‘తిరుపతి’లో రీ పోలింగ్‌ పెట్టండి

ABN , First Publish Date - 2021-04-20T08:14:31+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ నేతలు దొంగ ఓట్ల దందా సాగించిన తిరుపతిలో రీ పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విజ్ఞప్తి చేశారు

‘తిరుపతి’లో రీ పోలింగ్‌ పెట్టండి

భారీగా వైసీపీ నేతల దొంగ ఓట్ల దందా 

వలంటీర్ల సాయంతో నకిలీ ఓటరు కార్డులు 

ఇతర ప్రాంతాల వారితో వేయించారు

ప్రతిపక్ష నేతలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు

దొంగ ఓటర్ల వల్ల అసలు ఓటర్లు రాలేదు

చర్యలు తీసుకోవడంలో పోలీసుల వైఫల్యం

అసెంబ్లీ స్థానం పరిధిలో ఎన్నిక రద్దు చేయండి

ఎన్నికల సంఘానికి చంద్రబాబు 22 పేజీల లేఖ

చెవిరెడ్డి ఆడియో క్లిప్‌ సహా 11 వీడియోల జత 


అమరావతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక  సందర్భంగా వైసీపీ నేతలు దొంగ ఓట్ల దందా సాగించిన తిరుపతిలో రీ పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విజ్ఞప్తి చేశారు. తిరుపతి అసెంబ్లీ స్థానం వరకూ ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని కోరారు. సోమవారం ఆయన ఈ మేరకు 22 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఈ నెల 17న జరిగిన ఎన్నికలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు పోలయ్యాయని, ప్రతిపక్ష పార్టీల నేతలు రెడ్‌ హ్యాండెడ్‌గా దొంగ ఓటర్లను పట్టుకొన్నారని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని బస్సుల్లో పెద్ద సంఖ్యలో తీసుకువచ్చి దొంగ ఓట్లను వేయించడానికి రచించిన ప్రణాళికపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తమ పార్టీ నేతతో మాట్లాడిన ఫోన్‌ సంభాషణ బహిర్గతమైందని, అధికార పార్టీ అక్రమాలకు ఇది అద్దం పడుతోందని పేర్కొన్నారు. చెవిరెడ్డి ఫోన్‌ సంభాషణల ఆడియో క్లిప్పింగ్‌తో పాటు పోలింగ్‌ రోజు తిరుపతిలో చోటు చేసుకొన్న దొంగ ఓట్ల దందాకు సంబంధించి 11 వీడియో క్లిప్పింగులను లేఖకు జత చేశారు. ‘‘ప్రభుత్వ వేతనంపై పనిచేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో.. ఇళ్లు మారిన వారు, చనిపోయిన వారు, వలస వెళ్లిన వారి వివరాలు సేకరించి వారి పేర్లతో నకిలీ ఓటర్‌ కార్డులు ముద్రించారు. 


ఆ కార్డుల సాయంతో దొంగ ఓట్లు వేయడానికి ఇతర నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వేల మందిని తిరుపతిలో దింపారు. ముద్రించిన ఓటర్‌ కార్డుల వెనుక ఓటర్ల జాబితా సీరియల్‌ నెంబర్‌ స్టిక్కర్‌ కూడా వేసి దొంగ ఓటర్ల చేతికి ఇచ్చి పంపారు. ఇవన్నీ వీడియోల్లో రికార్డయ్యాయి. దొంగ ఓటర్లు తాము తీసుకువచ్చిన ఓటర్‌ కార్డులోని ఓటరుకు సంబంధించిన వివరాలు చెప్పలేక తెల్లమొహం వేశారు. గట్టిగా నిలదీస్తే కొంత మంది పారిపోయారు. కొంత మంది తెలియక వచ్చామని ఒప్పుకొన్నారు. టీడీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు కూడా దొంగ ఓటర్లను పట్టుకొన్నారు. 250 బస్సులను వెనక్కు పంపామని డీజీపీ ప్రకటించారు. ఎన్ని వందల బస్సుల్లో దొంగ ఓటర్లను సమీకరించారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దొంగ ఓటర్ల అరాచకంతో తిరుపతిలో అసలు ఓటర్లు ఓటు వేయడానికి రాలేదు. గత ఎన్నికలతో పోలిస్తే అక్కడ ఓటింగ్‌ శాతం తగ్గింది. 


దొంగ ఓటర్ల వ్యవహారాన్ని టీవీ ఛానళ్లు సమగ్రంగా వెలుగులోకి తెచ్చి చూపించాయి. చర్యలు తీసుకోవడంలో స్థానిక పోలీస్‌ యంత్రాంగం విఫలమైంది. స్థానిక ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. 80ఏళ్లు పైబడిన వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లను వైసీపీ నాయకులు బలవంతంగా లాక్కొని తమకు అనుకూలంగా వేసుకొన్నారు. ఇంత బహిరంగంగా ప్రజాస్వామ్యం అపహాస్యం అయినా చర్యలు తీసుకోకపోతే ఎన్నికలకు విలువ ఉండదు. తిరుపతి అసెంబ్లీ స్థానం వరకూ ఎన్నికను రద్దు చేసి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో మళ్లీ పోలింగ్‌ నిర్వహించండి’’ అని చంద్రబాబు లేఖలో కోరారు. 


దొంగ ఓట్లేయలేదని ప్రమాణం చేస్తారా?: అచ్చెన్నాయుడు

విశాఖపట్నం: ‘‘తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పది మంది నిజమైన ఓటర్లు ఓటు వేస్తే, 40 మంది దొంగ ఓట్లు వేశారు. పోలింగ్‌ నిజాయితీగా జరిగిందని, ఎక్కడా దొంగ ఓట్లు వేయలేదని సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి, విప్‌ భాస్కరరెడ్డి, డీజీపీ సవాంగ్‌, తిరుపతి లోక్‌సభ రిటర్నింగ్‌ అధికారి... తిరుమల వెంకటేశ్వరస్వామి ఎదుట ప్రమాణం చేయగలరా? దొంగ ఓట్లు వేయలేదని ఆ ఐదుగురూ వెంకటేశ్వరస్వామి ఎదుట ప్రమాణం చేస్తే అక్కడే మేము లెంపలేసుకుంటాం’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. ఉప ఎన్నిక అక్రమాలపై కోర్టులో కేసువేస్తున్నట్టు ప్రకటించారు. 


మేం కుక్కను కరవలేం.. కాకాని తిట్లపై జవహర్‌ వ్యాఖ్య

‘కుక్క మనను కరిచిందని తిరిగి మనం కుక్కను కరవలేం. మా నాయకుడు చంద్రబాబు మాకు ఇదే చెప్పారు. మీకూ ఇదే వర్తిస్తుంది’ అని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘చంద్రబాబును తిడితే మంత్రి పదవి వస్తుందన్న భ్రమతో కాకాని నోరు పారేసుకొని తన కుసంస్కారం బయట పెట్టుకొన్నారు. ఆయన తనను తాను ఎక్కువ ఊహించుకోవడం మానేస్తే ఆరోగ్యానికి మంచిది’’ అని జవహర్‌ సూచించారు. 

Updated Date - 2021-04-20T08:14:31+05:30 IST