మగతనానికి మేకోవర్‌

ABN , First Publish Date - 2020-12-09T05:30:00+05:30 IST

ఎరుపెక్కిన పెదాలు... సింగారించిన కనుబొమలు... పొగబారిన కళ్లు... మెరిసే మేని... పూర్తి మేకోవర్‌ ఫొటో ఒకటి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండీగా మారింది. ఆ ఫొటో అమ్మాయిదనుకొనేరు! అబ్బాయిది! ఇదిగో ఈ ఫొటోలో ఉన్నది ఆ సుందరాంగుడే! పేరు పుష్పక్‌ సేన్...

మగతనానికి మేకోవర్‌

ఎరుపెక్కిన పెదాలు... సింగారించిన కనుబొమలు... పొగబారిన కళ్లు... మెరిసే మేని... పూర్తి మేకోవర్‌ ఫొటో ఒకటి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండీగా మారింది. ఆ ఫొటో అమ్మాయిదనుకొనేరు! అబ్బాయిది! ఇదిగో ఈ ఫొటోలో ఉన్నది ఆ సుందరాంగుడే! పేరు పుష్పక్‌ సేన్‌. ఊరు కోల్‌కతా. అతడి మేకోవర్‌కు ఒక కారణం ఉంది. యాభై నాలుగేళ్ల వాళ్ల అమ్మ ఓ శుభకార్యానికి వెళితే, ఆమె వేసుకున్న లిప్‌స్టిక్‌ చూసి హేళన చేశారట బంధువులు. దానికి ప్రతీకారంగా పుష్పక్‌ ఇలా పువ్వులా తయారయ్యాడు. ‘నేనూ మేకప్‌ వేసుకున్నాను... చూసుకోండిరా’ అంటూ ఆవేదనగా ఈ ఫొటో పెట్టాడు. అతడికి నెటిజన్లు మద్దతు తెలిపారు. ఈ కథ పక్కన పెడితే... అసలు మనోడి స్టయిలే వేరు. అమ్మాయిల్లా ముఖానికి టచ్‌పలు అద్దుకోవడం... రింగులు తొడగడం... సిగన పువ్వులు ధరించడం... అతడి ఇన్‌స్టాగ్రామ్‌ నిండా ఇలానే ఉంటాయి అతడి ఫొటోలు. వాటికి వేల లైక్‌లు కూడా ఉండడం మరో విశేషం. ‘మాకూ అలానే మేకప్‌ వేసుకోవాలని ఉంది. కానీ అలా రెడీ అయితే గేలుగా ముద్ర వేస్తున్నారు’ అంటూ ఓ కుర్రాడు కామెంట్‌ చేశాడు. పుష్పక్‌ కామెంట్స్‌ అన్నీ పరిశీలిస్తే ఇలాంటి వారు ఎందరో! 


నిజానికి రోజులు మారాయి. మేకప్‌ మగువలకే అనుకొనే రోజులు పోయాయి. ఇప్పుడు చాలామంది మగవారు మేక్‌పతో మెరుగులు అద్దుకొంటూ మగతనానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు. విదేశాల్లో ఉందీ ట్రెండ్‌. ప్రస్తుతం మన దేశంలోనూ ఊపందుకుంటోంది. నమ్మలేనివారు పుష్పక్‌ సేన్‌ను చూసిన తరువాతైనా ఒప్పుకోవాలి. అతడే కాదు... హాలీవుడ్‌ సెలబ్రిటీలు కొందరు ఇలా అమ్మాయిలను తలపించే ఆహార్యంతో అలరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పాప్‌స్టార్స్‌లో ఈ ట్రెండ్‌ మరీ ఎక్కువ. ఆర్టిస్ట్‌, హెయిర్‌ స్టైలిస్ట్‌ రోనన్‌ మిలి మాటల్లో చెప్పాలంటే... ‘మేకప్‌ వల్ల అందంగా కనిపిస్తాం. అది మంచి అనుభూతినిస్తుంది. కనుక ఎవరో ఏదో అనుకుంటారనేది వదిలేయాలి. మనకు ఏది నచ్చుతుందో అది చేయాలి. అయితే అది శృతి మించకూడదు. చాలామంది భారత యువకులకు కూడా మేకప్‌ వేసుకోవాలనే తపన ఉంటుంది. కానీ చుట్టూ ఉన్న సమాజం హేళన చేస్తుందేమోనన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. నన్నూ అలాగే చులకనగా మాట్లాడారు. కానీ నేను అవేవీ పట్టించుకోలేదు’. 

మరో ఆశ్చర్యకర విషయమేమంటే... దేశంలో సౌందర్య ఉత్పత్తుల వినియోగించే మగవారు అంతకంతకూ పెరుగుతున్నారట. ‘అసోచామ్‌’ నివేదిక ప్రకారం 2018లో మేల్‌ గ్రూమింగ్‌ ఇండస్ర్టీ  విక్రయాల విలువ 16,800 కోట్లు. రాబోయే మూడేళ్లలో ఈ వ్యాపారం 35 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ముఖ్యంగా 25 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులు సౌందర్య సాధనాలపై అధికంగా ఖర్చు చేస్తున్నారట. ఓ అధ్యయనం ప్రకారం భారతీయ పురుషుడు రోజుకు సగటున 42 నిమిషాలు ముస్తాబవడానికి వెచ్చిస్తున్నాడట. అదే పట్టణాల్లో అయితే ఈ సగటు 61 నిమిషాలు! ఈ మార్పునకు ప్రధాన కారణాల్లో ఒకటి సామాజిక మాధ్యమాలనేది ఆ అధ్యయన సారాంశం. 


Updated Date - 2020-12-09T05:30:00+05:30 IST