అటకపై మృతదేహాన్ని పెట్టి.. సిమెంటుతో గోడ కట్టి

ABN , First Publish Date - 2021-01-17T07:46:46+05:30 IST

ప్రియురాలిని గొంతుపిసికి హత్యచేసిన ఓ వ్యక్తి, ‘దృశ్యం’ సినిమా స్ఫూర్తితో మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. తన

అటకపై మృతదేహాన్ని పెట్టి.. సిమెంటుతో గోడ కట్టి

వాసన రాకుండా యాంటీ-లీకేజీ రసాయనం మిక్స్‌ 

దృశ్యం సినిమా స్ఫూర్తితో ప్రియురాలిని హత్యచేసిన వ్యక్తి

మహారాష్ట్రలో ఘటన.. 3నెలల తర్వాత వెలుగులోకి


ముంబై, జనవరి 16: ప్రియురాలిని గొంతుపిసికి హత్యచేసిన ఓ వ్యక్తి, ‘దృశ్యం’ సినిమా స్ఫూర్తితో మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. తన అద్దె ఇంట్లోని స్నానపుగది అటకపైన మృతదేహాన్ని ఉంచి.. సిమెంటు, సున్నం మిక్స్‌ చేసి చుట్టూ గోడకట్టాడు. లోపలి నుంచి మృతదేహం కుళ్లిన వాసన రాకుండా ఉండేందుకు సిమెంటు, సున్నంలో యాంటీ-లీకేజీ గ్లూ కూడా కలిపాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా వన్‌గావ్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మూడు నెలల తర్వాత వెలుగుచూసింది.


నిందితుడు 34 ఏళ్ల హర్మాల్కర్‌. హతురాలు 32 ఏళ్ల అమితా మోహితే. ఇద్దరూ వన్‌గావ్‌లోనే ఉంటున్నారు. ఆరేళ్ల క్రితం మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థలో కలిసి పనిచేసిన రోజుల్లో ఇద్దరికి పరిచయమైంది. అది ప్రేమకు దారితీసింది. పెళ్లికి అమిత ఇంట్లో అంగీకరించారు. గత ఏడాది అక్టోబరు 21న హర్మాల్కర్‌ను కలిసేందుకు వెళుతున్నానంటూ ఇంట్లోవాళ్లకి అమిత చెప్పి బయటపడింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. ఫోన్‌ చేసినా స్పందన రాలేదు. ఆమె వాట్సాప్‌ నుంచి మాత్రం తాను హర్మాకర్‌ పెళ్లి చేసుకున్నామంటూ కుటుంబసభ్యులకు మెసేజ్‌ వచ్చింది.


హర్మాల్కర్‌కు వారు ఫోన్‌ చేసినా స్పందన లేకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతవారం అమిత సోదరుడికి రోడ్డు మీద హర్మాల్కర్‌ కనిపిస్తే అతడిని పట్టుకొని వెళ్లి పోలీసులకు అప్పగించాడు. అమిత గురించి అతడిని అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి ఆమెను హత్యచేసినట్లు చెప్పాడు.


తనకు అప్పటికే పెళ్లయిందని, ఈ విషయం తెలియని అమిత, తనను పెళ్లి చేసుకోమంటూ తరచూ వేధిస్తుండటంతో చంపేసినట్లు వెల్లడించాడు. దృశ్యం సినిమా స్ఫూర్తితో మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నట్లు చెప్పాడు. అతడిచ్చిన సమాచారం మేరకు ఇంటి బాత్‌రూం అటకపైన నిర్మాణాన్ని పగులగొడితే ఓ అస్తిపంజరం బయటపడింది. దానిని డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం పంపారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2021-01-17T07:46:46+05:30 IST