Abn logo
Aug 1 2021 @ 03:28AM

టీకా కేంద్రాలు, రేషన్‌ షాపుల వద్ద.. ప్రధాని మోదీ ఫ్లెక్సీలు పెట్టండి

కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగట్టండి.. బీజేపీ నేతలతో సంతోష్‌ 

సోషల్‌ మీడియా ఉంటే నెహ్రూ ప్రధాని అయ్యేవారు కాదు: దుష్యంత్‌

అమరుల త్యాగాలు వృథా కానివ్వం: బండి సంజయ్‌


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘‘పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యంలో రూ.28 ప్రధాని మోదీయే ఇస్తున్నారు. వ్యాక్సిన్‌ను కేంద్రమే ఉచితంగా పంపిణీ చేస్తోంది. అందువల్ల రేషన్‌ దుకాణాలు, వ్యాక్సిన్‌ సెంటర్ల వద్ద మోదీ ఫ్లెక్సీలను పెట్టండి. టీఆర్‌ఎస్‌ వాళ్లు తీసేస్తే మళ్లీ పెట్టండి. ప్రధాని మోదీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి’’ అని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీ.ఎల్‌. సంతోష్‌ వ్యాఖ్యానించారు. శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మోర్చాలు, పార్టీ ఆఫీస్‌ బేరర్లు, సీనియర్‌ నాయకులతో ఆయన విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.


మరోవైపు సంస్థాగత బలోపేతం కీలకమని సూచించారు. ‘‘తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మేం వ్యూహం రూపొందిస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో మీరు పనిచేయాలి. తెలంగాణలో 30 వేల బూత్‌లలో గట్టిగా ఉండాలి. మన లక్ష్యం 2023 ఎన్నికలే. హుజూరాబాద్‌ ఉప ఎన్నికే సర్వస్వం కాదు. మన పార్టీ కార్యక్రమాల్లో అది ఒక భాగం మాత్రమే. అక్కడ పనిచేసినట్లుగానే మిగతా నియోజకవర్గాల్లో కూడా పనిచేయాలి’’ అని రాష్ట్ర పార్టీ నాయకత్వానికి సంతోష్‌ దిశానిర్దేశం చేశారు. బీజేపీ అనుబంధ సంఘాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట నాయకుల ఫ్లెక్సీలతో పాటు.. పీవీ సింధు, మీరాబాయి చానుల ఫ్లెక్సీలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.  


నాడు సోషల్‌ మీడియా ఉండి ఉంటే..  నెహ్రూ ప్రధాని అయ్యేవారు కాదు : దుష్యంత్‌ 

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు సోషల్‌ మీడియా ఉండి ఉంటే జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధాని అయ్యేవారు కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ వ్యాఖ్యానించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సోషల్‌ మీడియా జాతీయ వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెహ్రూ కారణంగా జమ్మూ కశ్మీర్‌ సమస్య జటిలం కాగా, సర్దార్‌ పటేల్‌ ధైర్యసాహసాలతో హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనమైందని దుష్యంత్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సుష్మాస్వరాజ్‌ పాత్ర కీలకమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పార్టీ సైద్ధాంతిక భావజాల వ్యాప్తి కోసం, బీజేపీ జెండా ఎగురవేసేందుకు ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. వారి త్యాగాలు వృథా కానివ్వబోమని.. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు టీకా ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌లు కృషిచేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.


కర్ణాటక ఎస్సీ మోర్చా ఇన్‌చార్జ్‌గా ఎస్‌.కుమార్‌

బీజేపీ ఎస్సీ మోర్చా కర్ణాటక ఇన్‌చార్జ్‌గా సీనియర్‌ నేత ఎస్‌.కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మోర్చా జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మోర్చా తెలంగాణ ఇన్‌చార్జ్‌గా జయకుమార్‌ కాంగేను నియమించారు. ఈ మేరకు పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్‌సింగ్‌ ఆర్య ఉత్తర్వులు జారీచేశారు.