి ఇస్తూ ఉంటాను. 


తోచిన తీరులో సహాయపడుతూ...

పెయింటింగ్‌ నేర్పించడంతో పాటు, దాంతో అవసరార్ధులకు ఎంతో కొంత ఉపాధి దక్కేలా సహాయపడుతూ ఉంటాను. నాకు వచ్చే కొన్ని చిన్నపాటి వర్క్స్‌ను సాటి మహిళా పెయింటర్లకు ఇస్తూ ఉంటాను. తంజావూర్‌ పెయింటింగ్‌ పూర్తి చేసి, ఫేస్‌ పెయింటింగ్‌ చేయలేని వాళ్లకు ఫేస్‌ పెయింటింగ్‌ వేసి ఇస్తూ ఉంటాను. పిల్లలు అమెరికాలో స్థిరపడడంతో, ఒంటరితనానికి లోనై, మానసికంగా కుంగిపోయే మహిళలకు కూడా మా పెయింటింగ్‌ స్టూడియోతో మంచి కాలక్షేపం దక్కుతూ ఉంటుంది. 

గోగుమళ్ల కవిత

ఫొటోలు: రాజ్‌ కుమార్‌


ప్రస్తుతం మధురానగర్‌లో ఉన్న స్టూడియోకు తోడు, ఇంకొక స్టూడియోను గచ్చిబౌలిలో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. క్రియేటివ్‌ వర్క్‌తో కొన్ని ఆర్ట్‌ షోలు చేయాలనే ఆలోచన కూడా ఉంది. 


మాది హైదరాబాదే. మా వారు మనోహర్‌, సెంట్రల్‌ యూనివర్శిటీలో ఎమ్‌ఎ్‌ఫఎ చేసి, క్రియేటివ్‌ వర్క్‌కి పరిమితమయ్యారు. మా వారు కూడా ఆర్టిస్టే కాబట్టి మాది ప్రేమ వివాహం అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అంతకు ముందు వరకూ నాకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ వాళ్లు పెట్టే షరతులతో తప్పిపోతూ ఉండేవి. పెళ్లయ్యాక ఇంటికే పరిమితం కావాలనీ, ఆర్ట్‌ మానేయాలనీ వాళ్లు కండిషన్లు పెడుతూ ఉండేవాళ్లు. ఆ సమయంలో కుటుంబ స్నేహితులైన మా వారు కూడా స్వతహాగా ఆర్టిస్టు కాబట్టి ఇలాంటి కండిషన్లేవీ లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు. మాకొక బాబు. పేరు ఇనిష్‌. ఇప్పుడు ఇంటర్లో చేరబోతున్నాడు. 

Updated Date - 2022-06-29T09:49:55+05:30 IST